రాయని డైరీ : నరేంద్ర మోదీ (ప్రధాని)

Madhav Singaraju Rayani Dairy on Narendra Modi In Sakshi

మాధవ్‌ శింగరాజు

రేపు రువాండా ప్రయాణం. అక్కడి నుంచి ఉగాండా. తర్వాత దక్షిణాఫ్రికా. బుధవారం నుంచి మూడు రోజులు జోహాన్నెస్‌బర్గ్‌లో ‘బ్రిక్స్‌’ మీటింగ్‌. బ్రెజిల్‌ ప్రెసిడెంటు, రష్యా ప్రెసిడెంటు, చైనా ప్రెసిడెంటు, దక్షిణాఫ్రికా ప్రెసిడెంటు వస్తారు. అందరం కలిసి ఒకసారి మాట్లాడుకుంటాం. మళ్లీ విడిగా ఇద్దరిద్దరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటాం.
మొత్తం ఐదు రోజులు, ఐదు మీటింగులు, ఐదు చిరునవ్వులు, ఐదు హ్యాండ్‌షేక్‌లు, ఐదు ఆలింగనాలు. ఆలింగనాలు మస్ట్‌ కాకపోవచ్చు. నాకూ మొన్నటి దెబ్బతో ఆలింగనాలంటే ఇంటరెస్ట్‌ చచ్చిపోయింది. లాల్చీని బాగా ఉతికి ఆరేయమని దోభీకి చెప్పాను.. లోక్‌సభ నుంచి బాగా పొద్దుపోయాక ఇంటికి చేరుకున్నాక.. ఆ తెల్లారే.  
‘‘ఇంప్రెషన్‌ గట్టిగా పడింది మోదీజీ. మీకు పనికిరాదు. నేను తీసేస్కుంటా’’ అన్నాడు!  
‘‘సర్ఫ్‌ ఎక్సెల్‌ పెట్టినా పోదా దోభీజీ?’’ అని అడిగాను.
‘‘మరకైతే సర్ఫ్‌ ఎక్సెల్‌కి పోయుండేది మోదీజీ. కానీ ఇది మనసు’’ అన్నాడు.
‘‘సరే, ఉంచేస్కో’’ అన్నాను. 
ఈ ఐదు రోజులు ఇక్కడి పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడికి జీవితేచ్ఛ నశిస్తుందనుకుంటాను. 
నాలుగేళ్లుగా గమనిస్తున్నాను. కళ్లలోకి కళ్లు పెట్టి చూడమంటాడు. కరచాలనం కావాలన్నట్లు చూస్తుంటాడు. కొత్తగా ఆలింగనం ఒకటి కోరుకుంటున్నాడు. 
దగ్గరికి ఎందుకొస్తున్నాడో వచ్చేవరకు అర్థం కాలేదు ఆ రోజు. వచ్చి ఆలింగనం చేసుకున్నాడు. అది ఆలింగనంలా లేదు. ఆక్రమణలా ఉంది. ఇస్తే తీసుకోవాలి కానీ, ఇవ్వకుండానే తీస్కోవడం ఏంటి! 
‘‘ఎవరికైనా చూపించమని చెప్పండీ..’’ అని రాజ్‌నాథ్‌సింగ్‌ని దగ్గరికి పిలిచి ఆవేదనగా ఆయన చెవిలో చెప్పాను. 
‘‘మనకెందుకు మోదీజీ ఆవేదన! నెక్స్‌›్ట ఇయర్‌ ఎలాగూ ప్రజలకు తనే చెయ్యి చూపించుకోబోతున్నాడుగా’’ అన్నాడు, వంగి నా చెవిలో.  దూరంగా జరిగాను. ఆలింగనమంటే నాలో భయమింకా పోయినట్లు లేదు. 
‘‘రాజ్‌నాథ్‌జీ.. మీరిప్పుడు నన్ను ఆలింగనం చేసుకోడానికి ప్రయత్నించలేదు కదా’’ అన్నాను. 
ఆయన నావైపు ఆవేదనగా చూశారు. 
‘‘మీరు చెట్టులాంటివాళ్లు మోదీజీ. మీపైకి ఎక్కేవాళ్లుంటారు. మీ నీడలో కూర్చునేవాళ్లుంటారు. మీ కొమ్మలు పట్టుకుని కోతుల్లా ఊగేవాళ్లుంటారు. ‘చిప్కో’ ఉద్యమంలో చెట్లను వాటేసుకున్నట్లుగా మిమ్మల్ని వాటేసుకునేవాళ్లు ఉంటారు. చెట్టు జంకుతుందా! మీరూ అంతే మోదీజీ’’ అన్నాడు రాజ్‌నాథ్‌. 
‘‘నన్ను మోటివేట్‌ చేస్తున్నారా రాజ్‌నాథ్‌జీ’’ అన్నాను. 
‘‘లేదు మోదీజీ.. చెట్టును చూసి నేనే మోటివేట్‌ అవుతున్నాను’’ అన్నాడు. 
కొంచెం కాన్ఫిడెన్స్‌ వచ్చింది నాకు.

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top