‘పారిస్‌’.. భారత్‌కే అనుకూలం

‘పారిస్‌’.. భారత్‌కే అనుకూలం - Sakshi


పర్యావరణ ఒప్పందం నుంచి వైదొలగుతున్నాం: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌

ఒప్పందంతో అమెరికాకు నష్టమని వ్యాఖ్య


► ట్రంప్‌ది చారిత్రక తప్పిదం, మొత్తం భూగోళానికే ప్రమాదం: ఫ్రాన్స్, జర్మనీ

► పారిస్‌ ఒప్పందానికి కట్టుబడి ఉన్నాం: భారత్‌

► ఒప్పందాన్ని అమలు చేస్తామన్న న్యూయార్క్, కాలిఫోర్నియా గవర్నర్లు




వాషింగ్టన్‌: గ్లోబల్‌ వార్మింగ్‌ ముప్పు నుంచి బయటపడేందుకు ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ గట్టి దెబ్బకొట్టారు. కర్బన ఉద్గారాల ధాటికి వేడెక్కుతున్న భూగోళాన్ని రక్షించే ఉద్దేశంతో కుదుర్చుకున్న పారిస్‌ పర్యావరణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. ఆ ఒప్పందం నుంచి తప్పకుంటున్నట్లు ప్రకటించారు.


ఒప్పందం భారత్, చైనాలకు అనుకూలంగా ఉందని, అమెరికా ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగించే ఒప్పందాన్ని అంగీకరించేందుకు మనసు అంగీకరించడం లేదని అందుకే వైదొలుగుతున్నామని ట్రంప్‌ స్పష్టం చేశారు. తమకు అనుకూలంగా ఒప్పందం ఉంటే అంగీకరించేందుకు సిద్ధమని ట్రంప్‌ పరోక్షంగా తేల్చి చెప్పారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు... ప్రపంచ పర్యావరణాన్ని ట్రంప్‌ పణంగా పెట్టడంతో తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. గ్రీన్‌ హౌస్‌ వాయువుల్ని అత్యధికంగా వెదజల్లుతున్న దేశాల్లో అమెరికా రెండో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.



‘2015 పారిస్‌ పర్యావరణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగుతుంది. ఈ ఒప్పందం అమెరికాకు తీవ్ర నష్టం కలిగిస్తుంద’ని వైట్‌హౌస్‌లోని రోజ్‌గార్డెన్‌లో ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. అనంతరం ప్రపంచ దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో తన నిర్ణయాన్ని సమర్ధించుకుంటూ..‘నేను పిట్స్‌బర్గ్‌(అమెరికా) ప్రజల ప్రతినిధిగా ఎన్నికయ్యాను.. అంతేగానీ పారిస్‌కు కాద’ని వ్యంగ్యంగా పేర్కొన్నారు.


‘అధ్యక్షుడిగా నాకు ఒక బాధ్యత ఉంది. నా బాధ్యతంతా అమెరికా ప్రజలే... పారిస్‌ పర్యావరణ ఒప్పందం అమెరికా ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుంది. ఉద్యోగులు, కార్మికులకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. అమెరికా సార్వభౌమాధికారాన్ని బలహీనపరుస్తుంది. ఆమోదయోగ్యం గానీ నిబంధనల్ని మనపై విధించారు. ప్రపంచంలోని ఇతర దేశాలకు నష్టం కలిగించే దేశంగా మనల్ని చిత్రీకరించార’ని పేర్కొంటూ పారిస్‌ ఒప్పందాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.



వ్యాపారాలు, ఉద్యోగాలకు నష్టం..

పారిస్‌ ఒప్పందం పక్షపాత ధోరణిలో ఉండడంతో పాటు, అమెరికాలో వ్యాపారాలు, ఉద్యోగాలకు నష్టం కలిగిస్తుందనే ఈ నిర్ణయం తీసుకున్నానని ట్రంప్‌ పేర్కొన్నారు. ‘నేను ప్రతి రోజు అమెరికా ప్రజల కోసం పోరాడుతున్నాను. పారిస్‌ ఒప్పందం నుంచి వైదొలగేందుకు ఇదే సరైన సమయం. అదే సమయంలో పర్యావరణం, అమెరికన్‌ కంపెనీలు, ప్రజల్ని పరిరక్షించేందుకు కొత్త ఒప్పందానికి ఇదే తరుణం. మనం ఒప్పందం నుంచి బయటపడుతున్నాం. తిరిగి చర్చలు ప్రారంభించాలి. ఏదైనా మంచి ఒప్పందం కుదురుతుందేమో చూడాలి. అలా జరిగితే మంచిదే.. కుదరకపోయినా మంచిదే’ అంటూ తన నిర్ణయాన్ని ట్రంప్‌ గట్టిగా సమర్ధించుకున్నారు.



చైనా, భారత్‌లకే ప్రయోజనం

పర్యావరణ పరిరక్షణ పేరుతో ఎక్కువ కాలుష్యాన్ని ఉత్పత్తి చేస్తున్న దేశాలపై కొన్ని దేశాలు అర్థం లేని షరతులు విధించాయని ట్రంప్‌ తప్పుపట్టారు. ‘పారిస్‌ ఒప్పందం అమలుకు కట్టుబడి ఉండేందుకు అభివృద్ధి చెందిన దేశాల నుంచి భారత్‌ బిలియన్ల కొద్దీ డాలర్లను అందుకుంటోంది. అమెరికాపై ఆర్థికంగా పైచేయి సాధించేందుకు... చైనా, భారత్‌లు వచ్చే కొన్నేళ్లలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్ని రెండింతలు చేయనున్నాయి.


అమెరికా ప్రజలపై కఠినమైన ఆర్థిక ఆంక్షల్ని విధించడమే కాకుండా.. అమెరికా పర్యావరణ లక్ష్యాలకు తగినట్లుగా పారిస్‌ ఒప్పందం లేద’ని ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ ఒప్పందం ప్రకారం చైనా.. 13 ఏళ్ల పాటు కర్బన ఉద్గారాల్ని ఇష్టమొచ్చినట్లు విడుదల చేయవచ్చని, వారికి మినహాయింపునిచ్చి.. అమెరికాకు ఇవ్వలేదని ఆయన తప్పుపట్టారు. ‘ఇంకా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.. చివరిగా చెప్పేదేంటంటే పారిస్‌ ఒప్పందం అన్యాయంగా ఉంది. అందుకే తప్పుకుంటున్నాం’ అని ముక్తాయింపునిచ్చారు.



ట్రంప్‌ కాదన్నా.. మేం ఓకే..

ట్రంప్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. అమెరికాలోని పలు నగరాలు, రాష్ట్రాలు, కంపెనీల ప్రతినిధులు పారిస్‌ ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని పేర్కొంటూ ఒక ప్రణాళికను ఐక్యరాజ్యసమితికి సమర్పించేందుకు సిద్ధమయ్యారు. 30 మంది మేయర్లు, ముగ్గురు గవర్నర్లు, 80 మందికిపైగా వర్సిటీ అధ్యక్షులు, 100కు పైగా వ్యాపార సంస్థల ప్రతినిధులు కూటమిగా ఏర్పడి ఐరాసతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారు.


ఒప్పం దం నుంచి వైదొలగడం అనైతికమని న్యూయా ర్క్, కాలిఫోర్ని యా, వాషింగ్టన్‌ గవర్నర్‌లు తప్పుపట్టారు. ఒప్పందాన్ని సమర్థించే రాష్ట్రాలతో సంప్రదింపుల కోసం ‘యునైటెడ్‌ స్టేట్స్‌ క్లైమేట్‌ అలయన్స్‌’ను ఏర్పాటు చేశారు. పారిస్‌ ఒప్పందానికి న్యూయార్క్‌ రాష్ట్రం కట్టుబడి ఉంటుదంటూ ఎగ్జిక్యుటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేస్తున్నానని న్యూయార్క్‌ గవర్నర్‌ అండ్రూ కోమో వెల్లడించారు.



ప్రపంచ దేశాల నిరసన

పారిస్‌ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగాలన్న ట్రంప్‌ నిర్ణయంపై తీవ్ర ఆందోళన, నిరసన వ్యక్తమైంది. ‘అతి కొద్ది దేశాలే భవిష్యత్తు  ప్రయోజనాల్ని వ్యతిరేకిస్తున్నాయి. పారిస్‌ ఒప్పందంలో కొనసాగే దేశాలు ఉద్యోగాలు, పరిశ్రమల కల్పనతో దక్కే ప్రయోజనాల్ని పొందుతాయి. ఒప్పందంలో అమెరికా ముందు వరుసలో ఉండాల’ని అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా పేర్కొన్నారు. ఒప్పందంపై పునఃసంప్రదింపులు ఉండవని ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీలు స్పష్టం చేశాయి. ట్రంప్‌ నిర్ణయం చారిత్రక తప్పిదమని, భూగోళానికి ప్రమాదమని అన్నాయి. 


ట్రంప్‌ నిర్ణయంపై రాద్దాంతం అక్కర్లేదని, ఆయనతో కలసి ప్రపంచ దేశాలు కలిసి కట్టుగా ముందుకు సాగాలని రష్యా అధ్యక్షుడు  పుతిన్‌ పేర్కొన్నారు.  ‘ట్రంప్‌ తన దేశప్రయోజనాల కోసం చారిత్రక తప్పిదం చేశారు. ప్రపంచానికి అమెరికా వెన్నుచూపింది’ అని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ అన్నారు. ఒప్పందాన్ని కొనసాగిస్తామని చైనా ప్రధాని లీ కెకియాంగ్‌ అన్నారు. ‘ఉద్గారాల తగ్గింపు, అంతర్జాతీయ భద్రత కోసం ప్రపంచం చేస్తున్న యత్నాలకు అమెరికా నిర్ణయం నిరుత్సాహం కలిగించింది..’ అని ఐక్యరాజ్యసమితి చీఫ్‌ గుటెరస్‌ పేర్కొన్నారు. ట్రంప్‌ నిర్ణయాన్ని ఆయన కుమార్తె ఇవాంకా కూడా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.  



కట్టుబడి ఉన్నాం: భారత్‌

న్యూఢిల్లీ: పారిస్‌ ఒప్పందానికి భారత్‌ కట్టుబడి ఉందని పర్యావరణ మంత్రి హర్షవర్ధన్‌ స్పష్టం చేశారు. ‘ఎవరి వైఖరి, ఏ దేశం వైఖరి ఎలా ఉన్నా మా ప్రభుత్వం మాత్రం ఒప్పందానికి కట్టుబడి ఉంది’ అని అన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top