దాచుకో నీ పాదాలకు తగ... | special interview sith shobha raj | Sakshi
Sakshi News home page

దాచుకో నీ పాదాలకు తగ...

Dec 1 2013 12:01 AM | Updated on Sep 2 2017 1:08 AM

ఆమె గళం అన్నమయ్య... ఆమె మన ం అన్నమయ్య... పాడితే అన్నమయ్య... పలికితే అన్నమయ్య... ఆమె ఉచ్ఛ్వాసనిశ్వాసాలు అన్నమయ్య...

(అన్నమయ్య భావనా వాహిని నేటి కి ముప్పై శరత్తులు పూర్తి చేసుకున్న సందర్భంగా...)

ఆమె గళం అన్నమయ్య... ఆమె మన ం అన్నమయ్య... పాడితే అన్నమయ్య... పలికితే అన్నమయ్య... ఆమె ఉచ్ఛ్వాసనిశ్వాసాలు అన్నమయ్య... సర్వం అన్నమయ్య స్వరూపం... అన్నమయ్య గళార్చనలో తరిస్తున్న ఆమె శోభారాజ్.
 
 అన్నమయ్య పురం ప్రారంభించడానికి కార ణాలు...
 నేను నేదునూరి కృష్ణమూర్తి గారి దగ్గర కర్ణాటక సంగీతంలో సూక్ష్మ విషయాలు తెలుసుకుంటున్నాను. ప్రపంచశాంతికి అవసరమైన అవగాహన ఆ సంకీర్తనల్లో ఉందని గ్రహించాను. అద్భుతమైన కవిత్వం, అందమైన భావన, ప్రౌఢమైన రచనల నుంచి జానపదాల వరకు రచించిన అన్నమాచార్య అంటే ఆరాధన, అనుబంధం ఏర్పడుతూ వచ్చింది. వారి విశాలభావాలు నాకు బాగా నచ్చాయి. అదే సమయంలో నేను సినిమా సంగీత పోటీలలో బహుమతులందుకున్నాను. పెద్ద్దల ప్రశంసలు పొందాను. వారంతా సినిమా పాటలు పాడమంటే, అదృష్ట పరీక్ష చేసుకుందామనుకున్నాను. సరిగ్గా ఆ సమయంలోనే అంటే 1976లో టీటీడీ నుంచి పిలుపు వచ్చింది... అన్నమాచార్య సంకీర్తనల మీద అధ్యయనం చేసి, వాటిని ప్రచారం చేయడానికి బాణీలు చేయమని, అందుకు స్కాలర్‌షిప్ ఇస్తామని. ఒక పక్క సినిమా పాటలు, మరోపక్క స్వామి పిలిచాడు. ఏం చేయాలా అనే ఈ సంకట పరిస్థితిలో... స్వామిసేవకే నా హృదయం మొగ్గు చూపించింది. ఎందరో కళాకారులున్నా భగవంతుడు ఈ అవకాశం నాకే ఇచ్చినట్లుగా అనిపించింది. ‘జీవితాంతం నీ సేవ చేసుకుంటాను’ అని ప్రమాణం చేశాను.
 
 ఆ తరవాత...
 ‘నాకు పాడే శక్తి ఉంది, రాసే శక్తి ఉంది, మాట్లాడే శక్తి కూడా ఉంది. స్వామీ నాతో సేవ చేయించుకో’ అన్నాను. అలా 1983 నవంబరు 30, నా పుట్టినరోజు నాడు అన్నమయ్య భావనా వాహిని ఆవిర్భవించింది.
 
 అద్దె స్థలం నుంచి...

 నా సేవలను గుర్తించి, 1998లో రాష్ట్ర ప్రభుత్వం మా సంస్థకు స్థలం కేటాయించింది. నేను సంపాదించిన ధనం, కొంత విరాళాలు కలిపి ఆడిటోరియం నిర్మించాను. ఈ హాల్ ప్రారంభించి  పదకొండేళ్లయింది. అన్నమయ్య పేరు దివ్యత్వం, శాశ్వతం కావాలనే  ధ్యేయంతో ఆ ప్రాంగణంలోనే అన్నమయ్య, వేంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించాను. ప్రపంచంలో ఒకే గర్భంలో వీరిద్దరికీ నిర్మితమైన ప్రప్రథమ దేవాలయం.
 
  శిష్యుల గురించి...
 ఇక్కడ 1984 నుంచి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాను. ఇప్పటికి సుమారు 16000 మందికి శిక్షణ ఇచ్చాను. అన్నమయ్య సంకీర్తనల మీద పోటీలు నిర్వహిస్తున్నాను. యేటా అన్నమయ్య జయంతి, వర్థంతి సందర్భంగా చిక్కడపల్లి వేంకటేశ్వర  ఆలయం నుంచి టాంక్‌బండ్ అన్నమయ్య విగ్రహం వరకు నగర సంకీర్తన చేస్తున్నాము.
 
 మరచిపోలేని సంఘటనలు...
 చంచల్‌గూడ సెంట్రల్ జైలులో 1997 నవంబరు 30న నా పుట్టినరోజు సందర్భంగా దాదాపు 1700 మంది ఖైదీల సమక్షంలో కేక్ కట్ చేసి, వారి సమక్షంలో సంకీర్తనలు చేయడం... దానికి వారినుంచి లభించిన అపూర్వ స్పందన.
    
 ఉపశమన సంకీర్తన కార్యక్రమం...

 ఒత్తిడిలో ఉన్నవారు, జీవితంలో అనుకోని సంఘటనలకు, దుఃఖానికి లోనైనవారి ఇళ్లలో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. సోషల్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే ఒక ఆయన హెర్నియా ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ఎనిమా కోసం వాటర్ బదులుగా ఆసిడ్ ఎక్కించడంతో పేగులు దెబ్బతిన్నాయి. దాంతో ఆయన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. అక్కడ ఉపశమన సంకీర్తన చేశాం. ‘‘మీరు పాడుతున్నంతసేపు మాకు స్వామివారు ఉన్న అనుభూతి కలిగింది’’ అని చెప్పారాయన.  కొంతకాలం తర్వాత ఆయన మా ఇంటికి వచ్చి, నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను’’ అని చెప్పడం ఎంతో ఆనందం కలిగించింది. ఆ తర్వాత నుంచి నేను సంకీర్తనౌషధం పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను.
 
 అభిరుచులు...

 నాకు ఎం.ఎస్ సుబ్బులక్ష్మిగారి భక్తిభావం, అంకిత భావం, సుశీల గారి ఉచ్చారణ, మాధుర్యం, లతామంగేష్కర్‌గారి వాయిస్ మాడ్యులేషన్, మెలడీ, బాలుగారి సంస్కారవంతమైన ప్రవర్తన, బాలమురళి వంటి వారి నిరంతర కృషి ఎంతో ఇష్టం.
 
 అన్నమయ్య కీర్తనలలో బాగా నచ్చినది...

 అన్నమయ్య చరమ దశలో రచించిన ‘‘దాచుకో నీ పాదాలకు తగ నే చేసిన పూజలివి... సంకీర్తనలో, ‘‘నా నాలుక నుండి నానా సంకీర్తనలు పూని నాచే నిన్ను పొగడించితివి’’ కీర్తన చాలా నచ్చింది.
 
 మీరు చేసిన మార్పులు...
 ‘అదిగో అల్లదిగో’ సంకీర్తనను జనసామాన్యంలోకి తీసుకువెళ్లడానికి మల్లిక్‌గారు పాడిన భౌళిరాగంలో బాణిని తీసుకుని, భావోద్దీపన కోసం ఎక్కడ ఎలా పలికితే బావుంటుందో అలా మార్చాను. అనుపల్లవితో కీర్తన ప్రారంభించే సంప్రదాయం మేరకు నేను ప్రారంభించిన ‘బ్రహ్మమొక్కటే’కీర్తన
 
 సాధించిన విజయాలు...

 అన్నమయ్య తపాలాబిళ్ల కోసం కృషిచేసి, 2004లో అన్నమయ్యపురంలో తపాలాబిళ్ల విడుదల చేశాను. దేశవిదేశాలలో కార్యక్రమాలద్వారా యువతను ప్రోత్సహిస్తున్నాను. ప్రస్తుతం దేవాలయ కుంభాభిషేకం కోసం ప్రయత్నిస్తున్నాను.
 
 -డా.పురాణపండ వైజయంతి


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement