‘ది బెస్ట్‌’ అనిపించుకుంటా

Pujitha Ponnada Special Chit Chat With Sakshi

రంగస్థలం’ ఫేం పూజిత పొన్నాడ

శ్రీనగర్‌కాలనీ:  ఆమె ఓ ఎమ్మెల్యే కూతురు. పట్నంలో చదువుకునేటప్పుడు దొరబాబును ప్రేమించింది. దొరబాబు అంటే తమ్ముడు చిట్టిబాబుకు అమితమైన ప్రేమ. అనుకోకుండా దొరబాబు వాళ్ల ఊరి ప్రెసిడెంట్‌ను ఎదిరించాడు. ఎన్నికల్లో కూడా అతనికి పోటీగా నిలబడ్డాడు. ఇంత బిజీగా ఉన్నాసరే ఆదివారం వచ్చిందంటే మాత్రం దొరబాబు ఆమెను చూడ్డానికి పట్నం వెళుతుంటాడు. ఈ కథ ఎక్కడో విన్నట్టో.. చూసినట్టో ఉంది కదూ..! అదేనండి ‘రంగస్థలం’ చిత్రంలోని సన్నివేశం. ఈ సినిమాలోని ప్రతి క్యారెక్టర్‌ కథలో కీలకమైనదే. ఇందులో దొరబాబు(ఆది పినిశెట్టి) ప్రేమించిన ఎమ్మెల్యే కూతురు పేరు గుర్తుందా.. ‘పద్మ’. ఆమె అసలు పేరు ‘పూజిత పొన్నాడ’. అంతకుముందే యూట్యూబ్‌లో ఎంతోమందికి పరిచమైన పూజిత.. పద్మగా మంచి మార్కులే కొట్టేసింది. ప్రస్తుతం ‘వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మి’లో మరో కీలక పాత్ర చేసి మెప్పించింది. ఈ సందర్భంగా పూజిత తన వెండి తెర ఎంట్రీని ‘సాక్షి’తో పంచుకుంది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...  

మాది వైజాగ్‌. నాన్న బిజినెస్‌మెన్, అమ్మ గృహిణి. పుట్టింది వైజాగ్‌లోనే కానీ ఢిల్లీలో చదువుకున్నా. చెన్నైలో ఇంజినీరింగ్‌ చేశాను. తర్వాత హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ జాబ్‌లో చేరాను. స్కూలింగ్, కాలేజీ రోజుల్లో చాలా రిజర్వ్‌డ్‌గా ఉండేదాన్ని. చదువు తప్ప మరో వ్యాపకం ఉండేది కాదు. నా హాబీస్‌ బుక్స్‌ చదవడం, ఆర్ట్స్‌ వేయడం. జాబ్‌ చేస్తున్న సమయంలో ఫేస్‌బుక్‌లో ఓ ఫ్రెండ్‌ ద్వారా ‘ఉప్మా తినేసింది’ షార్ట్‌ఫిలిం యూనిట్‌ అప్రోచ్‌ అయ్యారు. అలా షార్ట్‌ఫిలింస్‌లో అనుకోకుండా నటించాను. ఫస్ట్‌టైం కెమెరా ముందు ధైర్యం తెచ్చుకొని నటించాను. సింగిల్‌ టేక్‌లో షాట్స్‌ ఓకే అవుతుంటే నాపై నమ్మకం పెరిగింది. అలా ‘పరిచయం, బూచి, అను నేను తను’ లాంటి 10 షార్ట్‌ ఫిలింస్‌లో నటించాను.  

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం మానేసా..
నేను నటించడం ఇంట్లో వారికి అసలు ఇష్టం లేదు. జాబ్‌ పైనే దృష్టిపెట్టమన్నారు. అయితే, నా షార్ట్‌ఫిలింస్‌ చూసిన అమ్మ ఫ్రెండ్స్‌ అభినందిస్తూ మెజేస్‌లు చేయడంతో అమ్మ కూడా ఆనందించింది. జాబ్‌తో పాటు అప్పుడప్పుడు షార్ట్‌ ఫిలింస్‌ చేస్తుండటంతో ఇంట్లో వాళ్లు కూడా ప్రోత్సహించారు. ఓ షార్ట్‌ఫిలింలో నన్ను చూసిన దర్శకుడు సుకుమార్‌ ‘దర్శకుడు’ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చారు. ఆ సినిమా చేస్తున్న సమయంలో డేట్స్‌ కుదరక యాక్టింగ్‌పై పూర్తిగా దృష్టి పెట్టాలని నిర్ణయించుకొని జాబ్‌ మానేశాను. ఈ విషయం ఇంట్లో తెలిసి పేరెంట్స్‌ చాలా కోప్పడ్డారు. తర్వాత నా డెడికేషన్‌ నచ్చి సినీ రంగంలోకి వెళ్లమని, నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని మనసారా ఆశీర్వదించారు.  

‘రంగస్థలం’తో గుర్తింపు
రంగస్థలం చిత్రంలో ప్రకాష్‌రాజ్‌ కుమార్తె పద్మగా ఆది పినిశెట్టికి జోడిగా నటించాను. సినిమా ఘన విజయం సాధించడంతో మంచి గుర్తింపు వచ్చింది. సుకుమార్‌తో పాటు చిత్రంలోని అందరూ చాలా ప్రోత్సహించారు. తర్వాత దర్శకుడు మారుతి నిర్మాణంలోని ‘బ్యాండ్‌ బాబు’, దర్శకురాలు సంజనారెడ్డి చిత్రం ‘రాజుగాడు’లో నటించాను. రీసెంట్‌గా ‘వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మి’లో మంచి ప్రాతలో నటించాను. సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇంకా రాజశేఖర్‌ ‘కల్కి, సెవెన్‌’తో పాటు మరో పెద్ద ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాను. దర్శకులు సుకుమార్, మారుతి నన్ను ప్రోత్సహించారు. 

రిజర్వ్‌డ్‌ పర్సన్‌ని..
స్కూలింగ్‌ నుండి కాలేజీ డేస్‌తో పాటు జాబ్‌లో కూడా చాలా రిజర్వ్‌డ్‌గా ఉండేదాన్ని. ఎవరితోనూ అంత క్లోజ్‌ అయ్యేదాన్ని కాదు. చదువే ఫస్ట్‌ అన్నట్లుగా నా ప్రయాణం సాగింది. తొమ్మిదో తరగతిలో లంచ్‌ టైమ్‌లో ఓ అబ్బాయి మోకాళ్ళ మీద కూర్చొని ప్రపోజ్‌ చేశాడు. ఇలా చేస్తాడని అసలు ఊహించలేదు. ఒక్క నిమిషం చేయి వాష్‌ చేసుకొని వస్తానని చెప్పి అక్కడి నుండి నేను జంప్‌. టెన్త్‌లో నా ఫ్రెండ్‌ స్కూల్‌ ఫంక్షన్‌లో నా ఫస్ట్‌ లవ్‌ పూజితకి ఈ పాట అంకితం అని స్టేజీ మీద అందరి మందు చెప్పేసాడు. నేను వెంటనే ఫంక్షన్‌ నుండి వెళ్లిపోయాను. ఆ వయసులో భయంతో పాటు సిగ్గు, బిడియం ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు చాలా కంఫర్ట్‌గా ధైర్యంతో ఉన్నాను. 

తెలుగమ్మాయిలు‘ది బెస్ట్‌’ అనిపించుకోవాలి
అందరూ బాగా నటిస్తారు. కానీ తెలుగమ్మాయిలు ‘ద బెస్ట్‌’ అనిపించుకొనేలా చేయాలని ఉంది. నా వరకూ నేను కష్టపడతాను. హావభావాలను పలికిస్తూ ది బెస్ట్‌ పర్ఫామెన్స్‌ ఇవ్వడానికి కృషి చేస్తాను. ‘సమ్మోహనం’ తర్వాత దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాలో చేయాలని ఉంది. కథాబలమున్న పాత్రలు రావాలని కోరుకుంటున్నాను. పెద్ద బ్యానర్‌లో పనిచేయాలని ఉంది. నటిగా నన్ను నేను పరీక్షించుకోవడానికి అవకాశం ఉంటుందని నా ఉద్దేశం. ‘వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మి’ చిత్రంలో అన్ని షేడ్స్‌ ఉన్న రోల్‌లో నటించాను. గ్లామెరెస్‌ రోల్స్‌తో పాటు అన్ని పాత్రలు చేయగలను. రూమర్స్‌ని నేను పట్టించుకోను. నా వ్యక్తిత్వంతో ముందుకు సాగుతాను’ అంటూ ముగించింది పద్మ. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top