
సాక్షి, న్యూఢిల్లీ : క్యాన్సర్ చికిత్స నిమిత్తం న్యూయార్క్ వెళ్లిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ భారత్‌కు తిరిగి వచ్చారు. ఈ మేరకు ‘ఇంటికి తిరిగి రావడం సంతోషంగా ఉంది’ అని శనివారం ఆయన ట్వీట్ చేశారు. తొడ భాగంలో అరుదైన క్యాన్సర్ సోకడంతో గత నెల 13న వైద్య పరీక్షల కోసం జైట్లీ అమెరికా వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్నప్పటికీ సోషల్ మీడియాలో చురుగ్గానే ఉంటున్నారు. కాగా ఆయన స్థానంలో తాత్కాలిక ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన పీయూష్ గోయల్.. గత శుక్రవారం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
కాగా జైట్లీ అనారోగ్యం పాలవడం ఇదే మొదటిసారి కాదు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జైట్లీ బరువు తగ్గేందుకు బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారు. అంతేకాదు గతేడాది మే 14న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో జైట్లీ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. ఇక జైట్లీ కోలుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘ వెల్‌కమ్ బ్యాక్ సర్!! మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి’ అని టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ట్విటర్ వేదికగా ఆకాంక్షించారు.
Welcome back sir !! Wish you good health !!! https://t.co/ow0jSPRZmU
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 9, 2019