తమిళ కూలీ

Funday story of the week - Sakshi

ఈవారం కథ

పెద్ద రావి చెట్టు కింద ఆపి వుంచిన జీపుపైన ఎండుటాకులు రాలిపడ్తున్నాయి. మానుపై వాలిన పక్షులు శబ్దం చేస్తున్నాయి.గుంజన యేరుకు అవతల నల్లరాతికొండ వద్ద ఒక తమిళ కూలీ పట్టుబడ్డాడు.ఎర్రచందనం చెట్టు కొట్టడానికి వచ్చిన మిగిలిన కూలీలు పరారయ్యారు.‘చిక్కిన తమిళ కూలీ  నుంచి చిన్న సంచిని, ఒక గొడ్డలిని స్వాధీనపర్చుకున్నారు. విధి నిర్వహణలో భాగంగా గాలింపు చేస్తున్న బీటు ఆఫీసరుకి వీడు దొరికాడు.పట్టుకొచ్చి లోపలేశారు.ఎవరు మాట్లాడుతారు....వాడికి తెలుగు రాదు. వీళ్ళకు తమిళం రాదు. ఏదో విధంగా వాడి నుంచి సమాచారాన్ని రాబడుతున్నారు. మధ్యాహ్నం నుంచి వార్త రాసుకోవడం కోసం విలేకర్లు అక్కడికక్కడే తచ్చాడుతున్నారు. వాళ్ళందరితో పాటు నేను కూడా!ఇంకో జీపు దుమ్ము రేపుకుంటూ ఆవరణలోకి వచ్చింది. మరో ఇద్దరు అధికార్లు దిగారు. చకచకా అడుగులు వేసుకుంటూ లోపలికి వెళ్లారు. వీస్తున్న గాలికి కొమ్మలు ఊగుతున్నాయి.కాసేపటి తర్వాత బయటికొచ్చిన బీటు ఆఫీసరు జీపులో వెనుక వైపు వున్న రెండు ఎర్రచందనం దుంగల్ని లోపలికి తీసుకురమ్మని చెప్పి కళ్ళద్దాలు సర్దుకుంటూ వేగంగా వెళ్ళిపోయాడు. సిబ్బంది వాటిని మోసుకెళ్ళారు. వాతావరణం వేడిగా వుంది. మరోవైపు స్తబ్దత. పదేపదే టైం చూసుకుంటున్నారు చెట్టుపక్కన నిల్చున వాళ్ళు.సెల్‌ పట్టుకొని కాలక్షేపంలో ఇంకొందరు.ఆఫీసు కాంపౌండ్‌కు ఎడమ పక్కన వున్న పాతరేకుల షెడ్డులో టీ కొట్టు దగ్గరికి ఫారెస్ట్‌ ఆఫీసులో ప్రొటెక్షన్‌ వాచర్‌గా ఉద్యోగం చేస్తున్న నాగరాజు వచ్చాడు.‘దొరికిన తమిళ కూలీ ఏమైనా చెప్పాడా...’ అడిగాను ఆత్రుతగా.‘ఆ...’ అని అతను ఊకొట్టాడు.‘ఏం పేరంటా?’‘శివలింగం’ ‘ఎక్కడి నుంచి వచ్చాడో తెలిసిందా..’ మళ్ళీ ప్రశ్న.‘వాడి దగ్గర చెన్నై సెంట్రల్‌ టూ కోడూరు వరకు వున్న జనరల్‌ రైల్వే టికెట్‌ దొరికింది’ ‘అయితే ఉదయాన్నే మెయిల్‌కు వచ్చి వుంటాడు’ అన్నాను నా అభిప్రాయం వ్యక్తం చేస్తూ.

‘అట్నే వుంది!’  పొడిగా జవాబిస్తూ ఐదు టీలు ఆఫీసులోకి పంపించమని టీ కొట్టు వెంకట్రాముడికి చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు...అడిగాను మళ్ళీ...‘తనని ఇక్కడికి ఎవరు పిలిపించారో, అతడి వెనుక వున్న పెద్ద మనిషి పేరు ఏదైనా చెప్పాడా...’అసహనంగా చూశాడు నాగరాజు.‘కాసేపు ఆగితే ఎస్సైసారే...మిమ్మల్నందర్నిలోపలికి పిలిచి విషయాలన్నీ చెప్తాడు’ అంటూ చిరాగ్గా లోపలికి వెళ్లిపోయాడు.త్వరగా వార్త రాసి పంపితే నా పని అయిపోతుంది. డెస్క్‌కు వాట్సాప్‌ మెసేజ్‌ పెట్టాను.ఈమధ్య ఎర్రచందనం వార్తలకు బాగానే ప్రాధాన్యత ఇస్తున్నారు. జిల్లా టాబ్లాయిడ్‌లో రెండవ పేజీలో ఇలాంటి వార్తలకే చోటు లభిస్తోంది.చెన్నై సెంట్రల్‌ నుంచి తిరుపతి, రేణిగుంట మీదుగా  మామండూరు, బాలపల్లె పరిధిలో వున్న ఎర్రచందనం కోసం రైల్వేకోడూరులోకి దిగుతున్నారు తమిళ కూలీలు.మెయిల్‌ తెల్లవారుజామున మూడున్నరకు వస్తుంది.రైల్వేస్టేషన్‌లో దిగడం కొండదారెంబడి సాగిపోవడం ఎంతోకాలంగా సాగుతోంది.ఒక్కోసారి గుంపులు గుంపులుగా కూడా దిగుతుంటారని అక్కడుండేవారు చెప్తుంటారు.వీళ్ళందరూ ఎందుకిలా వస్తున్నారు...?బతకలేనితనం వారిని కూలీలుగా మారుస్తోంది.వీరి వెనుక వుండి నాటకం అంతా నడిపించే స్మగ్లర్లు ఎక్కడో విదేశాల్లో విలాసాలు అనుభవిస్తూ వుంటారు. కడపాత్రంతో గొడ్డలి చేతబట్టి భయంకరమైన అడవుల్లోకి ఎర్రచందనం కొట్టడానికి వస్తున్న కూలీల బతుకు దుర్భరం.క్షణక్షణం భయంభయంగా జీవించాలి.
ఇంటికి తిరిగి క్షేమంగా చేరగలమో లేదో కూడా తెలియదు. తెగిస్తున్నారు.

ఇట్నుంచి పదకొండు కిలోమీటర్లు ముందుకెళ్తే శేషాచలం అభయారణ్యంలో భాగమైన శ్రీవెంకటేశ్వర అభయారణ్యం మొదలవుతుంది. అటే ముందుకు సాగితే కుక్కలదొడ్డి అనే ప్రాంతం వస్తుంది. అక్కడి నుంచి పదికిలోమీటర్ల దూరంలో వున్న తుంబరతీర్థం చేరుకుంటే అడవిలోకి దారులు ఏర్పాటు చేయబడివున్నాయి.పచ్చటి ప్రకృతిలో ఎల్తైన ఎర్రచందనం చెట్ల దారుల్లో ప్రయాణం సాగిస్తే కోనలెన్నో పలుకరిస్తాయి.వలసకోన, చాకలి రేవు కోన, ముత్తరాచకోన, కాశికోన, తలకోనలు అడవిపాటను నేర్పుతాయి.గుంజనేరు దగ్గర ఏనుగుల మందలు సంచరిస్తుంటాయి. వాన కురిసేటప్పుడు యుద్ధారాల తీర్థం అందాలు చూడ్డానికి రెండు కళ్ళు చాలవు.విష్ణుగుండం పొంగి పొర్లుతోంది.ఇంత ప్రకృతి విధ్వంసానికి  గురవుతున్న నేటి దృశ్యం హృదయ విదారకరం.విలేకర్లను లోపలికి పిలిచారు.సెల్‌ లోపల రెండు చేతులూ, రెండు కాళ్ళూ తాడుతో కట్టివేయబడివున్న తమిళకూలీ శివలింగం కన్పిస్తున్నాడు. ముఖమంతా కమిలిపోయి వుంది.కింద పెదవి పగిలి నెత్తుటి చారలు చూపిస్తోంది.మాసిపోయి చినికిపోయి వున్న చొక్కా, ఎర్రటి దుమ్ము నిండి రంధ్రాలు పడివున్న ప్యాంటు, ఈదురుగాలికి కొట్టుకొచ్చి పడివున్న వాడిలాగా కన్పిస్తున్నాడు. భరించలేనంత వాసన వేస్తోంది.కళ్ళు లోతుకు పోయి వున్నాయి.దువ్వని జుట్టు దుమ్మును మోస్తోంది.ఎక్కడి పక్షి మరెక్కడికో వలస వచ్చి బంధించబడినట్లున్నాడు.పగుళ్ళుబారిన శరీర చర్మం. గారపట్టిన దంతాలు. నల్లటిదేహం.అడవిలో దొరికిన మృగాన్ని కటకటాల్లో బంధించినట్లు వాడున్నాడు.శివలింగంకు కట్టిన తాడు విప్పారు.వాడు లేవలేని స్థితిలో వున్నాడు.వాడి దగ్గరి నుంచి స్వాధీనం చేసుకున్న పాత పసుపురంగు సంచి. దానికి సుబ్రహ్మణ్యస్వామి చిత్రం ముద్రించి వుంది. అందులో ఒక సిల్వర్‌టిఫిన్‌ క్యారీ, నాలుగు గుట్కా ప్యాకెట్లు వున్నాయి.దానితో పాటే వాడు ఉపయోగించే గొడ్డలి.ఇవి స్వాధీనం చేసుకున్న వస్తువులు. వాడు కొడుతుండగా పట్టుకున్న రెండు  ఎర్రచందనం దుంగలు.సిబ్బంది ప్రెస్‌కు ఇవ్వాల్సిన ఫొటో కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.శివలింగం బాధగా ప్రాధేయపూర్వకంగా దాహమేస్తున్నట్లు సైగ చేశాడు. అక్కడ మూలగా వున్న మట్టికుండలో వున్న నీళ్ళను కూడా లేచివెళ్లి తాగలేని స్థితి.

ఎవరో గ్లాసుతో అందించారు.గడగడ తాగి వాడు ఊపిరి పీల్చుకున్నాడు.శివలింగం దగ్గర దొరికిన రైల్వేటికెట్‌ను చూపించాడు అటవీ అధికారి.చెన్నై సెంట్రల్‌ టూ కోడూరు అని అందులో రాసి వుంది.జనరల్‌ టికెట్‌.విలేకర్లు ఫొటో తీసుకున్నారు.‘వివరాలు చెప్పండి సార్‌! వార్త రాసుకోవాలి...’ పక్కనున్న మరో విలేకరి కొంత ఆసక్తిగా అడిగాడు.అటవీ అధికారి చిన్నగా నవ్వాడు.‘ముందు టీ తీస్కోండి. చల్లారిపోతుంది’ అంటూ బదులిచ్చాడు.మేమందరం తాగుతుంటే శివలింగం మావైపే చూస్తున్నాడు.‘అతడికి కూడా టీ ఇప్పించండి సార్‌’ ఎవరో వెనక నుంచి అన్నారు.ఇమ్మన్నట్లు అధికారి సైగ చేశాడు. అతడికీ టీ ఇచ్చారు.అధికారి చెప్పడం ప్రారంభించాడు.‘పట్టుబడిన తమిళకూలీ పేరు శివలింగం.తమిళనాడు తిరువణ్ణామలై జిల్లా మురగంబాడి గ్రామానికి చెందినవాడు. ఇతడి వయసు ముప్ఫై సంవత్సరాలు. తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి పెంపకంలో పెరిగాడు. పదో తరగతిలోనే చదువు మానేశాడు. ఇతడి భార్య పేరు మునియమ్మాళ్‌. ఇతడికి నాల్గవ తరగతి చదువుతున్న కూతురు వుంది. పేరు రేవతి’పై ఫ్యాను వేగంగా తిరుగుతోంది.టేబుల్‌పైన వున్న కాగితాలు గాలికి కదులుతున్నాయి.తాగడం పూర్తి కావడంతో కప్పును దూరంగా పెట్టాడు. మీసాలు సవరించుకున్నాడు అధికారి.‘ఎర్రచందనం చెట్టుకొట్టే పని ఎవరు ఇతనికి అప్పగించారు?’ మరొక ప్రశ్న వేశారు.‘అదే చెప్పబోతున్నాను’ అంటూ కళ్ళు ఎగరేశాడు అధికారి.‘శివలింగం వూర్లో వుండేటప్పుడు ఆటో నడుపుకుంటూ జీవించేవాడు. ఇతడికి టింబర్‌ డిపోలో పనిచేసే మాణిక్యంతో పరిచయమైంది. అతడి పని ఏమిటంటే మన ప్రాంతంలో ఎర్రచందనం చెట్లను కొట్టడానికి కావలసిన మనుషులను సప్లై చేయడం.ఏజెంట్‌గా వ్యవహరిస్తాడు.ఇలాంటి ఏజెంట్లు అక్కడ చాలామంది వుంటారు. వారే కూలీలను స్మగ్మర్లకు సమకూర్చిపెడతారు. విదేశాల్లో వుండే స్మగ్లర్లకు ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళూ, రాజకీయనాయకులూ సహకరిస్తుంటారు.

వ్యవహారమంతా గొలుసు పద్ధతిలో సాగుతూ ఉంటుంది’అధికారి సెల్‌ ఫోన్‌ మోగింది.అతడి పై ఆఫీసర్‌ నుంచి వచ్చినట్లుంది.కోరిన వివరాలు సాయంత్రంలోగా పంపిస్తానని అంటున్నాడు.భాష అర్థం కాకపోయిన అధికారి చెప్పే మాటలన్ని తలొంచుకొని  వింటున్నాడు శివలింగం.మాణిక్యం అనే పేరు వచ్చినప్పుడల్లా శివలింగం కళ్ళు ఎరుపెక్కుతున్నాయి. ఆవేశంగా చూస్తున్నాయి.తన జీవితం జైలు పాలు కావడానికి అతడే కారణమని కావచ్చు ఏజెంటు మాటలు నమ్మి అడవిబాట పట్టి కష్టాలు పడుతున్న వైనం శివలింగాన్ని కుదురుగా ఉండనివ్వడం లేదు. మాణిక్యం  కనిపిస్తే తనువెంటతెచ్చుకున్న గొడ్డలితోనే సమాధానం ఇచ్చేటట్లున్నాడు.గట్టిగా తాడుతో కట్టివేయడం వల్ల అతడి చేతులు వాతలు పడినట్లు చారలు కమిలిపోయి కన్పిస్తున్నాయి. బయట చెట్టుపైన పక్షుల శబ్దం ఆగిఆగి విన్పిస్తోంది.అధికారి మళ్లీ చెప్పడం మొదలుపెట్టాడు.‘అంతర్జాతీయ మార్కెట్టులో  ఎర్రచందనానికి విపరీతమైన డిమాండ్‌ ఉంది. అందువల్లనే స్మగ్లర్లు ఎంతకైనా తెగిస్తున్నారు. తమిళనాడులో ఏజెంట్‌లను ఏర్పాటు చేసుకుంటున్నారు. వారి ద్వారా కూలీలను సమకూర్చుకుంటున్నారు. వాటాలు తీసుకుంటున్నారు.’‘చూస్తున్నారు కదా...ఇక్కడ కూలీలను పట్టుకుంటున్నాం. మధ్యలో ఏజెంట్లను పట్టుకున్నాం. అక్కడ స్మగ్లర్లను వలేసి పట్టుకున్నాం. అయినా సమస్య ఇంకా ఉంటుంది’ తాగిన టీకప్పులన్నీ చెత్తబుట్టలోకి చేరాయి.‘ఏదైనా అడగాలనుకుంటే అడగవచ్చు’ అన్నాడు అధికారి కుర్చీలో వెనక్కి వాలుతూ.శివలింగాన్ని ఎక్కడ పట్టుకున్నారు?‘గుంజన యేరుకు అవతల నల్లరాతి కొండ వద్ద’‘ఎప్పుడు?’‘నిన్న సాయంత్రం’‘ఒక్కడే దొరికాడా?’‘అవును. మిగిలిన అయిదుమంది పరారయ్యారు. వారి కోసం గాలిస్తున్నాంరైల్వేటికెట్‌ పైన తేదీ చూస్తే శివలింగం వచ్చి పదిరోజులు దాటుతోంది కదా!‘అయ్యి ఉండవచ్చు. మాకైతే నిన్న సాయంత్రమే పట్టుబడ్డాడు’నీళ్లుతాగి గ్లాసుకింద పెట్టాడు అధికారి.మీ కస్టడీలో ఎన్నిరోజుల నుంచి  ఉన్నాడు?మరో ప్రశ్న వాలింది.

జవాబు లేదు.ఫొటో కార్యక్రమం.శివలింగాన్ని మోకాళ్ళ పైన మధ్యలో నిల్చోబెట్టారు. చేతులు కట్టుకొని ఉన్నారు. అతడి వెనుక అటు నలుగురు ఇటు నలుగురు అటవీ సిబ్బంది నిల్చున్నారు.శివలింగం ముందు రెండు ఎర్రచందనం కొయ్యలు, గొడ్డలి అతడి పాతసంచి ఉంచారు.ఫొటోలు చకచకా తీసుకున్నారు.‘కాసేపు అతడితో మాట్లాడించండి సార్‌!’ అని అన్నాను అధికారితో.‘ఎందుకబ్బా!’ అన్నట్లు చూశాడు.‘అతను తమిళంలో మాట్లాడుతాడు...మీకు అర్థం అవుతుందా?’ అని సన్నగా నవ్వుతూ అన్నాడు అధికారి.శివలింగం విలేకర్ల ముందుకొచ్చాడు.‘ఎనక్కు కవలైయా ఇరుక్కు(నాకు బాధగా ఉంది)ఎన్‌ నలం సరి ఇల్లై(నా ఆరోగ్యం బాగుండడం లేదు)ఎన్‌ కై ఎలుంబు మరిన్‌దదు(నా చేతి ఎముక విరిగింది)వాన్‌ ది వర మాదిరి ఇరుక్కు(వాంతి వచ్చేలాగా ఉంది)అని అన్నాడు కళ్ళ నిండా కన్నీళ్ళు నింపుకొని.ఇంక చాలు వీడ్ని తీసుకెళ్ళి లోపలెయ్యండి అన్నట్లు అధికారి చూశాడు.శివలింగం ఏదో అడగాలనుకుంటున్నట్లు సంశయంగా చూస్తున్నాడు.‘ఈరోజు తారీఖు ఎంత సామీ?’ అని దుఃఖం నిండిన స్వరంతో అడిగాడు తమిళంలోనే.ఎవరో చెప్పారు జవాబు.‘ఈరోజు నా కూతురు పుట్టినరోజు’ అంటూ ఏడుస్తూ అక్కడికక్కడే కన్నీటి సంద్రమైనాడు. బయట పెద్దరావి చెట్టుపైన అంతవరకు శబ్దం చేస్తూ ఉన్న పక్షులు నిశ్శబ్దమయ్యాయి. చెట్టు కింద ఆపి ఉంచిన జీపుపైన ఎండుటాకులు రాలి పడ్తున్నాయి.
  

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top