టీఆర్‌ఎస్‌కు షాక్‌.. ఉప ఎన్నికల్లో ఓటమి

TRS loses two local body seats in karimnagar - Sakshi

ఆచంపల్లిలో కాంగ్రెస్‌.. గంగాధరలో బీజేపీ విజయం..

గతంలో తిర్మలాపూర్‌ ఎన్నికల్లోనూ అపజయం

మూడు స్థానాలు చొప్పదండి నియోజకవర్గమే..

ఉప ఎన్నికల ఫలితాలపై అధిష్టానం ఆరా

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌/గంగాధర: ఎంపీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి షాక్‌ ఇచ్చాయి. ఓ వైపు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు.. మరోవైపు సంస్థాగత పటిష్టతపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తలమునకలై ఉన్నారు. ఇదే సమయంలో స్థానిక సంస్థల ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ పార్టీ నేతలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలో జరిగిన ఉప ఎన్నికల్లో రెండు ఎంపీటీసీ స్థానాల్లో ఘోర పరాజయాన్ని పొందడం చర్చనీయాంశంగా మారింది. ఈ చేదు ఫలితాలను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోవడం లేదు. శనివారం వెలువడిన రెండు స్థానాల ఉప ఎన్నికల ఫలితాల్లో ఒకటి కాంగ్రెస్‌ పార్టీ, మరోటి బీజేపీ కైవసం చేసుకున్నాయి. గతంలోనూ కొడిమ్యాల మండలం తిర్మలాపూర్‌ ఎంపీటీసీ స్థానానికి సైతం టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై స్వతంత్ర అభ్యర్థి గెలుపొందగా, జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గంలో జరిగిన మూడు ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు చుక్కెదురు కావడం చర్చనీయాంశంగా మారింది. కాగా.. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ ఓటమి చెందడంపై ఆ పార్టీ అధిష్టానం ఆరా     తీస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఓటమికి గల కారణాలపై విశ్లేషిస్తున్నట్లు తెలుస్తోంది.

చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలంలోని రెండు ఎంపీటీసీ స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి షాక్‌ తగిలింది. రెండు చోట్ల పరాజయం పాలైంది. మండలంలోని గంగాధర, ఆచంపల్లి ఎంపీటీసీ స్థానాలకు గురువారం ఉప ఎన్నికలు నిర్వహించారు. శనివారం ఓట్ల లెక్కించి ఫలితాలు ప్రకటించారు. గంగాధరలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే పోటీ పడ్డారు. పోటీలో బీజేపీ అభ్యర్థి పెరుక శ్రావణ్‌ సమీప టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మడ్లపల్లి శ్రీనివాస్‌పై 1,252 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 2,296 ఓట్లు పోలుకాగా బీజేపీ అభ్యర్థికి 1,752, టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 500 ఓట్లు వచ్చాయి. నోటా కింద 44 ఓట్లు పడ్డాయి. ఆచంపల్లిలో నలుగురు వ్యక్తులు పోటీ పడ్డా రు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పురమల్ల మనోహర్‌ తన సమీప టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పర్నె రాంరెడ్డిపై 734 ఓట్ల మెజారిటీతో వి జయం సాధించారు. మొత్తం 1,760 ఓట్లు పోలుకాగా కాంగ్రెస్‌ పార్టీకి 1,154, టీఆర్‌ఎస్‌కు 420, టీడీపీకి 142, స్వతంత్ర అభ్యర్థికి 21, నోటాకు 23 ఓట్లు పోలయ్యాయి.

ఫలించని టీఆర్‌ఎస్‌ ప్రయత్నం.. సంబరాల్లో కాంగ్రెస్, బీజేపీలు..
ఉప ఎన్నికల్లో రెండు చోట్ల గెలుపొందడానికి టీఆర్‌ఎస్‌ చేసిన ప్రయత్నం ఫలించలేదు. పోటీలో సిట్టింగ్‌ సీటైన ఆచంపల్లి స్థానాన్ని సైతం కోల్పోయింది. అభ్యర్థులను గెలిపించుకోవడానికి టీఆర్‌ఎస్‌కు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు రెండు గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసినా అభ్యర్థులను గెలిపించుకోలేకపోయారు. జెడ్పీటీసీ స్వగ్రామమైన ఆచంపల్లిలో, స్థానిక సర్పంచ్‌ సైతం టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వ్యక్తే అయినా ఇక్కడి అభ్యర్థి భారీ మెజారిటీతో ఓడిపోయాడు. ఎమ్మెల్యే బొడిగె శోభ నివాసం ఉండే గంగాధరలో సైతం భారీ ఓట్ల వ్యత్యాసంతో ఓటమిని చవిచూశారు. చివరి నిమిషంలో కులసంఘాలతో సమావేశం నిర్వహించి ప్రచారం నిర్వహించినా ఫలితం దక్కలేదు. టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ సీటును కైవసం చేసుకున్న కాంగ్రెస్‌ పార్టీ సంబరాల్లో ఉంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు ముప్పుతిప్పల పడ్డా సిట్టింగ్‌ సీటైన ఆచంపల్లి ఎంపీటీసీ స్థానంలో రాణించలేకపోయారు. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం సుద్దాల దేవయ్య, ఇటీవలే టీడీపీ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మేడిపల్లి సత్యంతోపాటు పలువురు నాయకులు ప్రచారం నిర్వహించారు. రాబోయే ప్రతీ ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమ ని కాంగ్రెస్‌ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. 

Read latest Karimnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top