అఫ్గానిస్తాన్‌లో 37 మంది మృతి

10 journalists, 11 children among 37 killed in multiple attacks in Afghanistan - Sakshi

3 ఆత్మాహుతి దాడుల్లో 65మందికి గాయాలు

మృతుల్లో 10 మంది జర్నలిస్టులు, 11 మంది చిన్నారులు

కాబూల్‌: అఫ్గానిస్తాన్‌లో సోమవారం జరిగిన పలు ఆత్మాహుతి దాడుల్లో పది మంది విలేకరులు, పదకొండు మంది చిన్నారులు సహా 37 మంది దుర్మరణం పాలయ్యారు. రాజధాని కాబూల్‌లో రెండు బాంబు పేలుళ్లలో కలిపి 25 మంది చనిపోగా, కాందహార్‌లో జరిగిన మరో దాడిలో 11 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. మూడు ఘటనల్లో కలిపి 65 మంది గాయపడటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. 2001 తర్వాత అఫ్గానిస్తాన్‌లో మీడియాపై జరిగిన అత్యంత భయానక దాడి ఇదేనని ‘రిపోర్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌’ అనే సంస్థ వెల్లడించింది.

పాకిస్తాన్‌ సరిహద్దుల్లో జరిగిన మరో దాడిలో బీబీసీ రిపోర్టర్‌ అహ్మద్‌ షా మరణించారు.కాబూల్‌లో జరిగిన రెండు దాడులూ చేసింది తామేనని ఐసిస్‌ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి, యూరోపియన్‌ యూనియన్‌ ఈ దాడులను తీవ్రంగా ఖండించాయి. ఉగ్రవాది జర్నలిస్ట్‌లా వచ్చి జనసమూహంలో తనను తాను పేల్చుకున్నాడని కాబూల్‌ పోలీస్‌ అధికారి ఒకరు వెల్లడించారు. చనిపోయిన జర్నలిస్టుల్లో పలు స్థానిక చానళ్ల ప్రతినిధులు సహా  ఏఎఫ్‌పీ చీఫ్‌ ఫొటోగ్రాఫర్‌ షా మరై కూడా ఉన్నారు.

మరో ఘటనలో కాందహార్‌లో ఉగ్రవాది బాంబులతో నిండిన కారులో వచ్చి దాడికి పాల్పడటంతో 11 మంది చిన్నారులు మృతి చెందగా అఫ్గాన్, ఇతర దేశాల భద్రతా దళాల సిబ్బంది సహా 16 మంది గాయపడ్డారు.ఈ దాడికి ఏ ఉగ్రవాద సంస్థా బాధ్యత ప్రకటించుకోలేదు. 2016 నుంచి ఇప్పటివరకు అఫ్గానిస్తాన్‌లో 34 మంది జర్నలిస్టులు చనిపోయారనీ, పత్రికా స్వేచ్ఛ సూచీలో ఆ దేశ స్థానం 118 అని రిపోర్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌ గుర్తుచేసింది. 2016లోనూ ఓ చానల్‌పై తాలిబాన్లు దాడి చేయగా ఏడుగురు ఉద్యోగులు మరణించారు. గత నవంబర్‌లో కూడా మరో టీవీ చానల్‌ కార్యాలయం వద్ద జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top