హైదరాబాద్‌లో కలకలం; ఐటీ ఉద్యోగుల గెంటివేత

Verizon Data Services booked for unleashing bouncers in Hyderabad - Sakshi

బౌన్సర్లతో భయపెట్టి సంతకాలు తీసుకున్నారు

పోలీసులను ఆశ్రయించిన వీడీఎస్‌ ఉద్యోగులు

సాక్షి, హైదరాబాద్‌: మాదాపూర్‌ ఐటీ కారిడార్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నిర్వాకం హైదరాబాద్‌లో కలకలం రేపింది. 200 మంది ఉద్యోగులను బలవంతంగా తొలగించడం ఆందోళన రేకెత్తించింది. తమను భయపెట్టి బలవంతంగా ఉద్యోగాలకు రాజీనామాలు చేయించిందంటూ వెరిజాన్‌ డాటా సర్వీసెస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌(వీడీఎస్‌) కంపెనీపై పలువురు ఉద్యోగులు ఈ నెల 4న పోలీసులను ఆశ్రయించారు.

బౌన్సర్లతో భయపెట్టి..
కంపెనీ యాజమాన్యం 2017 డిసెంబర్‌ 12, 13 తేదీల్లో మీటింగ్‌ రూమ్‌కు ఒక్కొక్కరిని పిలిపించి తాము ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నట్లు సంతకాలు చేయాలని ప్రింటెడ్‌ పేపర్లు తమ ముందు ఉంచిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఉద్యోగులు వాపోయారు. అప్పటికే ఆ గదిలో బౌన్సర్లతో హెచ్‌ఆర్‌ మేనేజర్‌ కూడా ఉన్నారని తెలిపారు. ఇందుకు కొంత సమయం కావాలని తాము అడగగా హెచ్‌ఆర్‌ మేనేజ్‌మెంట్‌ నిరాకరించిందని, రాజీనామా పత్రాలపై సంతకం పెట్టడం తప్ప మరో మార్గం లేదని తేల్చి చెబుతూ బౌన్సర్లకు సైగలు చేసిందని ఆరోపించారు. తమలో కొందరు సీట్లలోంచి లేచి బయటకు రాబోగా బౌన్సర్లు తమను కదలనీయకుండా అదిమిపెట్టారన్నారు. తమను మానసికంగా, భౌతికంగా హింసించి రాజీనామా పత్రాలపై సంతకాలు తీసుకున్నారని, తమంతగా తాము రాజీనామాలు చేయలేదని వివరించారు.

అనంతరం బౌన్సర్లు, సెక్యూరిటీ సిబ్బంది తమను కార్యాలయం నుంచి బయటకు గెంటేశారని, కనీసం తమ సొంత వస్తువులు తీసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బౌన్సర్ల, సెక్యూరిటీ సిబ్బంది దురుసు చర్యలు ఆ భవనంలోని, చుట్టుపక్కల భవనాల్లో సీసీ కెమెరాల్లో రికార్డు అయి ఉన్నాయన్నారు. కంపెనీ యాజమాన్యం వాటిని ధ్వంసం చేయకముందే స్వాధీనం చేసుకుని పరిశీలించాల్సిందిగా పోలీసులను బాధితులు కోరారు. తమ ఫిర్యాదును పరిశీలించి కంపెనీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కాగా, చెన్నై కార్యాలయంలోనూ పలువురు ఉద్యోగులను తొలగించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌, చెన్నైలో మొత్తం 1250 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్టు గత డిసెంబర్‌లోనే వార్తలు వచ్చాయి. దీనిపై వెరిజాన్‌ డాటా కంపెనీ స్పందించలేదు.

ఉద్వాసనలు- ఆందోళనలు
ఐటీ రంగంలో ఉద్యోగుల ఉద్వాసనలు పెరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఆటోమేషన్‌, అప్‌డేట్‌ కాకపోవడం వంటి కారణాలు చూపుతూ ఇటీవల కాలంలో చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. సీనియర్‌ ఉద్యోగులను తీసేసి వీరి స్థానంలో తక్కువ వేతనాలకు కొత్తగా సిబ్బందిని తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఐటీ ఉద్యోగులు కోరుతున్నారు. ఐటీ ఉద్యోగుల హక్కులు కాపాడేందుకు ఫోరమ్‌ ఫర్‌ ఐటీ ఎంప్లాయిస్‌(ఫైట్‌) కూడా పనిచేస్తోంది. గతేడాది కాగ్నిజెంట్‌లో ఉద్యోగులను తొలగించినప్పుడు ‘ఫైట్‌’ గట్టిగా పోరాడింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top