
ఏపీ జల దోపిడీని అడ్డుకోండి
నీటిని తరలిస్తూ ఏపీ దోపిడీకి పాల్పడుతోందంటూ కేంద్ర జల వనరుల శాఖకు ప్రభుత్వం ఫిర్యాదు చేసింది.
- కేంద్ర మంత్రి ఉమాభారతికి హరీశ్ లేఖ
- పోతిరెడ్డిపాడు నుంచి అక్రమంగా నీటిని తరలించుకుంటోంది
- 12 రోజుల్లో 5.05 టీఎంసీలు వినియోగించి లెక్కల్లో 1.83 టీఎంసీలే చూపారు
- సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేసి, చర్యలకు ఆదేశించాలని విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలిస్తూ ఆంధ్రప్రదేశ్ దోపిడీకి పాల్పడుతోందంటూ కేంద్ర జల వనరుల శాఖకు రాష్ట్ర ప్రభుత్వం మరోమారు ఫిర్యాదు చేసింది. గత 12 రోజుల్లో 5.05 టీఎంసీల నీటిని తరలించుకుపోయి లెక్కల్లో 1.83 టీఎంసీలనే చూపుతోందని వివరించింది. జల దోపిడీపై ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేసినా.. ఏపీ వైఖరిలో మార్పులేదని పేర్కొంది. నీటి వినియోగం లెక్కలపై సంయుక్త కమిటీ వేయాలని అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించినా.. కృష్ణా బోర్డు ఎలాంటి చర్యలూ చేపట్టలేదని తెలిపిం ది. ఇప్పటికైనా తెలంగాణ, ఏపీ, కృష్ణా బోర్డు అధికారులతో సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతికి రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ నీటి వినియోగాన్ని లెక్కలతో సహా అందులో వివరించారు. ఈ వ్యవహారం లో బోర్డు ప్రేక్షక పాత్రను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
‘‘ఈ నెల 21న జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీ సందర్భంగా కూడా పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ నీటిని తరలించుకుపోతున్న విషయాన్ని మీ దృష్టికి తెచ్చాం. టెలీమెట్రీ విధానం అమల్లోకి వచ్చే వరకు సంయుక్త తనిఖీ బృందంతో ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లోలను పర్యవేక్షించాలని నిర్ణయం తీసుకున్నాం. కానీ ఈ విషయంలో బోర్డు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. ఈ నెల 16 నుంచి 27వ తేదీ వరకు పన్నెండు రోజుల్లో ఏపీ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 5.05 టీఎంసీల నీటిని తోడేసింది. కానీ తన ‘కాడా’ వెబ్‌సైట్‌లో మాత్రం కేవలం 1.83 టీఎంసీలను మాత్రమే చూపింది. ఈ జల దోపిడీ కారణంగా నాగార్జునసాగర్‌లో నీటి నిల్వలు పెరగడం లేదు. దాం తో తెలంగాణ రైతాంగానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందువల్ల ఇరు రాష్ట్రాలు, బోర్డు అధికారులతో సంయుక్త కమిటీ ఏర్పాటు చేసి.. నీటి లెక్కలు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకునేలా బోర్డును ఆదేశించండి..’’ అని లేఖలో హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు.
ప్రేక్షక పాత్ర వదలండి: ఏపీ నీటి తరలింపు అంశంపై కృష్ణా బోర్డు చైర్మన్ రామ్‌శరణ్, సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీలతో మంగళవారం హైదరాబాద్‌లోని జల సౌధలో హరీశ్‌రావు భేటీ అయ్యారు. ఏపీ తన వాటాకు మించి నీటిని తోడేస్తోందని, శ్రీశైలం నుంచి సరైన లెక్కలు చూపకుండానే రాయలసీమకు నీటిని తరలిస్తోందని... ఈ దోపిడీని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. టెలీమెట్రీ పరికరాలు అమర్చే వరకు జల దోపిడీ కొనసాగాల్సిందే నా? అని ప్రశ్నించారు. బోర్డు ప్రేక్షక పాత్రను విడిచిపెట్టి ఇప్పటికైనా కార్యాచరణ ప్రారంభించాలని కోరారు. ప్రస్తుతం నాగార్జున సాగర్‌లో పెరగాల్సిన స్థాయికి నీటి నిల్వలు చేరలేదని.. శ్రీశైలం నుంచి ఔట్‌ఫ్లో తక్కువగా ఉండడమే దీనికి కారణమని వివరించారు. ‘‘కర్నూలు జిల్లాలోని పెన్నా బేసిన్‌లో ఉన్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని ఏపీ బహిరంగంగా, నిస్సిగ్గుగా తరలించుకుపోతోంది. దీనిపై ఇది వరకే బోర్డుకు ఫిర్యాదు చేశాం. పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా జలాల తరలింపుపై మేం ఇటీవల శాస్త్రీయంగా అధ్యయనం చేసినప్పుడు చేదు నిజాలు బయటపడ్డాయి.
కృష్ణా జలాల తరలింపును రికార్డుల్లో వందల క్యూసెక్కులుగా చూపిస్తుండగా... వాస్తవానికి వేలాది క్యూసెక్కులు తరలిస్తున్నారు. ఈ సీజన్‌లో రికార్డుల్లో రాసిన లెక్కలు గమనిస్తే.. తొలిరోజు 700 క్యూసెక్కులు అంటూ మొదలుపెట్టి, తర్వాత వెయ్యి, పదిహేను వందలు, రెండు వేలంటూ కాకిలెక్కలు చూపుతున్నారు. వారం పది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నా, ఎగువ నుంచి భారీగా వరద వస్తున్నా.. మంగళవారం సైతం పోతిరెడ్డిపాడు ద్వారా తరలించిన నీటి లెక్కలు 500 క్యూసెక్కులుగానే చూపుతున్నారు..’’ అని బోర్డు చైర్మన్, సభ్య కార్యదర్శికి హరీశ్‌రావు వివరించారు. దీనిపై స్పందించిన బోర్డు చైర్మన్ రామ్‌శరణ్... పోతిరెడ్డిపాడు నీటి తరలింపు అంశాన్ని పరిశీలించేందుకు ఒకటి రెండు రోజుల్లోనే ఓ బృందాన్ని పంపుతామని హామీ ఇచ్చారు.