పేరిణిలో ‘రజిత’

Perini Dancer Rajitha Story - Sakshi

సాక్షి, నిర్మల్‌ అర్బన్‌: టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ బాలికల జూనియర్‌ కళాశాలలో ప్రభుత్వ మ్యుజిక్‌ టీచర్‌గా పని చేస్తున్న ఎట్టెం రజిత రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండల కేంద్రం వాస్తవ్యురాలు. నృత్య కళలోనే ప్రత్యేకత సంతరించుకున్న ‘పేరిణి’లో ఆమె కళాకారిణిగా, శిక్షకురాలిగా రాణిస్తున్నారు. తాను నమ్మిన కళే తనకు ఉద్యోగాన్ని చూపించిందనే రజిత గర్వంగా చెబుతారు. వివాహానంతరం కూడా శిక్షణను కొనసాగించిన రజిత ఓవైపు డిప్లొమాలాంటి సర్టిఫికెట్‌ కోర్సులు చేస్తూనే మరోవైపు అనేక మందికి శిక్షణనిచ్చారు. ఈ క్రమంలోనే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఆంధ్రనాట్యంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు.

దేశవ్యాప్తంగా పేరిణి నృత్య ప్రదర్శనలు ఇచ్చిన రజిత పద్మశ్రీ డాక్టర్‌ నటరాజ రామకృష్ణ చేతుల మీదుగా నాట్యచూడామణి, ప్రభుత్వ సలహాదారుడు డాక్టర్‌ రమణాచారి చేతుల మీదుగా హంసవాణి అవార్డులను అందుకున్నారు. 2017 అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రశంసాపత్రం, విజయవాడ కళాక్షేత్రం వారి నాట్య కౌముది, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వీసీ చేతుల మీదుగా కళాభూషణ, అసోంలోని సాలోరి ఆర్ట్స్‌ ఆకాడమీ వారి బెస్ట్‌ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్గా ప్రశంసా పత్రాలు అందుకున్నారు.

రవీంద్రభారతిలో నిర్వహించిన పేరిణి నృత్యోత్సవంలో కల్చరల్‌ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ చేతుల మీదుగా ఉత్తమ నాట్యాచారిణి, బాంబేలో ప్లయింగ్‌ స్టెరో కంపెనీ వారి బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌ ప్రశంసాపత్రాలు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ సంబురాల్లో జిల్లా ఉత్తమ కళాకారిణిగా కలెక్టర్‌ ప్రశాంతి రజితకు అవార్డును అందజేశారు. అలాగే ప్రపంచ తెలుగు మహాసభలో ఉత్తమ పేరిణి కళాకారిణిగా ప్రశంసాపత్రాలు అందుకున్న రజిత తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షురాలిగా కూడా సేవలందిస్తున్నారు.

Read latest Karimnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top