‘దేశం’ డీలా! | no candidates for telugu desam party | Sakshi
Sakshi News home page

‘దేశం’ డీలా!

Mar 20 2014 12:06 AM | Updated on Aug 10 2018 8:01 PM

వికారాబాద్ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. ఇక్కడి నుంచి డాక్టర్ ఏ.చంద్రశేఖర్ సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. 2004లో ఆయన టీడీపీకి రాజీనామా చేసి అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరారు.

చుక్కానిలేని నావలా..
 వికారాబాద్ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. ఇక్కడి నుంచి డాక్టర్ ఏ.చంద్రశేఖర్ సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. 2004లో ఆయన టీడీపీకి రాజీనామా చేసి అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరారు. చంద్రశేఖర్ రాజీనామా టీడీపీపై తీవ్ర ప్రభావం చూపింది. అప్పటి నుంచి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న పార్టీని సంజీవరావు (నియోజకవర్గ ఇన్‌చార్జి) సమర్థంగా నడిపించలేకపోయారు. ఆయన కూడా 2012లో వైఎస్సార్ సీపీలో చేరడంతో ‘దేశం’ పరిస్థితి చుక్కానిలేని నావలా తయారైంది. ఈ క్రమంలోనే విజయ్‌కుమార్‌ను నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించినా పార్టీకి పూర్వవైభవం దక్కలేదు.

 ఈ తరుణంలో కొత్త నేతను ఇక్కడి నుంచి బరిలో నిలపాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది. మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌ను ఢీకొనేందుకు సమర్థ అభ్యర్థి వెతుకులాటలో తలమునకలవుతోంది. అందులో భాగంగా టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీశైలం మాదిగ పేరును తీవ్రంగా పరిశీలిస్తోంది. ఆర్థికంగా స్థితిమంతుడు కూడా కావడంతో ప్రసాద్‌కు చెక్‌పెట్టవచ్చని అంచనా వేస్తోంది. చంద్రశేఖర్ టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో నియోజకవర్గంలో టీ ఆర్‌ఎస్ బలహీనంగా తయారుకావడం తమకు కలిసివస్తుందని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది.

 వలస నేతలపైనే ఆశలు
 ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పి.మహేందర్‌రెడ్డి రాజీనామాతో తాండూరులో ఆ పార్టీ పరిస్థితి మరింత తీసికట్టుగా మారింది. నియోజకవర్గంలో గతంలో ఒక వెలుగువెలిగిన పార్టీ ప్రస్తుతం కొత్త నాయకుల కోసం ఎదురుచూస్తోంది. మహేందర్‌రెడ్డి బలమైన నాయకుడు కావడం, దిగువ శ్రేణి నాయకులు కూడా ఆయన బాటలోనే గులాబీ గూటికి చేరిన నేపథ్యంలో టీడీపీ ఇక వలస నేతలపైనే గంపెడాశలు పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఇటీవల చంద్రబాబును కలిసిన మాజీ మంత్రి స్వర్గీయ ఎం. చంద్రశేఖర్ కుమారుల్లో ఒకరికి టికెట్ ఖరారు చేయాలని ‘దేశం’ భావిస్తోంది.

ఇక్క డ బలంగా ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంకును దెబ్బతీయడానికి వీరి చేరిక లాభిస్తుందని అంచనా వేస్తోంది. బలమైన నేతలు దొరక్కపోతే ఈ సీటును సర్దుబాటులో భాగంగా బీజేపీ కేటాయించి చేతులు దులుపుకోవాలని అనుకుం టోంది. మాజీ మంత్రి సబిత సోదరుడు నరసింహారెడ్డి బీజేపీ పంచన చేరనున్న నేపథ్యం లో కాంగ్రెస్‌ను దెబ్బతీయవచ్చని, అదేసమయంలో సమీప బంధువైన మహేందర్‌రెడ్డి వర్గంలోనూ చీలిక ఏర్పడుతుందని టీడీపీ ఆశి స్తోంది. బీజేపీతో పొత్తు కుదిరితే తాండూరు లో విజయావకాశాలు మెరుగవుతాయని అం చనా వేస్తోంది. ఈ క్రమంలో కమలానికి ఈ సీటును వదిలేందుకు సైతం ‘సై’ అంటోంది.

 ఆకర్ష్ ఫలిస్తే..
 చేవెళ్ల ఎమ్మెల్యే కేఎస్ రత్నం గుడ్‌బై చెప్పడం తెలుగుదేశం పార్టీని ఆత్మరక్షణలో పడేసింది. ఎన్నికల వేళ ఆయన అనూహ్యంగా టీఆర్‌ఎస్‌లోకి జంప్ చేయడంతో కంగుతున్న తమ్ముళ్లు.. అభ్యర్థి అన్వేషణలో తలమున కలయ్యారు. రిజర్వ్‌డ్ సీటు కావడం, నిర్దేశిత సామాజికవర్గం నాయకులు ఆర్థికంగా స్థితిమంతులు కాకపోవడంతో కొత్త వారిపైనే పార్టీ నమ్మకం పెట్టుకుంది. ఈ క్రమంలో ఇక్కడి నుంచి స్థానిక నేతలకు ఛాన్స్ ఇచ్చేది అనుమానంగానే కనిపిస్తోంది. సొంత పార్టీలో సమర్థ అభ్యర్థులు లేకపోవడంతో ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తోంది. ప్రధానంగా టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి చంద్రశేఖర్, ఎస్సీ సెల్ కన్వీనర్ వెంకటస్వామిపై కన్నేసింది. కాంగ్రెస్ టికెట్ లభించకపోతే తమ గూటికి చేరేలా వారితో సంప్రదింపులు జరుపుతోంది. కాంగ్రెస్ టికెట్లు ఖరారయితే తప్ప.. ఇక్కడి నుంచి టీడీపీ తరుఫున ఎవరు బరిలో ఉంటారనేది స్పష్టం కాని పరిస్థితి.  

 బీసీ నేతలపై గురి!
 2009లో పార్టీ తరఫున ఇక్కడి నుంచి గెలుపొందిన హరీశ్వర్‌రెడ్డి టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోవడం, ఎన్నికల వేళ ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి అన్నబాటనే అనుసరించడంతో పరిగిలో ‘దేశం’ పరిస్థితి దిగజారింది. ఇద్దరు ముఖ్యనేతలు కారెక్కడంతో నైరాశ్యంలో కూరుకుపోయిన పార్టీ శ్రేణులు కూడా పక్కచూపులు చూస్తున్నాయి. ఈ తరుణంలో వచ్చే ఎన్నికల్లో పార్టీ తరుఫున పోటీకి నాయకుల కొరత ఏర్పడింది. దీంతో వలస నేతలపైనే ఆశలు పెట్టుకుంది. బలమైన సామాజికవర్గానికి చెందిన ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు.. బీసీ అస్త్రాన్ని ప్రయోగించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యతోపాటు, జెడ్పీ మాజీ  చైర్మన్ కాసాని జ్ఞానేశ్వర్‌లకు వల విసురుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌లో కొనసాగుతున్న జ్ఞానేశ్వర్ సైకిలెక్కెందుకు అంగీకరిస్తే పరిగి పగ్గాలను అప్పగిస్తామని హామీ ఇస్తోంది. నియోజకవర్గ అభ్యర్థుల గెలుపోటములను నిర్ధేశించేస్థాయిలో కాసాని ఉండడంతో ఎలాగైనా ఆయన్ని పార్టీలోకి తేవాలని అధినాయకత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement