మహిళ గొంతు కోసి.. ఆపై?

Thief Attack On Women Mahabubabad - Sakshi

కురవి(డోర్నకల్‌): పత్తి చేనులో పనిచేస్తున్న ఓ మహిళను గుర్తుతెలియని వ్యక్తి కత్తి (చాకు) చూపి బెదిరించి గొంతుపై కోసి మెడలోని ఐదు తులాల బంగారు పుస్తెల తాడు లాక్కుని పరారయ్యాడు. ఈ సంఘటన మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలంలోని నేరడ శివారు చెరువుముందు(భద్రు) తండాలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. తండాకు చెందిన బాదావత్‌ చందన అనే మహిళ తమ పత్తి చేనులో పనిచేస్తోంది. గుర్తుతెలియని వ్యక్తి బైక్‌ (పల్సర్‌)పై వచ్చి పత్తి చేను సమీపంలో రోడ్డుపై ఆగాడు. బైక్‌ను రోడ్డు పక్కన నిలిపి చందన వద్దకు వెళ్లి, తాగడానికి మంచినీళ్లు కావాలని అడిగాడు. ఆమె మంచినీళ్లు తీసుకువచ్చింది. హఠాత్తుగా కత్తి(చాకు) చూపి బెదిరిస్తూ మెడలోని బంగారు పుస్తెల తాడును అపహరించేందుకు లాగాడు.

ఆమె ప్రతిఘటించడంతో చాకుతో మెడపై రెండుచోట్ల కోశాడు. అయినా తిరగబడటంతో అతడు అక్కడున్న రాయిని తీసుకుని ఆమె ముఖంపై కొట్టాడు. తీవ్ర రక్తస్రావం అవుతుండగా ఆమె అరవడంతో అతడు బంగారు పుస్తెల తాడుతో బైక్‌పై పరారయ్యాడు. రక్తం కారుతుండగా రోధిస్తూ రోడ్డుపైకి రావడంతో పక్క చేలలోని రైతులు చూసి 108కు సమాచారం అందించారు. మానుకోటలోని ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతోంది. విషయం తెలుసుకున్న కురవి ఎస్సై నాగభూషణం ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు.

దుండగుడు అక్కడే వదిలేసిన కత్తిని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి వెళ్లి బాధితురాలితో మాట్లాడారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగభూషణం తెలిపారు. కాగా ఈ ఘటనపై తండావాసులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. పత్తి చేను వద్ద పనిచేస్తున్న బాధితురాలి వద్దకు వెళ్లి మంచినీళ్లు అడగడం, పత్తి చేను పక్కన రాళ్ల వద్ద ఈ ఘటన జరగడం అనుమానాలకు తావిస్తోంది. పోలీసుల విచారణలో విషయం వెలుగుచూసే అవకాశాలు ఉన్నాయి.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top