
సాక్షి, బెంగళూరు/బనశంకరి: పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు తెలిపే సమయంలో విధ్వంసానికి కుట్రపన్నిన జిహాదీ ముఠా గుట్టును బెంగళూరు పోలీసులు ఆదివారం రట్టు చేశారు. కీలక సూత్రధారి మహబూబ్ పాషా.. బెంగళూరులో ఉన్న జిహాదీ ముఠాకు నాయకుడని వెల్లడైంది. పోలీసులు తమ వ్యవహారం పసిగట్టారని తెలియగానే పాషా ముఠా పరారైంది. కొడగు జిల్లా అటవీప్రాంతం, బెంగళూరు సమీపంలోనీ అటవీప్రాంతాల్లో సభ్యులకు తుపాకీ కాల్చడం, బాంబుల తయారీ వంటి వాటిలో శిక్షణనిస్తున్నట్లు విచారణలో వెలుగుచూసింది. ముఠా కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. కాగా, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, వారితో సంప్రదింపులు జరుపుతున్నారన్న అభియోగాలతో ఇద్దరు ఇమామ్‌లను పోలీసులు అరెస్టు చేశారు.