రాయని డైరీ: రాజ్‌నాథ్‌సింగ్‌ (హోం మినిస్టర్‌)

Madhav Singaraju Rayani Dairy Article On Rajnath Singh - Sakshi

రాజ్యసభలోకి వచ్చి కూర్చున్నాను. రిలాక్సింగ్‌గా ఉంది. రిలాక్సింగ్‌గా ఉంది కదా అని ఇక్కడే కూర్చుండిపోతే రూల్స్‌ ఒప్పుకోవు. ఎవరి దేశం వారిదే. ఎవరి సభ వారిదే. వెళ్లొస్తుండటానికే గానీ, వెళ్లి ఉండటానికి కాదు.. ఇరుగు పొరుగు దేశాలు, ఇరుగు పొరుగు సభలు. 

నాలుగు రోజులుగా లోక్‌సభలో ఎన్నార్సీ తప్ప ఇంకో తలనొప్పి లేదు. ఇక్కడా అదే నొప్పి గానీ, వెంకయ్యనాయుడు ఉండబట్టి నొప్పి తెలియడం లేదు. 
మజీద్‌ మెమన్‌ నాతో ఏదో మాట్లాడాలని ట్రైచేస్తున్నట్లు కనిపించింది. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ లీడర్‌ ఆయన. ‘ఏమిటి.. చెప్పండి’ అన్నాను. రెస్పాన్స్‌ లేదు. రెస్పాన్స్‌ లేదంటే.. ఆయన ఏదో చెప్పాలని అనుకోవడం లేదు. ఏదో అడగాలని అనుకుంటున్నారు!  

‘ఏమిటో అడగండి మెమన్‌జీ’ అన్నాను. ఈసారీ రెస్పాన్స్‌ లేదు. చెప్పకా, అడగకా.. నన్నే చూస్తూ ఆయన ఏం ఆలోచిస్తున్నట్లు?
‘‘ఎన్నార్సీ మీద మీరేమైనా మాట్లాడాలనుకుంటున్నారా మెమన్‌జీ?’’ అని నేనే అడిగాను. అప్పుడు రెస్పాన్స్‌ వచ్చింది!

‘‘లోక్‌సభ నుంచి మీరు రాజ్యసభకు వచ్చి కూర్చోవచ్చు కానీ, బంగ్లాదేశ్‌ నుంచి అక్కడి వాళ్లు అస్సాంకి రాకూడదా రాజ్‌నాథ్‌జీ!’’ అన్నారు!  
ఎన్నార్సీ లిస్టు మీద ఆయన చాలా కోపంగా ఉన్నారని అర్థమైంది. ‘వచ్చిపోవచ్చు కానీ, ఉండిపోవడం ఎలా కుదురుతుంది చెప్పండి మెమన్‌జీ. యూనియన్‌ మినిస్టర్‌ని కాబట్టి నన్ను రాజ్యసభలోకి రానిచ్చారు. వట్టి లోక్‌సభ సభ్యుడిని మాత్రమే అయితే నాకు ఎంట్రీ ఉండేదా?! దేనికైనా పద్ధతీ ఫార్మాలిటీ ఉంటుంది కదా’’ అన్నాను.
 
మెమన్‌కు అటువైపు మన్మోహన్‌ సింగ్‌ ఉన్నారు. పద్ధతీ ఫార్మాలిటీ అనగానే ఆయన నా వైపొకసారి చూసి, తల తిప్పుకున్నారు. ఆయనతో ఇదే ప్రాబ్లం. భావం ఉంటుంది. భాష ఉండదు. 
మన్మోహన్‌ తల తిప్పుకోవడం వెంకయ్యనాయుడు గమనించారు. ‘‘మన్మోహన్‌జీ.. ఎన్నార్సీపై మీరేమైనా అడగాలని కానీ, చెప్పాలని గానీ అనుకోవడం లేదా?’’ అని అడిగారు. 
మన్మోహన్‌ మౌనంగా ఉన్నారు. 

‘‘మాట్లాడండి మన్మోహన్‌జీ.. రాజ్‌నాథ్‌ అంటున్నారు కదా.. ఎన్సార్సీ మీవాళ్ల ఐడియానే అని.. మీ పేరు కూడా చెప్పారు’’ అన్నారు వెంకయ్యనాయుడు. 
మన్మోహన్‌ మాట్లాడలేదు!

మాట్లాడవలసినవాళ్లు మౌనంగా ఉంటున్నారు. మౌనంగా ఉండాల్సినవాళ్లు మాట్లాడుతున్నారు. మన్మోహన్‌ రాజ్యసభ సీటు అస్సాందే. అయినా ఆయన మాట్లాడ్డం లేదు. అస్సాంలో సగం పాపం పశ్చిమబెంగాల్‌దే. అయినా మమతా బెనర్జీ మాట్లాడకుండా ఉండడం లేదు. రక్తపాతం అంటున్నారు. అంతర్యుద్ధం అంటున్నారు. 
ఆమె ప్రైమ్‌ మినిస్టర్‌ అయితే గానీ ఈ రక్తపాతం, అంతర్యుద్ధం ఆగేలా లేవు! 

-మాధవ్‌ శింగరాజు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top