కాలుష్యంతో 25 లక్షల మంది మృతి

25 Lakh Killed in India Due to Pollution, Highest in the World

ప్రపంచ వ్యాప్తంగా 90 లక్షల మంది దుర్మరణం

రెండో స్థానంలో చైనా

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం కారణంగా సంభవించే మరణాలు భారత్‌లోనే అత్యధికమని ఓ అధ్యయనంలో తేలింది. 2015లో కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90 లక్షల మంది చనిపోతే, ఒక్క భారత్‌లోనే 25 లక్షల మంది మృత్యువాత పడ్డారని పరిశోధకులు తెలిపారు. ఈ జాబితాలో 18 లక్షల మరణాలతో చైనా రెండో స్థానంలో ఉందన్నారు. ఐఐటీ ఢిల్లీతో పాటు అమెరికాకు చెందిన ఐకాన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు.

కాలుష్యం కారణంగా సంభవించే గుండె సంబంధిత వ్యాధులు, పక్షవాతం, ఊపిరితిత్తుల కేన్సర్, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల కారణంగానే భారత్‌లో ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 2015లో వాయు కాలుష్యంతో 65 లక్షల మంది చనిపోతే, నీటి కాలుష్యంతో 18 లక్షల మంది, పని ప్రదేశంలో కాలుష్యంతో 8 లక్షల మంది దుర్మరణం చెందారని పేర్కొన్నారు. పారిశ్రామికంగా వేగంగా పురోగమిస్తున్న భారత్, చైనా, పాక్, బంగ్లాదేశ్, మడగాస్కర్, కెన్యాల్లో చనిపోయే ప్రతి నలుగురిలో ఒకరు కాలుష్యం కారణంగానే మరణించారన్నారు.

ఢిల్లీలో తీవ్రస్థాయిలో కాలుష్యం
న్యూఢిల్లీ: దేశరాజధానిలో టపాసుల క్రయవిక్రయాలపై సుప్రీం కోర్టు నిషేధం విధించినప్పటికీ కాలుష్యం ఏమాత్రం తగ్గలేదు. గురువారం సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటలవరకు ఢిల్లీ టపాసుల చప్పుళ్లతో మార్మోగింది. సాధారణంగా ఢిల్లీలో క్యూబిక్‌ మీటర్‌ గాలిలో 60 నుంచి 100 మైక్రోగ్రాములు ఉండే పీఎం 2.5, పీఎం 10 అల్ట్రాఫైన్‌ రేణువులు సాయంత్రం ఆరు తర్వాత వరుసగా 424, 571 మైక్రోగ్రాములకు చేరుకున్నాయి. గతేడాదితో పోలిస్తే దీపావళి వేడుకలు ఈసారి ప్రశాంతంగానే జరిగాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top