రక్తపోటు మందులతో సమస్యే... | Sakshi
Sakshi News home page

రక్తపోటు మందులతో సమస్యే...

Published Wed, Oct 12 2016 1:39 PM

Blood pressure drugs may increase depression risk

లండన్ః అధిక రక్తపోటుకు వాడే మందుల్లో అధికశాతం మందులు అనేక అనారోగ్య సమస్యలకు కారణమౌతున్నాయని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి. మొత్తం నాలుగు సామాన్య తరగతి మందులతో పోలిస్తే వాటిలో రెండు మందులు మూడ్ డిజార్డర్స్ ప్రమాదం కలిగిస్తున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు.

సాధారణంగా సూచించే కొన్ని రక్తపోటు మందులు మానసిక అశాంతి, బైపోలార్ డిజార్డర్ వంటి సమస్యలను సృష్టిస్తున్నాయని బ్రిటన్ గ్లాస్గో విశ్వవిద్యాలయంలోని భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ సంతోష్ పద్మనాభన్ సహా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. హైపర్ టెన్షన్ తగ్గేందుకు తమ రోగులకు మందులు అందించే విషయంలో వైద్యులు కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, యాంటీ బ్లడ్ ప్రెషర్ మందులు రోగి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం అధికంగా ఉందని పద్మనాభన్ తెలిపారు. స్కాటిష్ కు చెందిన రెండు సెకండరీ కేర్ ఆసుపత్రులనుంచి  40-80 ఏళ్ళ మధ్య వయసున్న సుమారు 525,046 మంది రోగుల డేటాను పరిశోధకులు సేకరించారు. ఎటువంటి మందులు తీసుకోని 111,936 మందితో ఐదు సంవత్సరాలపాటు వీరిని పోల్చి చూశారు. ఈ సమయంలో రక్తపోటు మందులు వాడుతున్న సుమారు 144,066 మంది రోగులను పరిశీలించగా వారిలో అధికశాతం బైపోలార్ డిజార్డర్, మానసిక అశాంతి వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు గమనించారు.

యాంటీ హైపర్ టెన్సివ్ మందులు వాడటం మొదలు పెట్టి సుమారు 90 రోజులు దాటిన రోగుల్లో చాలామంది డిప్రెషన్  సమస్యతో ఆస్పత్తుల్లో చేరినట్లు పరిశోధకులు తమ అధ్యయనాల ద్వారా తెలుసుకున్నారు. ఇతర రోగాలకు మందులు వాడేవారితో పోలిస్తే రక్తపోటుకు మందులు వాడుతూ మూడ్ డిజార్డర్ తో ఆసుపత్రుల్లో చేరిన వారి శాతం రెండు రెట్లు అధికంగా ఉన్నట్లు పరిశోధనల్లో తేల్చారు. తమ అధ్యయనాల వివరాలను పరిశోధకులు హైపర్ టెన్షన్ జర్నల్ లో ప్రచురించారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement