భారత ప్రజలమైన మేము..!

Karnataka Couple Ties Knot Celebrating Secular Rituals - Sakshi

రెండు  విషయాలు

ఈ ఫోటో చూడండి. ఇందులో పెళ్లి కొడుకున్నాడు. పెళ్లి కూతురు ఉంది. ఒకరిద్దరు పెద్దలు ఉన్నారు. స్పష్టంగా మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే.. వాళ్లు పెళ్లి మాత్రమే చేసుకోవాలనుకున్నారు. ఫొటోలు వద్దనుకున్నారు. ఈ ఫొటో అయినా ఎవరో తీసిన వీడియోలోంచి బయటికి వచ్చింది. ఇద్దరూ ఒకే మతం వారు. అయితే మూడు మతాల పెద్దలు పెళ్లి జరిపించారు. మంత్రాలు లేవు. అక్షింతలు లేవు. వచ్చిన వారు వధూవరులపై పూలు మాత్రం చల్లారు. ఒక ‘ప్రియాంబుల్‌’ను చదివించారు. ప్రియాంబుల్‌ అంటే రాజ్యాంగ ప్రవేశిక. ‘భారత ప్రజలమైన మేము..’ అనే వాక్యంతో ఈ ప్రవేశిక మొదలౌతుంది.

‘కలిసుంటాం’ అనే భావంతో ముగుస్తుంది. కర్ణాటక గదగ్‌ జిల్లా గదగ్‌ పట్టణంలోని అంబేద్కర్‌ భవన్‌లో ఈ పెళ్లి జరిగింది. శాంతలింగ స్వామీజీ, మౌల్వీ షబీర్‌ మౌలానా, ఫాదర్‌ ఎబినజర్‌.. మూడు మతాల సాక్షులుగా ఉండి పెళ్లి జరిపించారు. ప్రియాంబుల్‌ని కానుకగా ఇచ్చింది ఈ ముగ్గురే. తర్వాత సన్మానం జరిగింది. ఎవరికనుకున్నారూ? పౌర కార్మికులకు. అంటే పారిశుద్ధ్య కార్మికులు. ఎంత మంచి పెళ్లి కదా! బసవరాజు, సంగీతలను మెచ్చుకోవాలి. వాళ్లెవరు? ఇంకెవరూ.. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు.

ట్రాన్స్‌ జెండర్లమైన మేము..!
స్వప్న గురించి గతంలో మీరు వినే ఉంటారు. మదురై అమ్మాయి. అమ్మాయి అంటే అమ్మాయి కాదు. అమ్మాయిలా మారిన అబ్బాయి. ట్రాన్స్‌జెండర్‌. తాజాగా స్వప్నకు తమిళనాడు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌ 1 పరీక్షల్లో 228వ ర్యాంకు వచ్చింది. తమిళనాడు గ్రూప్‌ వన్‌లో విజేతగా నిలిచిన తొలి ట్రాన్స్‌జెండర్‌గా కూడా ఈ విజయం స్వప్నకు గుర్తింపు తెచ్చింది. ప్రభుత్వంలో పరీక్ష రాసి ర్యాంక్‌ సాధించారు స్వప్న! మొదట్లో ట్రాన్స్‌జెండర్‌లు సర్వీస్‌ కమిషన్‌ రాసేందుకు వీల్లేకపోయేది. స్వప్నే తమిళనాడు ప్రభుత్వంతో పోరాడి హైకోర్టు నుంచి పరీక్ష రాసే యోగ్యతకు ఆదేశాలు తెచ్చుకున్నారు.

అది మిగతా ట్రాన్స్‌జెండర్‌లకూ మేలయింది. తొలిసారి 2013లో ‘యోగ్యత’ కేసు వేశారు స్వప్న. తనను మహిళ కేటగిరీలో గుర్తించాలని 2015లో మరో కేసు. గెలిచే వరకు పోరాడారు. 2018లో గ్రూప్‌ 2లో పాసై అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌గా, అసిస్టెంట్‌ కమర్షియల్‌ టాక్స్‌ అఫీసర్‌గా మదురైలోనే పని చేశారు. ఇప్పుడు ఏకంగా పెద్ద ర్యాంకు, పెద్ద పోస్టు. డిఎస్పీగా గానీ, కమర్షియల్‌ టాక్స్‌లోనే అసిస్టెంట్‌ కమిషనర్‌గా గానీ! నిర్ణయం ఆమెదే. ఈ రోజు చెన్నైలో కౌన్సెలింగ్‌.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top