భార్య కోసం వచ్చి..బలైన భర్త

Man Killed In Jangoan - Sakshi

అల్లుడిని హత్య చేసిన మామ

ఆగ్రహించిన  అబ్బాయి తరఫు బంధువులు

అమ్మాయి ఇల్లు ధ్వంసం

పోలీసులకు లొంగిపోయిన మామ, అత్త

ఇద్దరు ఇష్టపడ్డారు.. ఒకరిని విడిచి..ఒకరు ఉండలేని బంధం... పెళ్లికి పెద్దలు అంగీకరించకున్నా.. ఏడడుగులు నడిచారు.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో వివాహం చేసుకుని కొద్ది రోజుల పాటు వేరు కాపురం పెట్టారు. కొడుకు బాధను చూసి తట్టుకోలేక తల్లిదండ్రులు అక్కున చేర్చుకున్నారు.  కొత్త కాపురం సాఫీగా సాగిపోతున్న తరుణంలో.. ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు వచ్చాయి.

దీంతో భార్య ఎనిమిది నెలల క్రితం పుట్టింటికి వెళ్లి పోయింది. భార్య కోసం తరుచూ అత్తింటికి వస్తున్న భర్త.. చివరకు మామ చేతిలో బలైన సంఘటన జనగామ మండలం చీటకోడూరు గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు, గ్రామస్తులు తెలిపిన  వివరాలు ఇలా ఉన్నాయి.   

జనగామ: యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన గంధమాల అయిలయ్య, అరుణల ఒక్కగానొక్క కుమారుడు ఉదయ్‌(25) జనగామ మండలం చీటకోడూరుకు చెందిన గంధమాల ఎల్లయ్య, హంసల కుమార్తె మౌనికను ప్రేమించాడు. ప్రేమ వివాహానికి ఇరు కుటుంబాలు అడ్డు చెప్పడంతో.. 2017లో ఓ పుణ్యక్షేత్రంలో ఇద్దరు వివాహం చేసుకున్నారు.

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తున్న ఉదయ్‌.. ఉన్నంతలో హాయిగా బతికారు. కొడుకు కష్టాన్ని చూసిన తల్లిదండ్రులు.. ఇంటికి ఆహ్వానించారు. రెండు, మూడు నెలల పాటు అన్యోన్యంగా ఉన్న దంపతుల మధ్య కలహాలు మొదలయ్యాయి. దీంతో మౌనిక భర్తను వదిలి తన పుట్టినిల్లైన చీటకోడురుకు వచ్చింది.  అప్పటి నుంచి భార్య కోసం ఉదయ్‌ తరుచూ అత్తింటికి వచ్చి వెళ్లి పోయేవాడు.

ఈ క్రమంలోనే అబ్బాయి, అమ్మాయి తరుపు కుటుంబాలు పెద్ద మనషుల సమక్షంలో పంచాయితీ పెట్టారు.  ఇరువురి వాదనలు విన్న పెద్ద మనుషులు.. అబ్బాయి తరుఫున అమ్మాయికి రూ.1.50 లక్షలు పరిహారం ఇచ్చి విడాకులు తీసుకోవాలని తీర్పు చెప్పారు. దీనికి మృతుడు ఉదయ్‌ తల్లిదండ్రులు అంగీకరించ లేదు. కోడలును తీసుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం.. ఎందుకు జరిమానా కట్టాలని ప్రశ్నిం చారు. దీంతో పంచాయితీ వాయిదాలు పడుతూ వస్తుంది. 

భార్య కోసం వచ్చి..

ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు రావడం, భార్య మౌనిక పుట్టింటికి వెళ్లి పోవడంతో ఒంటరి జీవితాన్ని గడుపుతూ కుమిలి పోయాడు ఉదయ్‌. భార్యను తీసుకు వెళ్లేందుకు అప్పుడప్పుడు చీటకోడూరుకు వచ్చి వెళ్లి పోయేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి తన బైక్‌పై చీటకోడూరుకు వచ్చాడు. ఆ రాత్రి భార్య, మామ, అత్త, కుటుంబ సభ్యులు... ఉదయ్‌(25) మధ్య ఏం జరిగిందో తెలియదు కాని.. తెల్లవారే సరికి దారుణ హత్యకు గురయ్యాడు.

మెడపై మూడు నుంచి నాలుగు గాట్లు కనిపించగా.. గొడ్డలితో నరికినట్లు బావిస్తున్నారు. అర్థరాత్రి 12.30 గంటలకు హత్య చేయగా.. తెల్లవారు జామున విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. 

మృతదేహం తరలింపుపై పెల్లుబికిన ఆగ్రహా వేశాలు

తన కుమారుడు హత్యకు గురయ్యాడని తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. బంధువులు పెద్ద సంఖ్యలో జనగామ జిల్లా ప్రధాన ఆస్పత్రికి చేరుకున్నారు. హత్యకు గురైన కన్న కొడుకును చూసి కుమిలి కుమిలి ఏడ్చారు. కుటుంబ సభ్యులు రాకుండా.. మృతదేహాన్ని ఆస్పత్రికి ఎలా తీసుకు వచ్చారని పోలీసులను నిలదీశారు.  హత్య చేసిన వారికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సిద్దిపేట హైవేపై రాస్తారోకోకు దిగారు.

నిందితులు ఎంతటి వారైనా వదిలి పెట్టే ప్రసక్తే లేదని పోలీసులు నచ్చ జెప్పే ప్రయత్నం చేశారు. ఉదయ్‌ను హత్య చేసిన ప్రాంతాన్ని చూపెట్టాలని పట్టుబట్టడంతో అందుకు పోలీసులు నిరాకరించారు.

చీటకోడూరులో ఉద్రిక్తత..

ఆస్పత్రి ఎదుట ఆందోళన చేస్తున్న క్రమంలో.. మృతుడు తల్లిదండ్రులు, బంధువులు చీటకోడూరుకు చేరుకున్నారు. అప్పటికే పట్టణ మొదటి ఎస్సై శ్రీనివాస్‌ బందోబస్తు చేపట్టారు. అయినప్పటికీ.. ఉదయ్‌ తరుపు బంధువులు, తల్లిదండ్రులు మౌనిక ఇంటిపై దాడికి దిగారు. ఇంటి తలుపులను బద్దలు కొట్టి.. ఇంట్లోని సామగ్రిని ధ్వంసం చేశారు. ఇంటికి నిప్పు పెట్టే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు.

చీటకోడూరు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఏసీపీ బాపురెడ్డి హుటాహుటిన సీఐ ముష్క శ్రీనివాస్‌తో కలిసి వెళ్లారు. జనగామ, నర్మెట, రఘునాథపల్లి, బచ్చన్నపేట, దేవరుప్పుల సీఐ, ఎస్సైలతో పాటు స్పెషల్‌ పోర్స్‌ను రప్పించారు. కోడలు ఇంటిని తగుల బెడతా.. లేకుంటే తనకు తానే కాల్చుకుంటానంటూ మృతుడి తల్లి అరుణ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

బైక్‌పైనే చంపేశారా..?

తన భార్య కోసం బైక్‌పై వచ్చిన ఉదయ్‌ ను ఎక్కడ చంపారనే దానిపై క్లారిటీ రావడం లేదు. బైక్‌ వస్తుండగానే.. మెడపై గొడ్డలి కాటు వేశారా.. లేదా గొడవపడి పారి పోతుండగా అడ్డగించి హత్య చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బైక్‌ డూం...ఫుట్‌ రెస్ట్, పెట్రోల్‌ ట్యాంక్‌ పై ఉన్న రక్తపు మరకలు అనేక అనుమానాలకు దారి తీస్తుంది.

ఉదయ్‌ చనిపోయిన తర్వాత..ఇంటి ముందు డ్రెయినేజీ పక్క న పడేశారు. కాని తల్లిదండ్రులు మాత్రం.. ఇం టికి పిలిపించి హత్య చేశారని ఆరోపిస్తున్నారు.అత్తింటి వారే హత్య చేశారు...తన కొడుకును అత్తింటి వారే చంపేశారని మృతుడు ఉదయ్‌ తల్లిదండ్రులు అయిలయ్య, అరుణ విలేకరులకు తెలిపారు. మామా, అత్త, భార్య, బావ మరుద్దలు, మేనమామలు కుట్ర పన్ని హత్య చేశారని ఆరోపించారు. ఎవరు హత్య చేశారనే దానిపై సమగ్ర విచారణ జరిపించి, తమకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నారు.

అదుపులోకి తీసుకున్నాం...

ఉదయ్‌ని హత్య చేసినట్లుగా బావిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ బాపురెడ్డి తెలిపారు. గంధమల్ల  ఎల్లయ్య, ఆయన భార్య హంస తమ కస్టడీలోనే ఉన్నారన్నారు. కుటుంబ సభ్యులతో పాటు మేన మామలపై మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరిని కూడా వదిలి పెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top