టీఆర్‌ఎస్‌ నేత హత్య: ఆ తర్వాతే అంత్యక్రియలు

Family Members Protest Rally Over TRS Leader Murder In Nizamabad - Sakshi

సాక్షి, భీమ్‌గల్‌(నిజామాబాద్‌): భీమ్‌గల్‌ మండల కేంద్రంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భూ తగాదాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ నేత, మాజీ వార్డు సభ్యుడు కలీం హత్యకు నిరసనగా బంద్‌కు పిలుపునివ్వడం, మృతదేహంతో ఆందోళన చేపట్టడంతో రోజంతా తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. అయితే, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, పరిస్థితి అదుపు తప్పకుండా చూశారు. భూ తగాదాలతో హత్యకు గురైన భీమ్‌గల్‌కు చెందిన కలీం సోమవారం మండలంలోని బాబాపూర్‌లో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యకు నిరసనగా మంగళవారం రోజంతా భీమ్‌గల్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కలీం మృతదేహానికి సోమవారం రాత్రి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఇంటికి తరలించారు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, అతని వర్గం వారు హంతకులను కఠినంగా శిక్షించే వరకు అంత్యక్రియలు నిర్వహించొద్దని నిర్ణయించారు. మంగళవారం భీమ్‌గల్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. ఉదయం నుంచి పట్టణంలో యువకులు పెద్ద సంఖ్యలో బైకులపై ర్యాలీ చేపట్టారు.  

మృతదేహంతో ఆందోళన.. 
ఉదయం 10 గంటల సమయంలో కలీం మృతదేహాన్ని తహసీల్దార్‌ కార్యాలయం వద్దకు తీసుకొచ్చారు. అప్పటికే వందలాది మంది అక్కడకు తరలివచ్చారు. మృతదేహాన్ని కార్యాలయంలోకి తీసుకెళ్లేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. కొందరు యువకులు గేట్లు తోసుకుని లోపలికి వెళ్లగా, పోలీసులు అతి కష్టం మీద వారిని బయటకు పంపించారు. హంతకులను శిక్షించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు. కలెక్టర్, మంత్రి రావాలని, అప్పటిదాకా అంత్యక్రియలు నిర్వహించేది లేదని స్పష్టం చేశారు. ఆందోళనకారులను అదుపు చేయడానికి పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ తీవ్ర ఉద్రిక్తత కొనసాగింది. చివరకు మైనారిటీ నాయకులతో అధికారులతో చర్చలు జరిపి ఆందోళనను విరమింపజేశారు. మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారంతో పాటు ఐదెకరాల భూమి ఇప్పించాలని కోరగా, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అధికారులు హామీ ఇచ్చారు. దీంతో సాయంత్రం 4 గంటలకు ఆందోళన విరమించి అంతిమ యాత్ర నిర్వహించారు.
 
            తహసీల్‌ కార్యాలయం ఎదుట బైఠాయించిన ముస్లిం మహిళలు
ప్రశాంతంగా బంద్‌ 
కలీం హత్యకు నిరసనగా చేపట్టిన భీమ్‌గల్‌ బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచి దుకాణాలు, వ్యాపార సముదాయాలు మూసి ఉంచారు. బస్సులు, ఆటోలు నడువలేదు.  

భారీ బందోబస్తు.. 
సోమవారం నాటి ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. అడిషనల్‌ ఎస్పీ భాస్కర్, ఆర్మూర్, నిజామాబాద్‌ ఏసీపీలు రఘు, శ్రీనివాస్‌కుమార్, ఎస్‌బీ ఏసీపీ శ్రీనివాస్‌రావ్, స్థానిక సీఐ సైదయ్య, ఎస్సై శ్రీధర్‌రెడ్డిలతో పాటు జిల్లాలోని పలువురు సీఐలు, ఎస్సైలు బందోబస్తుకు తరలి వచ్చారు. ప్రత్యేక బలగాలను దింపి పరిస్థితి అదుపు తప్పకుండా పర్యవేక్షించారు.   

పరామర్శించిన మాజీ మంత్రి
కలీం హత్య వార్త తెలిసి మాజీ మంత్రి శనిగరం సంతోష్‌రెడ్డి భీమ్‌గల్‌కు వచ్చారు. కలీం మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. అతనితో తనకున్న అనుబందాన్ని గుర్తు చేసుకున్నారు. మాజీ మంత్రితో పాటు డీసీసీ మాజీ అధ్యక్షుడు తాహెర్, మాజీ జెడ్పీటీసీ ప్రకాష్‌గౌడ్‌ తదితరులు కలీం కుటుంబ సభ్యులను ఓదార్చారు.

                        ​​​​​​​పరామర్శకు వచ్చిన మాజీ మంత్రి సంతోష్‌రెడ్డి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top