breaking news
mood disorders
-
మీ బాస్ మూడీనా..?
సాక్షి, న్యూఢిల్లీ : పని ప్రదేశంలో తరచూ ఆందోళనకు గురవుతూ..అలిసిపోతుంటే అందుకు మూడీగా ఉండే మీ బాసే కారణమంటున్నాయి తాజా అథ్యయనాలు. నిత్యం రుసరుసలాడే బాస్ ఎదురైతే ఉద్యోగులకు టెన్షన్ తప్పదని భారత్, బ్రిటన్‌లో నిర్వహించిన ఓ అథ్యయనం వెల్లడించింది. ఉత్పాదకత పైనా మూడీ బాస్ ప్రభావం ఉంటుందని ఈ సర్వే స్పష్టం చేసింది. మరోవైపు క్షణానికో రకంగా వ్యవహరించే బాస్‌ల కంటే ఎప్పుడూ మూడీగా ఉండే బాస్ కొంత మేలని పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. కఠినంగా ఉండే బాస్‌తో కుదురైన సంబంధాలు నిర్వహించే ఉద్యోగులు సాఫీగానే నెట్టుకురాగలరని, గంటకో రకంగా వ్యవహరించే బాస్లతోనే సిబ్బందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఎక్ట్సర్ పరిశోధక బృందం తేల్చింది. సహోద్యోగుల మధ్య మెరుగైన సంబంధాలు లేకుంటే పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుందని పేర్కొంది. సిబ్బంది, మేనేజర్ల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండటం అత్యంత కీలకమని..సంస్థల్లో ఎలాంటి వాతావరణం ఉందనేది ప్రధానాంశమని అథ్యయనం నిర్వహించిన ప్రొఫెసర్ అలన్ లీ చెప్పారు. అస్తవ్యస్త మూడ్‌తో వ్యవహరించే బాస్‌లతో ఉద్యోగులు సతమతమవుతారని..ఏ అంశంలో మేనేజర్ ఎలా రియాక్ట్ అవుతారనే కంగారుతో ప్రతికూల భావోద్వేగాలకు లోనయి పనిలో సరైన సామర్థ్యం కనబరచలేకపోతారని ఆయన విశ్లేషించారు. -
రక్తపోటు మందులతో సమస్యే...
లండన్ః అధిక రక్తపోటుకు వాడే మందుల్లో అధికశాతం మందులు అనేక అనారోగ్య సమస్యలకు కారణమౌతున్నాయని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి. మొత్తం నాలుగు సామాన్య తరగతి మందులతో పోలిస్తే వాటిలో రెండు మందులు మూడ్ డిజార్డర్స్ ప్రమాదం కలిగిస్తున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. సాధారణంగా సూచించే కొన్ని రక్తపోటు మందులు మానసిక అశాంతి, బైపోలార్ డిజార్డర్ వంటి సమస్యలను సృష్టిస్తున్నాయని బ్రిటన్ గ్లాస్గో విశ్వవిద్యాలయంలోని భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ సంతోష్ పద్మనాభన్ సహా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. హైపర్ టెన్షన్ తగ్గేందుకు తమ రోగులకు మందులు అందించే విషయంలో వైద్యులు కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, యాంటీ బ్లడ్ ప్రెషర్ మందులు రోగి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం అధికంగా ఉందని పద్మనాభన్ తెలిపారు. స్కాటిష్ కు చెందిన రెండు సెకండరీ కేర్ ఆసుపత్రులనుంచి 40-80 ఏళ్ళ మధ్య వయసున్న సుమారు 525,046 మంది రోగుల డేటాను పరిశోధకులు సేకరించారు. ఎటువంటి మందులు తీసుకోని 111,936 మందితో ఐదు సంవత్సరాలపాటు వీరిని పోల్చి చూశారు. ఈ సమయంలో రక్తపోటు మందులు వాడుతున్న సుమారు 144,066 మంది రోగులను పరిశీలించగా వారిలో అధికశాతం బైపోలార్ డిజార్డర్, మానసిక అశాంతి వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు గమనించారు. యాంటీ హైపర్ టెన్సివ్ మందులు వాడటం మొదలు పెట్టి సుమారు 90 రోజులు దాటిన రోగుల్లో చాలామంది డిప్రెషన్ సమస్యతో ఆస్పత్తుల్లో చేరినట్లు పరిశోధకులు తమ అధ్యయనాల ద్వారా తెలుసుకున్నారు. ఇతర రోగాలకు మందులు వాడేవారితో పోలిస్తే రక్తపోటుకు మందులు వాడుతూ మూడ్ డిజార్డర్ తో ఆసుపత్రుల్లో చేరిన వారి శాతం రెండు రెట్లు అధికంగా ఉన్నట్లు పరిశోధనల్లో తేల్చారు. తమ అధ్యయనాల వివరాలను పరిశోధకులు హైపర్ టెన్షన్ జర్నల్ లో ప్రచురించారు.