మత్తెక్కించే అవినీతి

Excise Constable Arrest In Illegal Assets Chittoor - Sakshi

ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్‌ ఎస్‌ఐ విజయకుమార్‌

కల్తీ మద్యంపై గతంలో సీఐడీ కేసు, అరెస్టు

బయటపడేసిన టీడీపీ నేతలు, ఆపై పదోన్నతి

చిత్తూరు, కర్నూలు,తమిళనాడులో భారీ ఆస్తులు

చిత్తూరు అర్బన్‌: ప్రభుత్వ ఉద్యోగంలో ఓ సాధారణ కానిస్టేబుల్‌గా చేరిన వ్యక్తి 26 ఏళ్ల సర్వీసులో ఏం సాధించావని ఎవరైనా అడిగితే మంచి పేరు అనో, నిజాయితీ ఉన్న వ్యక్తనో, ఎవ్వరికీ తలవంచడనో సమాధానాలు రావాలి. కానీ చిత్తూరుకు చెందిన విజయ్‌కుమార్‌ మాత్రం ఈ 26 ఏళ్ల సర్వీసులో దాదాపు రూ.35 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టాడు. కల్తీ మద్యం తయారు చేసిన కేసులో ఉద్యోగం పోగొట్టుకున్నాడు. సీఐడీ పోలీసుల చేత అరెస్టయి జైల్లో ఉన్నాడు. అయినా మార్పు రాలేదు. ఈసారి ఏకంగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడి జైలుకు వెళ్లాడు.

ఇప్పటికీ ట్రాక్టర్‌ నడుపుతూ..
చిత్తూరు నగరంలోని కాజూరుకు చెందిన విజయ్‌ కుమార్‌ను చూస్తే ఎవరైనా ఇన్ని రూ.కోట్ల విలు వైన ఆస్తులున్నాయంటే నమ్మరు. ఎందుకంటే ఆబ్కారీ శాఖలో ఎస్‌ఐగా ఉద్యోగం చేస్తున్నాఓ సాధారణ వ్యక్తిలానే ఇతని దినచర్య ఉంటుంది. కర్నూలు నుంచి చిత్తూరులోని తన ఇంటికి వచ్చినప్పుడు ఉదయాన్నే నీటి ట్యాంకరున్న ట్రాక్టర్‌ నడుపుతూ వీధుల్లో తాగునీరుఅమ్ముతుంటాడు. ఇక్కడున్న పెట్రోలు బంకు వద్ద తనకు చెందిన శుద్ధినీటి ప్లాంటులో కూర్చుని నీళ్ల క్యాన్లు విక్రయిస్తుంటాడు. ఇలాంటి వ్యక్తి ఇన్ని రూ.కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నాడంటే స్థానికులు ఆశ్యర్యంగా చూస్తున్నారు.

పాఠం నేర్పని గతం..
జిల్లాలోని తిరుపతిలో ప్రభుత్వ మద్యం బాటిళ్ల సరఫరా డిపోలో పనిచేస్తున్నప్పుడే విజయ్‌కుమార్‌పై పలు ఆరోపణలు వచ్చాయి. అప్పటి ఎన్నికల్లో కల్తీ మద్యం జిల్లాలోకి తీసుకొచ్చారనే ఆరోపణలతో సీఐడీ పోలీసులు 2014లో విజయ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. బెయిల్‌ రాకపోవడంతో ఆరు నెలల వరకు జైల్లో ఉన్నాడు. అప్పటికీ ఆయనలో మార్పు రాలేదు. జిల్లా నుంచి కర్నూలుకు బదిలీ అయినప్పటికీ అవినీతి, అక్రమాలకు పాల్పడ్డట్లు ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. దీంతో అన్ని ఆధారాలతో అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.

వామ్మో ఇన్ని ఆస్తులా..
విజయ్‌కుమార్‌ అక్రమ సంపాదన, ఆస్తుల గురించి సొంత శాఖలోని ఓ వ్యక్తి నుంచి ఆధారాలతో కూడిన పక్కా సమాచారం ఏసీబీకి వెళ్లినట్లు తెలుస్తోంది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి పొద్దుపోయే వరకు తిరుపతి ఏసీబీ అదనపు ఎస్పీ తిరుమలేష్, సీఐలు చంద్రశేఖర్, విష్ణువర్దన్, ప్రసాద్‌రెడ్డి, గిరిధర్, విజయశేఖర్, రమేష్, శివకుమార్, ఎస్‌ఐ విష్ణువర్దన్, కడప, కర్నూలుకు చెందిన ఏసీబీ అధికారులు చిత్తూరు, యాదమరి, తమిళనాడులోని కాట్పాడి, తిరుపతి ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఇందులో విజయ్‌కుమార్‌ భార్య మీన పేరిట మూడంతస్తుల భవనం, రెండంతస్తుల భవనం, మరో రెండు భవనాలకు సంబంధించి పత్రాలు దొరికాయి. ఇరువారం, కాజూరు ప్రాంతాల్లో ఎనిమిది ప్లాట్లు, కాజూరులో ఓ ఇల్లు, తమిళనాడులోని కాట్పాడిలో ఓ ఇల్లుకు సంబంధించిన పత్రాలు, విజయ్‌కుమార్‌ పేరిట కాజూరులో ఓ శుద్ధినీటి ప్లాంటుకు చెందిన ఖాళీ స్థలం, ఇరువారం వద్ద ఓ స్థలాన్ని, ఇతని కొడుకు పేరిట ఉన్న ఆస్తుల పత్రాలను అధికారులు సీజ్‌ చేశారు. ఇక బంగారు ఆభరణాల్లో ఆడవాళ్లు పెట్టుకునే చెవి కమ్మల్లో 10 రకాలు, చేతి కడియాలు, ఐదు రకాల గొలుసులు, పదికి పైగా ఉంగరాలు, రాళ్ల హారాలు, వెండి ఆభరణాలు చూసిన అధికారులే ఆశ్చర్యానికి గురయ్యారు.

టీడీపీ నేతల భరోసా...
విజయ్‌కుమార్‌ను సీఐడీ అధికారులు అరెస్టు చేసినప్పుడు చిత్తూరు నగరానికి చెందిన ఓ టీడీపీ నేత అండగా నిలిచినట్లు బహిరంగంగా చెబుతున్నారు. జైల్లో ఉన్న విజయ్‌కుమార్‌ను బయటకు తీసుకురావడంతో పాటు మళ్లీ పోస్టింగ్‌ ఇప్పించడం, పదోన్నతి కల్పించడంలో టీడీపీ నేత చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. ఇందుకు ఎక్సైజ్‌ స్థాయిలో పనిచేసిన ఓ మంత్రి అండదండలు కూడా ఉన్నట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు. మరోవైపు విజయ్‌కుమార్‌ ఆస్తులపై జరిగిన ఏసీబీ దాడులు జిల్లాలోని ఎక్సైజ్‌ అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది.

తిరుపతిలోనూ తనిఖీలు
తిరుపతి క్రైం: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని చిత్తూరు ఎక్సైజ్‌ శాఖ ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ ఇంటిపై ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు చేసిన విషయం తెలిసిందే. తిరుపతి వివేకానందనగర్‌లో ఎస్‌ఐ చెల్లెలు విశాలాక్షి ఇంట్లో కూడా అధికారులు తనిఖీ చేశారు. ఏసీబీ డీఎస్పీ మల్లేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీ చేయగా ఎలాంటి ఆస్తులూ పట్టుబడలేదు. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఆయనకు సంబంధించిన ఆస్తుల కోసం ఆరా తీస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top