ఆ అర్హత విశాల్‌కి ఉంది

Director Krish Speech at Pandem Kodi 2 Pre Release Event - Sakshi

క్రిష్‌

‘‘గొప్ప స్నేహితుడికి అర్థం విశాల్‌. తనకు నేను చాలా పెద్ద ఫ్యాన్‌ని. పొల్లాచ్చిలో ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’ రెక్కీకి వెళ్లినప్పుడు నాకు రూమ్‌ లేకపోవడంతో విశాల్‌ తన రూమ్‌కి తీసుకెళ్లి, బెడ్‌ నాకు ఇచ్చి, నేలపై పడుకోవడానికి రెడీ అయ్యాడు. పురట్చి దళపతి (విప్లవ సేన నాయకుడు) అని విశాల్‌ను తమిళ ప్రేక్షకులు, అభిమానులు పిలుచుకుంటారు. ఆ పేరు పెట్టుకోవడానికి తనకు అర్హత ఉంది’’ అని డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ అన్నారు.

విశాల్‌ హీరోగా, కీర్తీ సురేశ్, వరలక్ష్మి శరత్‌కుమార్‌ హీరోయిన్లుగా ఎన్‌.లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పందెంకోడి 2’. ‘ఠాగూర్‌’ మధు సమర్పణలో విశాల్, దవళ్‌ జయంతిలాల్‌ గడా, అక్షయ్‌ జయంతి లాల్‌ గడా నిర్మించిన ఈ సినిమా ఈనెల 18న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ నిర్వహించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను నటి లక్ష్మీప్రసన్న, ఆడియో సీడీలను క్రిష్‌ విడుదల చేశారు. ఈ వేడుకలో కొంత మంది రైతులకు విశాల్‌ ఆర్థిక సాయం చేశారు.

విశాల్‌ మాట్లాడుతూ– ‘‘నాన్న జి.కె.రెడ్డిగారు, అన్నయ్య విక్రమ్‌ కృష్ణగారి వల్లే ఓ నటుడిగా మీ ముందు గర్వంగా నిలబడి ఉన్నా. ‘పందెంకోడి’ ప్రారంభించే ముందు నేను 25 సినిమాలు చేస్తానని అనుకోలేదు. నేను మరో 25 సినిమాలు చేసేలా నా 25వ సినిమా ‘పందెంకోడి 2’ ఉంటుంది. ‘పందెంకోడి 3’ చేయడానికి మళ్లీ 13 ఏళ్లు కాకుండా పదమూడు నెలల్లో ప్రారంభం అవుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా సమర్పకులు ‘ఠాగూర్‌’ మధుగారు నా తర్వాతి సినిమా నిర్మాత. నా ప్రతి సినిమాకు టికెట్‌పై ఓ రూపాయి రైతులకే ఇచ్చేస్తాను.

ఇప్పుడు ప్రతి ఏడాది వంద సినిమాలకు పైగానే రిలీజ్‌ అవుతున్నాయి. ప్రేక్షకుడు కొనే టికెట్‌లో ఒక రూపాయిని ప్రభుత్వమే తీసుకుని రైతులకు ఖర్చుపెడితే బావుంటుంది. రైతులు, నిర్మాతలు ఒకటే. నాకు థియేటర్‌ గుడి.. ప్రేక్షకులే దేవుళ్లు’’ అన్నారు. ‘‘విశాల్, నా కాంబినేషన్‌లో ‘పందెంకోడి 3’ కూడా చేయాలనుకుంటున్నాం’’ అన్నారు లింగుస్వామి. నిర్మాతలు బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, ‘లగడపాటి’ శ్రీధర్, కె.ఎల్‌.దామోదర్‌ ప్రసాద్, రచయిత ఆకుల శివ, కథానాయికలు కీర్తీ సురేశ్, వరలక్ష్మి శరత్‌కుమార్‌ పాల్గొన్నారు.

చిత్ర సమర్పకులు ‘ఠాగూర్‌’ మధు మాట్లాడుతూ– ‘‘పందెం కోడి’ చిత్రానికి ఇది పర్ఫెక్ట్‌ సీక్వెల్‌. ఎత్తుకు పై ఎత్తు వేసి విలన్స్‌ని హీరో ఎలా ఢీ కొన్నాడు అన్నదే కథ. జయాపజయాల నుంచి నేర్చుకోకపోతే ఇండస్ట్రీలో ఉండలేం. డిజిటల్‌ కంటెంట్‌తో థియేట్రికల్‌ రెవెన్యూ తగ్గినా డిజిటల్‌ మార్కెట్‌లో వచ్చే రెవెన్యూ దాన్ని బ్యాలెన్స్‌ చేస్తుంది.  విశాల్‌తో తమిళంలో ‘టెంపర్‌’ రీమేక్‌ చేస్తున్నా. నిఖిల్‌తో చేస్తోన్న ‘ముద్ర’ షూటింగ్‌ పూర్తి కాబోతోంది’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top