వృద్ధుడి వద్ద డబ్బులు అపహరణ

Young Man Cheated To Old Man  - Sakshi

రూ.20వేలు దొంగిలించిన యువకులు

సీసీ ఫుటేజీలో రికార్డు

వర్ధన్నపేట వరంగల్‌ : తన ఖాతాలో డబ్బులు జమ చేసేందుకు బ్యాంకుకు వెళ్లిన ఓ వృద్ధుడి వద్ద గుర్తుతెలియని వ్యక్తులు డబ్బులను అపహరించిన సంఘటన గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్సై ఉపేందర్‌రావు కథనం ప్రకారం... వర్ధన్నపేట పట్టణానికి చెందిన బోయినపెల్లి కమలాకర్‌రావు తన కొడుకు పంపిన రూ.4.20లక్షలు ఈ నెల 6న బ్యాంకు ఖాతాలో జమ చేయడానికి వెళ్లాడు. డీనామినేషన్‌ ఓచర్‌ నింపి క్యాష్‌కౌంటర్‌ వద్ద డబ్బులు జమచేయడానికి క్యూలో నిల్చున్నాడు. తనవంతు రాగానే కౌంటర్‌లో ఓచర్, డబ్బులు క్యాషియర్‌కు అందజేశాడు. క్యాషియర్‌ ఆ డబ్బులు లెక్కించి ఓచర్‌లో ఉన్న నగదుకు రూ.20వేలు తక్కువ వచ్చాయని చెప్పాడు.

దీంతో తాను తాను పలుమార్లు లెక్కించి తెచ్చానని, ఆ డబ్బు కౌంటర్‌ వద్దే మాయమయ్యాయని వాదించాడు. మేనేజర్‌ దృష్టికి తీసుకెళ్దామంటే వారం రోజులు సెలవులో ఉన్నారు. బ్యాంకు మేనేజర్‌ రాగానే సీసీ ఫుటేజీ పరిశీలిస్తే విషయం తేలిపోతుందని బ్యాంకు సిబ్బంది కమలాకర్‌రావుకు నచ్చజెప్పి పంపారు. వారమవుతున్నా సమాచా రం లేకపోవడంతో అ తడు ఈనెల 13న పోలీ స్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

బ్యాంకు మేనేజర్‌ గురువారం విధులకు రాగా సీసీ ఫుటేజీలను పరిశీలించారు. కమలాకర్‌ రావు డబ్బులు చేతిలో పట్టుకుని క్యూలైన్‌లో నిల్చుని ఉండగా యువకులు చుట్టూ ఉండగా, ఓ యువకుడు డబ్బు కట్టల నుంచి నెమ్మదిగా లాగి ఆ డబ్బు కాగితంలో చుట్టి తీసుకుని బయటకు వెళ్లి నట్లు స్పష్టంగా రికార్డయ్యింది. ఇటీవల జనగామ జిల్లా బచ్చన్నపేట బ్యాంక్‌లో సైతం ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top