సీఈవో కాదు.. చైన్‌ స్నాచర్‌

Software Engineer Chain Snatching In Karnataka - Sakshi

ఐటీ కంపెనీ పెట్టి, అప్పులు తీర్చడానికి చోరీలు

25కుపైగా స్నాచింగ్‌లు

బెంగళూరులో వింత దొంగ

సాక్షి, బొమ్మనహళ్లి(కర్ణాటక) : ఉన్నత విద్యావంతుడు, జీవితంలో పైకెదగాలని ఐటీ కంపెనీ పెట్టాడు. సంస్థ ఏర్పాటు చేయడానికి చేసిన అప్పులను తీర్చడానికి ఎంచుకున్న దారి చైన్‌ స్నాచింగ్‌లు. వీలు దొరికినప్పుడల్లా చైన్‌స్నాచింగ్‌లు చేసి సుమారు రూ. 10 లక్షలకు పైన అప్పులూ తీర్చాడు. చివరికి ఖాకీలకు చిక్కాడు. ఘరానా సీఈవోని హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి విచారణ చేస్తున్నారు. పగలు సాప్ట్‌వేర్‌ కంపెనీని చూసుకుంటూ, సెలవురోజులు, రాత్రివేళల్లో స్నాచర్‌గా అవతారమెత్తేవాడు. ఇప్పటివరకు సుమారు 25 స్నాచింగ్‌లు చేసినట్లు తేలింది.

పగలు డ్యూటీ, తీరిక వేళల్లో చోరీలు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభాకర్‌ అలియాస్‌ భాస్కర్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ నగరంలోని హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌లో నివాసం ఉంటున్నాడు. ఇతను తానే సొంతంగా సాఫ్ట్‌వేర్‌ కంపెనీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకోసం అప్పులు కూడా చేశాడు. కంపెనీని సమర్థంగా నడిపించి అప్పులను తీర్చాల్సిన ప్రభాకర్‌ వినూత్నంగా చైన్‌స్నాచింగ్‌లను ఎంచుకున్నాడు. ఒంటరిగా నడిచి వెళ్తున్న మహిళల మెడల్లో ఉన్న బంగారు గొలుసులు చోరీ చేయసాగాడు. ఇప్పటివరకు హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్, కోరమంగళ, మడివాళ, జయనగర చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు 25కు పైగా చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు.

హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌లో సైతం తనను ఎవరూ గుర్తుపట్టకుండా హెల్మెట్‌ ధరించి గొలుసు చోరీలకు పాల్పడుతున్నాడు. ఇతను స్నాచింగ్‌కు పాల్పడిన దృశ్యాలు పలుచోట్ల సీసీ కెమెరాల్లో రికార్డు కావడం జరిగింది. రెండు రోజుల క్రితం తెల్లవారుజామున ఒక మహిళ మెడలో చైన్‌ లాక్కుని వెళ్తుండగా, బీట్‌ విధుల్లో ఉన్న హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌ పొలీసు స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ మాళప్ప చేజ్‌ చేశాడు. ఇద్దరూ బైక్‌లతో సందులు తిరుగుతూ దూసుకెళ్లినా చివరకు ఐటీ కంపెనీ సీఈవో దొరికిపోక తప్పలేదు. పోలీసులు ఇతన్ని తమదైన శైలిలో విచారించగా, భాస్కర్‌ అసలు సంగతిని బయటపెట్టాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top