
రెండు రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా వరుడు అదృశ్యమయ్యాడు.
తిరువొత్తియూరు: రెండు రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా వరుడు అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన కడలూరు జిల్లాలో సంచలనం కలిగించింది. కడలూరు జిల్లా వేంబూర్ సిరుకారంబులూరు గ్రామానికి చెందిన కలియన్ కుమారుడు వీరమణి (26)కి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. ఏప్రిల్ 10వ తేది బుధవారం వివాహం జరగాల్సి ఉంది. ఇరు కుటుంబాలు బంధువులకు ఆహ్వాన పత్రికలు పంచిపెట్టారు. ఈ క్రమంలో సోమవారం చెన్నైలో ఉన్న స్నేహితులకు పెండ్లి పత్రికలు ఇచ్చి వస్తానని వెళ్లిన వీరమణి తిరిగి రాలేదు. మంగళవారం వరుడు కల్యాణ మండపానికి రాకపోవడంతో వధువు బంధువులు వీరమణి కుటుంబీకులను ప్రశ్నించారు. అదృశ్యమైనట్లు తెలియడంతో ఆందోళనకు గురయ్యారు. వరుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.