వెనిస్‌ వాకిట్లో బాంబే రోజ్‌

Bombay Rose Selected in Venice Festival - Sakshi

బాంబే రోజ్‌... గులాబీల్లో వెరైటీ కాదు. కాని ముంబైలో పూసిందే! సిల్వర్‌స్క్రీన్‌ మీద.. గీతాంజలి రావు ఆలోచనల్లోంచి! ఆ సినిమానే రేపు ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్‌ 7 వరకు జరగనున్న వెనిస్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌కు ఎంపికైంది! ఇక్కడ ప్రస్తావించుకోవడానికి సందర్భాన్ని తెచ్చింది!

ముందు సినిమా గురించి చెప్పుకుందాం.. తర్వాత గీతాంజలి రావును పరిచయం చేసుకుందాం.‘‘బాంబే రోజ్‌’’  యానిమేటెడ్‌ మూవీ.  ముంబైలో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందింది.  కమల, సలీమ్‌ .. రెండూ ముఖ్యమైన పాత్రలు. బాల్య వివాహం నుంచి తప్పించుకొని ముంబై చేరుతుంది కమల.  కశ్మీర్‌ రాజకీయాలకు బలైన యువకుడు సలీమ్‌. కొత్త జీవితం అన్వేషణలో అతనూ ముంబై చేరుతాడు. రోడ్డుకు ఇవతలివైపు పూలు అల్లుకుంటూ కమల, అవతలివైపు పూలమాలలు అమ్ముకుంటూ సలీమ్‌. బాలీవుడ్‌ డ్రాప్‌గా ఆ ఇద్దరి మధ్య నడిచన కథే బాంబే రోజ్‌.    యానిమేషన్‌ సినిమాలకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ ప్రధానం. రఫ్‌గా తీసిందే బ్లూ ప్రింట్‌ అవుతుంది. ‘‘బాంబే రోజ్‌’’ బ్లూ ప్రింట్‌కి రెండేళ్లు పట్టిందట. . మొత్తం చిత్రం పూర్తి కావడానికి ఐదు సంవత్సరాల పైనే పట్టిందిట. ఈ సినిమాకు వాడిన సంగీతం ఎనభై శాతం పాత సినిమాల్లోంచి తీసుకున్నదే. కమల పాత్రకు శైలీ ఖారే, సలీమ్‌ పాత్రకు అమిత్‌ డియోండీ, విలన్‌ పాత్రకు మకరంద్‌ దేశ్‌పాండే, బాలీవుడ్‌ స్టార్‌కు అనురాగ్‌ కశ్యప్, కమల తాత పాత్రకు వీరేంద్ర సక్సేనా గళాన్ని అందించారు.

గీతాంజలి పరిచయం..
షూజిత్‌ సర్కార్‌ దర్శకత్వం వహించిన ‘‘అక్టోబర్‌’’సినిమా గుర్తుండే ఉంటుంది కదా. అందులో ప్రమాదవశాత్తు బిల్డింగ్‌ పై నుంచి కిందపడిన యువతి తల్లిగా నటించిన నటే గీతాంజలి రావు. జెజె స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో  కమర్షియల్‌ ఆర్ట్‌ కోర్సు చేశారు ఆమె. అక్కడున్నప్పుడే  ప్రఖ్యాత యానిమేటర్‌ రామ్‌ మోహన్‌ దగ్గర యానిమేషన్‌ నేర్చుకున్నారు. అలా ఆమె  2006లో ‘‘ప్రింటెడ్‌ రెయిన్‌బో ’’ అనే తన ఫస్ట్‌ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్‌కి  రూపమిచ్చారు. దీనికి 28 అవార్డులు వచ్చాయి. ఫిల్మ్‌ స్కూల్స్‌లో సబ్జెక్ట్‌ కూడా అయ్యిందీ సినిమా.  ఆ తర్వాత  పదేయేళ్లకు ‘‘విష్‌ ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెల్ఫీ’’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ తయారు చేశారు.  ఆమె తన సెల్ఫీలను  రాజకీయనాయకులు, కళాకారులతో కలిసి తీసుకున్నట్టుగా ఫోటోషాప్‌ చేసి తీసిన సినిమానే అది. చాలామంది ఆసక్తిగా చూశారు.  46 యేళ్ల  గీతాంజలి పూర్తిస్థాయి సినిమా తీయడానికి చాలా యేళ్లే నిరీక్షించాల్సి వచ్చింది.  ఫైనాన్సియర్లు ముందుకు రాకపోవడమే కారణం. ఈ ప్రాజెక్ట్‌ కోసం టీవీ కమర్షియల్స్‌లో  నటించారు. ‘‘ చాలా యేళ్లుగా  నటిస్తూనే ఉన్నాను. యానిమేషన్‌లో తలమునకలై ఉండడంతో  అనురాగ్‌ కశ్యప్‌ ‘‘పాంచ్‌’’ లో నటించే అవకాశం వచ్చినప్పటికీ  సున్నితంగా తిరస్కరించాను.

బాంబే రోజ్‌’ మేకింగ్‌లో బిజీ అవడంతో ఇంకొన్ని అవకాశాలకూ నో చెప్పాల్సి వచ్చింది. ఆరు సంవత్సరాల కిందటే  బాంబే రోజ్‌  కథ  ఆలోచించాను. తీయడానికే   నిర్మాతలు దొరకలేదు. మంచి భవిష్యత్‌ కోసం ముంబైకి  వలస వచ్చిన వారి జీవితమే ఈ చిత్రం.   నేను కూడా ఇక్కడకు వలస వచ్చినదానినే. ముంబైకి సంబంధించిన ఎన్నో అంశాలు నిత్యం నన్ను పలకరిస్తూనే ఉంటాయి. అందువల్లే ఈ చిత్రం టైటిల్‌లో బాంబే పేరు ఉంచాను.  నాకు పూల పట్ల ఉన్న ప్రేమను ప్రదర్శించాను. నేను ట్రైన్లో చూసిన పూలమ్ముకునే అమ్మాయి జీవితం ఆధారంగా వచ్చినదే కమల పాత్ర.  నిత్యం నా తలలో మల్లెపూలు పెట్టుకుంటాను. చెమటలు కక్కే బొంబాయి మహానగరంలో వీటి వల్లే సువాసనలు పీల్చుకోగలం.  దాదర్‌ ఫ్లవర్‌ మార్కెట్, జుహు బీచ్‌ల మధ్య తిరుగుతుండే పూలవారికి సంబంధించిన దృశ్యాలను యానిమేట్‌ చేయడానికి ఎనిమిది నెలల సమయం పట్టింది. ఒక సూట్‌కేసులో బట్టలన్నీ నిండుగా ఉన్నట్లే, నా మదిలో కూడా ఆలోచనలు అలాగే ఉన్నాయి. అంతకుముందు.. ముంబైకి వలస వచ్చిన ముగ్గురి కథ ఆధారంగా తీసిన గిర్‌గీత్‌ చిత్రం..  ఆరు నెలల పాటు నిర్మాణం జరిగాక ఆగిపోయింది. ఆ అనుభవంతో  ‘ట్రూ లవ్‌ స్టోరీ’ అనే షార్ట్‌ఫిల్మ్‌  తీశాను. అది 2014లో జరిగిన కేన్స్‌ ఉత్సవంలో ప్రదర్శనకు ఎంపికైంది. నేను ప్రారంభించి ఆపేసిన చాలా సినిమాల నుంచి కొత్త పాఠాలు నేర్చుకున్నాను. ’’ అంటారు గీతాంజలి రావు.

వెనిస్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ‘‘బాంబే రోజ్‌’’ తోపాటు  వి. బి. సమంత తీసిన హనుమాన్‌ (2005), అర్నబ్‌ చౌదరి తీసిన అర్జున్‌ – ద వారియర్‌ ప్రిన్స్‌ (2012),   శిల్పా రనాడే తీసిన గోపీ గవయ్యా బాజా బజయ్యా,  చోటాభీమ్‌ పాత్రల ఆధారంగా రూపొందినవి మరికొన్నీ ప్రదర్శనకు ఎంపికయ్యాయి.– వైజయంతి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top