తల్లిదండ్రుల చెంతకు...తప్పిపోయిన బాలిక

సీసీ పుటేజీల ఆధారంగా కేసు శోధన

విజయవాడలో బాలిక ఆచూకీ లభ్యం

విజయనగరం టౌన్‌: తల్లిదండ్రులకు దగ్గరగా ఉంటూ చదువుకోవాలన్నా ఆ చిన్నారిని, బంధువుల ఇంట్లో పెట్టి చదివించడం వల్ల తల్లిదండ్రుల ప్రేమ కరువైంది. విషయాన్ని ఆ చిన్నారి సూటిగా చెప్పినప్పటికీ పెడచెవిన పెట్టడంతో  చేసేది లేక, ఏం చేయాలో తెలియక రైలెక్కేసింది.  మూడురోజులైనా కుమార్తె కనబడకపోయే సరికి ఆ తల్లిదండ్రులు వన్‌టౌన్‌ పోలీసులను ఆశ్రయించారు. ఎస్పీ పాలరాజు ఆదేశాలతో రంగంలోకి దిగిన  వన్‌టౌన్‌ ప్రత్యేక బృందం ఒక్కరోజు వ్యవధిలోనే  ఆ చిన్నారిని కనుగొని, అందరి మన్ననలు అందుకున్నారు.  దీనికి సంబంధించి వన్‌టౌన్‌ సీఐ వి.చంద్రశేఖర్‌ అందించిన వివరాలిలా ఉన్నాయి. జామి మండలం టి.కొత్తూరు గ్రామానికి చెందిన జెట్టి కృష్ణారావు తన కుమార్తె రోషిణీ మహికి మంచి చదువును అందించాలనే సంకల్పంతో పట్టణంలోని ఎయిమ్‌ కాన్సెప్ట్‌ స్కూల్‌లో జాయిన్‌ చేసి, తన బంధువుల ఇంటివద్ద అమ్మాయిని ఉంచాడు. తన తల్లిదండ్రులకు దూరంగా ఉండటం తనకు ఇష్టం లేదని పదే పదే ఆ అమ్మాయి తెలిపేది. కానీ,  తల్లిదండ్రులు అందుకు అంగీకరించకపోవడంతో ఇటీవలి కాలంలో ఆమెకు చదువుపై ఆసక్తి తగ్గింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు ఎన్నోసార్లు చెప్పినప్పటికీ వారు తమ కుమార్తెను ఇష్టానికి వ్యతిరేకంగానే చదివించేందుకు ప్రయత్నించడంతో, విసుగు చెందిన ఆ చిన్నారి జనవరి 30న ఇల్లు విడిచి వెళ్లిపోయింది.  

కూలీలు కడుపున పెట్టి చూసుకున్నారు..
విజయనగరం రైల్వేస్టేషన్‌లో రైలెక్కిన రోషిణీకి గజపతినగరం మండలం మరుపల్లి గ్రామానికి శంబర పండగకు వచ్చి, పనుల కోసం వలస కూలీలుగా తిరిగి వెళ్తున్న బృందం కలిసింది.  వారితో మాట్లాడే క్రమంలో తనకెవ్వరూ లేరని తెలపడంతో వారు తమ వెంట రోషిణీని కంకిపాడు గ్రామానికి తీసుకువెళ్లిపోయారు.  రోషిణికి ఎటువంటి లోటు లేకుండా చూశారు. దర్యాప్తు ప్రారంభించిన వన్‌టౌన్‌ పోలీసులు సీసీ పుటేజీల ఆధారంగా రోషిణీ విజయవాడ వెళ్లిపోయినట్లుగా గుర్తించారు.  అక్కడకు ఒక ప్రత్యేక బృందాన్ని పంపించారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎంతో శ్రమించిన ఆ బృందం ఎట్టకేలకు రోషిణీని కనుగొని పట్టణానికి తీసుకువచ్చి వారి తల్లిదండ్రులకు  అప్పగించడంతో కథ సుఖాంతమైంది.  అమ్మాయిని వెదికి పట్టుకోవడంలో వన్‌టౌన్‌ కానిస్టేబుల్‌ రామకృష్ణ, శ్రీనివాసరావు, కాల్‌డేటా కానిస్టేబుల్‌ రవి ఎంతగానో కృషి చేయడంతో వారిని వన్‌టౌన్‌ సీఐ చంద్రశేఖర్‌ ప్రత్యేకంగా అభినందించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top