
భార్య ఇంట్లో లేని సమయంలో..
భార్య పనికి వెళ్లగా అద్దెకుండే బాలికపై అత్యాచారం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టుచేశారు.
బంజారాహిల్స్ (హైదరాబాద్) : భార్య పనికి వెళ్లిన సమయంలో తన ఇంట్లో అద్దెకు ఉండే బాలిక(15)ను బెదిరించి లోబర్చుకొని ఎనిమిది నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్న కామాంధుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ సామల వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రహ్మత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ సమీపంలోని బీజేఆర్ నగర్‌లో నివసించే మన్నెల్లి ఆశీర్వాదం(52) పెయింటర్‌గా పని చేస్తున్నాడు. అతని ఇంట్లో జయానంద్ కుటుంబం అద్దెకు ఉంటోంది. అతని కుమార్తె (15) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది.
కొంతకాలం నుంచి ఆశీర్వాదం తన భార్య ఇంట్లో లేని సమయంలో ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఆమె నగ్న దృశ్యాలు సెల్‌ఫోన్‌లో తీసి బెదిరిస్తున్నాడు. అయితే ఇటీవల ఆశీర్వాదం భార్యకు ఈ విషయం తెలిసింది. దీంతో ఆమె బాధితురాలి తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో నిందితుడు నేరం అంగీకరించాడు. ఈ మేరకు అతనిపై ఐపీసీ సెక్షన్ 376(2), 506, ఫోక్స్ యాక్ట్ 5, 6 కేసులు నమోదు చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు.