ఎంపీ కాళ్లు కడిగి.. ఆ నీటినే తాగి..

BJP man Washes Nishikant Dubeys Feet and Drinks That Water - Sakshi

జార్ఖండ్‌(గొడ్డా) : జార్ఖండ్‌కు చెందిన ఓ బీజేపీ ఎంపీపై నెటిజన్లు మండిపడుతున్నారు. గొడ్డా పార్లమెంట్‌ నియోజక వర్గ ఎంపీ నిశికాంత్‌ దుబే ఆదివారం ఓ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో బీజేపీ కార్యకర్త పవన్‌ ఓ ప్లేట్‌ తీసుకొచ్చి అందులో నిశికాంత్‌ కాళ్లను కడిగి ఓ క్లాత్‌తో శుభ్రంగా తుడిచారు. అనంతరం ప్లేట్‌లో ఉన్న మట్టినీళ్లను పవన్‌ తాగారు. అక్కడే ఉన్న బీజేపీ కార్యకర్తలు ఈ తతంగాన్నంతా చూసి పవన్‌ భాయ్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు కూడా చేశారు. దీనికి సంబంధించి వీడియోను నిశికాంత్‌ తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక ఎంపీ అయ్యి ఉండి ఓ కార్యకర్తతో అలా చేపించడమేంటని ధ్వజమెత్తారు. కాళ్లు కడిగిన నీళ్లు తాగుతుంటే ఏం చేస్తున్నావంటూ నిప్పులు చెరిగారు. ఓ కార్యకర్త తెలిసో తెలియకో అలా చేస్తే, సర్ధి చెప్పాల్సింది పోయి, ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తారా అంటూ నెటిజన్లు ఫైర్‌ అయ్యారు. దీంతో వెంటనే తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ నుంచి ఆ వీడియోను నిశికాంత్‌ తొలగించారు. ఇది జార్ఖండ్‌లో సర్వసాధారణమని, మహాభారతంలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు సుదామ కాళ్లు కడిగారని గుర్తు చేస్తూ ఈ సంఘటనను నిశికాంత్‌ సమర్థించుకునే ప్రయత్నం చేశారు.

ఇంతకు ముందు కూడా జార్ఖండ్‌లో ఇద్దరు ముస్లింలను కొట్టిచంపిన కేసులో నిందితులకు న్యాయపరంగా సాయమందిస్తానని నిషికాంత్‌ ప్రకటించడంతో విమర్శలపాలయ్యారు. గొడ్డా జిల్లాలో పశువుల దొంగతనం నెపంతో ఇద్దరు ముస్లిం వ్యక్తులను దాదాపు 100 మంది మూక కొట్టిచంపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. కాగా.. నిందితుల కుటుంబీకులు తనను కలిసి, న్యాయపరంగా సాయం కోరారని, కేసు విచారణలో భాగంగా నిందితుల లీగల్‌ వ్యవహారాల ఖర్చు మొత్తం తానే భరిస్తానని హామీ ఇచ్చారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ నిందితులకు అండగా నిలుస్తానని చెప్పడం ఏంటని తీవ్రస్థాయిలో విమర్శలొచ్చాయి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top