అలాంటి సమాచారమే లేదు! | Sakshi
Sakshi News home page

అలాంటి సమాచారమే లేదు!

Published Mon, Mar 20 2017 3:40 AM

అలాంటి సమాచారమే లేదు! - Sakshi

విద్యుత్‌ చార్జీలు పెంచవద్దని ప్రభుత్వం నుంచి సూచనల్లేవు
స్పష్టం చేసిన టీఎస్‌ఈఆర్సీ అధికార వర్గాలు
చార్జీల పెంపుపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ప్రకటనపై స్పందన


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీలు పెంచాలని ఈఆర్సీ కోరినా ఒప్పుకోలేదని, చార్జీలు పెంచవద్దని చెప్పానని సీఎం కె.చంద్రశేఖర్‌రావు గత శుక్రవారం శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. డిస్కంల ఆదా య లోటు అంచనాలు రూ.10 వేల కోట్లు ఉండనుండగా, బడ్జెట్‌లో రూ.4,200 కోట్లు మాత్రమే కేటాయించారని, విద్యుత్‌ చార్జీల పెంపు ద్వారా మిగిలిన భారాన్ని ప్రజలపై వేస్తారా అని విపక్ష నేత కె.జానారెడ్డి లేవనెత్తిన ప్రశ్నకు బదలిస్తూ ముఖ్యమంత్రి చేసిన ప్రకటనపై ఈఆర్సీ, డిస్కంల వర్గాల నుంచి భిన్నమైన స్పందన వస్తోంది.

విద్యుత్‌ చార్జీలు పెంచవద్దని ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారం అందలేని తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ) అధికార వర్గాలు స్పష్టం చేశాయి. పత్రికల్లో వచ్చిన వార్తల ద్వారానే ఈ విషయాన్ని తెలుసుకున్నామని పేర్కొన్నాయి. విద్యుత్‌ చార్జీల పెంపు కసర త్తులో భాగంగా ఇప్పటికే విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు 2017–18కి సంబంధిం చిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్‌)లు సమర్పించాయని, ఈఆర్సీ సుమోటోగా చేపట్టిన టారీఫ్‌ పెంపు ప్రక్రియ పురోగతిలో ఉందని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. విద్యుత్‌ చార్జీలు పెంచవద్దని, డిస్కంల ఆదాయ లోటు భారాన్ని సబ్సిడీగా చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం రాతపూర్వకంగా తెలిపితేనే ఈఆర్సీ పరిశీలిస్తుందని తెలిపారు. టారీఫ్‌ పెంపు ప్రతిపాదనలు సమర్పించేం దుకు డిస్కంలు కూడా ఏప్రిల్‌ 15 వరకు గడువు పొడిగింపు కోరాయని గుర్తు చేశారు.

అసెంబ్లీ తర్వాత ప్రతిపాదనలు
రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్‌ సరఫరాను 7 గంటల నుంచి 9 గంటలకు పెంచిన నేపథ్యం లో వ్యయ భారం పెరిగిందని, ప్రస్తుత చార్జీలే అమలు చేస్తే వచ్చే ఏడాది రూ.9,824 కోట్ల ఆర్థిక లోటు మూటగట్టుకోవాల్సి వస్తుందని ఇప్పటికే డిస్కంలు అంచనా వేశాయి. రూ.7,150.13 కోట్లను విద్యుత్‌ సబ్సిడీగా బడ్జెట్‌లో కేటాయించాలని కోరగా, ప్రభుత్వం రూ.4,200 కోట్లే కేటా యించింది. సబ్సిడీ పోగా రూ.5,600 కోట్ల ఆదాయ లోటు మిగలనుంది. దీంతో చార్జీల పెంపు అనివార్యమని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన తర్వాత ఈఆర్సీకి టారీఫ్‌ పెంపు ప్రతిపాదనలు సమర్పిస్తామని, వచ్చే జూలై నుంచి చార్జీల పెంపు అమల్లోకి వచ్చే అవకాశముందని తెలిపాయి.

అప్పటి వరకు పాత చార్జీలు: డిస్కంలు
ప్రస్తుతం అమల్లో ఉన్న విద్యుత్‌ చార్జీల కాలపరిమితి ఈ నెలాఖరుతో ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో తదుపరి చార్జీలు పెంచే వరకు ప్రస్తుత చార్జీలనే కొనసాగించాలని తాజాగా డిస్కంలు ఈఆర్సీని కోరాయి. వచ్చే ఏప్రిల్, మే, జూన్‌ నెలల్లో ప్రస్తుత చార్జీలు అమలు కానుండగా, జూలై నుంచి కొత్త చార్జీలు అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. జీహెచ్‌ఎంసీ, ఇతర పురపాలికలకు ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఏఆర్‌ఆర్, టారీఫ్‌ ప్రతి పాదనలు సమర్పించడంలో తీవ్ర జాప్యం చేయడంతో గతేడాది కూడా ఆలస్యంగా జూలై నుంచి చార్జీల పెంపు అమలు చేసిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement