హత్య చేసి దిబ్బలో పూడ్చి! | progress in sandhyarani case | Sakshi
Sakshi News home page

హత్య చేసి దిబ్బలో పూడ్చి!

Oct 19 2016 10:55 PM | Updated on Jun 4 2019 5:16 PM

సంధ్యారాణి మృతదేహాన్ని పాతిపెట్టిన ప్రదేశం - Sakshi

సంధ్యారాణి మృతదేహాన్ని పాతిపెట్టిన ప్రదేశం

ఆళ్లగడ్డకు చెందిన సంధ్యారాణి(35)ని ప్రియుడు నూర్‌ అహ్మద్‌ హత్య చేసినట్లు పోలీసు విచారణలో బయటపడింది.

సంధ్యారాణి కేసులో పురోగతి
– విచారణలో నేరాన్ని అంగీకరించిన నూర్‌ అహ్మద్‌ 
– పంచలింగాల శివారులో నేర స్థలాన్ని పరిశీలించిన పోలీసు అధికారులు 
– ఎస్పీ సమక్షంలో నేడు మృతదేహం వెలికితీత
 
కర్నూలు: ఆళ్లగడ్డకు చెందిన సంధ్యారాణి(35)ని ప్రియుడు నూర్‌ అహ్మద్‌ హత్య చేసినట్లు పోలీసు విచారణలో బయటపడింది. డీఈఓ కార్యాలయంలోని సర్వశిక్ష అభియాన్‌ విభాగంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నిందితుడు ఆళ్లగడ్డ పట్టణంలో స్కూల్‌ నిర్వహిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన సంధ్యారాణి ఇతని స్కూల్‌లో టీచర్‌గా పనిచేసేది. అప్పటి నుంచి అతనితో పరిచయం ఉంది. వారి మధ్యనున్న సాన్నిహిత్యాన్ని అతని భార్య పర్వేజ్‌ వ్యతిరేకిస్తూ తరచూ గొడవ పడేది.

ఈ నేపథ్యంలో ఈనెల 7న సంధ్యారాణి.. నూర్‌ అహ్మద్‌ కోసం కర్నూలుకు వచ్చింది. విషయం తెలుసుకున్న ఆయన భార్య, బావమరుదులు, కుటుంబ సభ్యులు విస్టా కారు, మారుతి వ్యాన్‌లో కర్నూలుకు చేరుకున్నారు. అదే రోజు రాత్రి నూర్‌ అహ్మద్, తన కుటుంబ సభ్యులు కలసి సంధ్యారాణిని వాహనంలో పంచలింగాల శివారులోకి తీసుకెళ్లారు. అక్కడ అతనికి ఫామ్‌హౌస్‌ ఉంది. సమీపంలోనే సంధ్యారాణిని హత్య చేసి కసువు దిబ్బలో పూడ్చిపెట్టారు.

హతురాలు సోదరి లక్ష్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎస్‌ఐ జయన్న, ఏఎస్‌ఐ సురేంద్ర నేతృత్వంలో నూర్‌ అహ్మద్‌పై నిఘా వేసి రెండు రోజుల క్రితం సాయిబాబా దేవాలయంలో అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం రాత్రి నగర శివారులోని జగన్నాథగట్టుపై ఉన్న పోలీసు శిక్షణా కేంద్రానికి తీసుకెళ్లి పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా.. అడ్డు తొలగించుకునేందుకే ఆమెను హత్య చేసినట్లు అంగీకరించాడు. నిందితునితో పాటు మూడవ పట్టణ సీఐ మధుసూదన్‌రావు, ఎస్‌ఐ జయన్న, తాలూకా క్రైం పార్టీ పోలీసులు బుధవారం ఉదయం నేర స్థలాన్ని సందర్శించారు. సుమారు 10 అడుగుల లోతు గొయ్యి తవ్వి పూడ్చిపెట్టి పేడ కప్పినట్లు నిందితుడు పోలీసులకు వివరించాడు. ఎస్పీ ఆకే రవికృష్ణ సమక్షంలో మృతదేహాన్ని గురువారం వెలికి తీయనున్నట్లు సమాచారం.

నూర్‌ అహ్మద్‌ భార్యతో పాటు బావమరుదులు, మరికొంతమంది కుటుంబసభ్యులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారు నేరానికి ఉపయోగించిన విస్టా కారు, మారుతి వాహనాన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్‌లో భద్రపరిచారు. సంధ్యారాణిని హత్య చేయడానికి ప్రధాన కారకులెవరు, కారణాలేమిటి, అందుకు ప్రోత్సహించినది ఎవరు తదితర విషయాలపై ఇంకా విచారణ కొనసాగుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement