భార్యను హత్య చేసిన భర్త  

Husband Killed Wife In Warangal  - Sakshi

దుగ్గొండి మండలంలో ఘటనపరారీలో నిందితుడు

దుగ్గొండి(నర్సంపేట): మూడు ముళ్లు.. ఏడడుగులు వేసి పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లలకు తండ్రి అయ్యాడు. అంతలోనే భార్యపై అనుమానంతో గొంతు నులిమి హత్య చేశాడు. ఈ ఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా దుగ్గొండి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి  చెందిన కొండి రమేష్‌కు ఇదే మండలం రేబల్లె గ్రామానికి చెందిన గోరంటాల విశ్వనాథం, సరోజన దంపతుల కూతురు కొండి రజిత(35)ను ఇచ్చి 19 ఏళ్ల క్రితం వివాహం చేశారు. భార్యభర్తలు ఇద్దరూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి (మహేశ్వరీ, భార్గవ్, కార్తీక్‌) ముగ్గురు పిల్లలు జన్మించారు.

అయితే గత కొంతకాలంగా రజిత అనారోగ్యంతో బాధపడుతుంది.  రెండు నెలల క్రితం గర్భసంచికి పుండు రావడంతో ఆపరేషన్‌ చేయించుకుని పుట్టింటిలోనే ఉంటుంది. నాలుగు రోజుల క్రితం రజిత అత్తారింటికి వచ్చింది. తాగుడుకు బానిసగా మారిన భర్త రమేష్‌ అత్తారింటికి వచ్చిన భార్య రజితను అనుమానిస్తూ గొడవకు దిగేవాడని స్థానికులు చెప్పారు. ఆదివారం రాత్రి నిద్రపోతున్న రజితను విచక్షణరహితంగా గొంతు నులిమి చంపి పారిపోయాడన్నారు. సోమవారం తెల్లవారినా.. తల్లి నిద్రలోంచి లేవక పోవడంతో పిల్లలు ఇరుగు పొరుగు వారికి చెప్పారు. స్థానికులు వెళ్లి చూడగా రజిత అప్పటికే మృతి చెంది ఉంది.

తల్లి అరుపులు విని నిద్రలేచిన పిల్లలు..

రజితను ఆమె భర్త రమేష్‌ గొంతు నులుముతుండగా రజిత ఏడుస్తుంటే పిల్లలు నిద్రలేచారన్నారు. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావని పిల్లలు ప్రశ్నించగా తలనొప్పిగా ఉండటంతో జండుబామ్‌ రాసుకుంటున్నానని పిల్లలకు చెప్పి నిద్రపుచ్చారని స్థానికులు తెలి పారు. పిల్లలు పడుకు న్న అనంతరం గొంతు నులిమి హత్య చేశాడని పలువులు చర్చించుకుంటున్నారు. కాగా అమ్మా..లే అమ్మా.. అంటూ తల్లి మృతదేహంపై పిల్లలు పడి రోదిస్తున్న తీరు పలువురిని కంటతడిపెట్టించింది. అందరితో కలివిడిగా ఉండే రజిత మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ..

సంఘటన స్థలాన్ని దుగ్గొండి సర్కిల్‌ సీఐ బోనాల కిషన్, ఎస్సై ఊరడి భాస్కర్‌రెడ్డిలు పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. మృతురాలి సోదరుడు గొరంటాల రంగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top