చావును దగ్గర నుంచి చూసొచ్చాడు

Tiktok Star Swims Under Ice Water Went Viral - Sakshi

పొద్దున లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు ఎప్పుడూ టిక్‌టాకేనా, వేరే పనే లేదా? అని ఎంతమంది మొట్టికాయలు వేసినా టిక్‌టాక్‌ యూజర్లకు చీమకుట్టినట్టైనా ఉండదు. పైపెచ్చు నా వీడియోను ఇంతమంది చూశారు, అంతమంది లైక్‌ కొట్టారని తెగ మురిసిపోతుంటారు. లేదంటే నా వీడియో ఎవరూ పట్టించుకోవట్లేదంటూనే మరో వీడియోకు పోలోమని రెడీ అయిపోతుంటారు. అన్నం తినకుండా ఒకరోజైనా ఉంటారేమో కానీ టిక్‌టాక్‌ లేకుండా ఒక పూట కూడా ఉండలేమన్నట్లుగా తయారయ్యారు చాలామంది జనాలు. ఈ క్రమంలో కొంతమంది ఉద్యోగాలు ఊడగొట్టుకోగా మరికొంతమంది ఏకంగా ప్రాణాలే పోగొట్టుకున్నారు.

చావును దగ్గర నుంచి చూశాడు
కానీ కొందరు మాత్రం పిచ్చి పిచ్చి ప్రయోగాలతో చావు చివరి అంచుల దాకా వెళ్లి వస్తున్నారు. ఇక్కడ చెప్పుకునే వ్యక్తి కూడా ఈ కోవకు చెందినవాడే. టిక్‌టాక్‌ స్టార్‌ జాసన్‌ క్లార్క్‌ ఓ విన్యాసానికి పూనుకున్నాడు. అందరిలాగా మామూలు నీళ్లలో ఈత కొడితే మజా ఏముంది అనుకున్నాడో ఏమోగానీ గడ్డ కట్టిన మంచు నీటి కింద ఈత కొట్టాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా మంచు గడ్డ కట్టిన నీళ్లలోకి ప్రవేశించి ఈత కొట్టడం ప్రారంభించాడు. తర్వాత కాసేపటికే ఊపిరాడక చేపలా గిలగిలా కొట్టుకున్నాడు. తిరిగి పైకి రావడానికి దారి కూడా కనిపించలేదు. పైగా అతని కళ్లు కూడా మంచు కట్టడం ప్రారంభించమవడంతో ఊపిరి పోవడం తథ్యం అనుకున్నాడు. కానీ ఎట్టకేలకు ఓ రంధ్రం గుండా నీళ్లలో నుంచి బయట పడ్డాడు.

ఊపిరాడక చస్తుంటే ప్రాంక్‌ అనుకుంది
ఈ భయానక అనుభవాన్ని జాసన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. ‘నీళ్లలోకి దిగి ఈత కొట్టాక నా చుట్టూ అంతా ఒకేలాగా అన్పించింది. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండటంతో ఎలాగోలా పైకి రావాలని మంచుగడ్డను పగలగొట్టేందుకు ప్రయత్నించాను, కానీ అది సాధ్యపడలేదు. కళ్లు కూడా పనిచేయడం మానేసినట్లు అనిపించింది. దీంతో వెంటనే నా శక్తిని కూడగొట్టుకుని పైకి వచ్చేశాను’ అని పేర్కొన్నాడు. ఇక దీన్నంతటినీ చిత్రీకరిస్తున్న మహిళ అతను నీళ్ల లోపల కొట్టుమిట్టాడటాన్ని చూసి అది ప్రాంక్‌ అని భ్రమపడటం గమనార్హం. ఇక విశేషమేంటంటే ఇంత జరిగినా అతను మరోసారి ఈ సాహసానికి పూనుకుని అందులో సఫలీకృతుడయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోను సైతం సామాజిక మాధ్యమాల్లో పంచుకన్నాడు. ప్రస్తుతం ఈ రెండు వీడియోలు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top