
హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఉంటారు రామ్. లాక్‌డౌన్‌కి జనం స్పందించకపోవడంపై బాగా కలత చెందారు. కలం కదిపారు. ‘చేతులెత్తి మొక్కుతా.. చేయి చేయి కలపకురా..’ అంటూ మేల్కొలుపు పాట పాడారు. ఇప్పుడా పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ సందర్భంగా రామ్‌ని ‘సాక్షి’ పలకరించింది.
‘‘మాది కాకినాడ దగ్గర పిఠాపురం పక్కన కోలంక గ్రామం. ఎంబిఎ కోసం 2006 లో హైదరాబాద్ వచ్చాను. చదువు పూర్తయ్యాక టాక్స్ కన్సెల్టెంట్‌గా పనిచేశా. చిన్నప్పుడు రెండేళ్ల పాటు క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నా. ఆ ఆనుభవంతో టాక్స్ కన్సెల్టెంట్‌గా ఉన్నప్పుడే యాడ్స్ కమర్షియల్స్‌కి బ్యాక్ గ్రౌండ్ వర్క్‌చేశా. అది రేడియో మిర్చి లో మ్యూజిక్ కంపోజర్‌గా అవకాశం అందించింది. అక్కడి నుంచి మ్యూజిక్ నా ప్రపంచం అయిపోయింది. రెండేళ్ల క్రితం స్నేహితులతో కలిసి ‘చౌరస్తా’ బ్యాండ్ స్టార్ట్ చేశా. గాయకుడిగా, రచయితగా మారా. ‘లాయలో లల్లాయలో..’ అనేది నేను రాసిన తొలి పాట. అది క్రిటిక్స్ ప్రశంసలకు నోచుకుంది. ఆ తర్వాత రైతుల సమస్యల మీద రాసిన పాటలతో ‘సాగు బరువాయెనా..’ అనే ఆల్బమ్ విడుదల చేశా. గుర్రం ఆనంద్ అనే స్నేహితుడితో కలిసి రాసిన ‘ఊరెళ్లిపోతా మామా..’ పాటకైతే బాగా పేరు తెచ్చింది. రెగె ప్లస్ ఫోక్ కలిపిన సై్టల్‌లో నా మ్యూజిక్ ఉంటుంది. ఇప్పుడు రేడియో నుంచి వైదొలిగాను. సినిమాలకు కూడా పనిచేస్తున్నా.
లాక్‌డౌన్ కదిలించింది
ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అందరికీ తెలిసినవే. ప్రభుత్వాలు, అధికారులు ఎంతో కష్టపడి పనిచేస్తున్నా కూడా ప్రజలు సహకరించకపోవడం చాలా బాధ కలిగించింది. అందుకే ఒక రాత్రి పూట కూర్చుని ఆవేదనతో ఈ పాట (చేతులెత్తి మొక్కుతా..) రాసి రికార్డ్ చేశాను. అప్‌లోడ్ చేసేశాను. దాదాపు 15లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ పాట హిట్టయింది, పేరొచ్చింది అనేదెలా ఉన్నా జనంలో మార్పొస్తే ఇంకా సంతోషం కలుగుతుంది. నా వైపు నుంచి యూత్‌కి చిన్న సూచన. మీరు కూడా హోమ్ క్వారంటైన్‌లో ఉంటూ ఇలాంటి పాటలు తయారు చేయండి..’’ అంటున్నారు రామ్. – ఆరెన్నార్