నాగార్జున యాడ్‌ను తొలగించేశారు

Kalyan Jewellers Removes The Nagarjuna New Ad - Sakshi

న్యూఢిల్లీ : తాజాగా కల్యాణ్‌ జువెలర్స్‌ రూపొందించిన యాడ్‌ అందరికీ తెలిసే ఉంటుంది. ‘నిజాయితీ ఎక్కడో నమ్మకమూ అక్కడే’ అనే కాన్సెప్ట్‌తో.. ప్రతి రోజూ బుల్లితెరపై ఇది మారుమోగిపోయింది. ఇంత హల్‌చల్‌ చేసిన ఈ యాడ్‌ ఇక నుంచి టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో కనిపించదట. ఈ యాడ్‌ను అన్ని ప్రసార మాధ్యమాల నుంచి తొలగిస్తున్నట్టు కల్యాణ్‌ జువెలర్స్‌ నిర్వాహకులు ప్రకటించారు.  తెలుగులో నాగార్జున, హిందీలో అమితాబ్ బచ్చన్, ఆయన కుమార్తె శ్వేతా బచ్చన్ లతో రూపొందించిన ఈ వ్యాపార ప్రకటన బ్యాంకులపై నమ్మకం కోల్పోయేలా ఉందంటూ ఏఐబీవోసీ అసంతృప్తిని వ్యక్తం చేయడంతో, ఆ యాడ్ ను తీసేస్తున్నట్టు కల్యాణ్ జువెలర్స్ తెలిపింది. 

ఈ యాడ్‌ను తాము కేవలం ప్రచారం కోసమే రూపొందించామని, కానీ ఈ యాడ్‌ వల్ల కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయని కల్యాణ్‌ జువెలర్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కల్యాణ్‌ రామన్‌ అన్నారు. తమ సంస్థ వ్యాపారంలో బ్యాంకింగ్ వ్యవస్థది కీలక పాత్రని, దేశంలోని బ్యాంకులకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఎదురైనందుకు చింతిస్తూ, ఈ యాడ్ ను తొలగిస్తున్నామని ఆయన తెలిపారు. ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి బ్యాంకులకు నష్టం కలిగించే చర్యలను తామెన్నడూ ప్రోత్సహించబోమని చెప్పారు. అమితాబ్‌తో రూపొందిన హిందీ యాడ్‌ను కూడా సోమవారమే తొలగించిన సంగతి తెలిసిందే. ప్రభూతో రూపొందిన తమిళ యాడ్‌, మంజు వారియర్‌తో షూట్‌ చేసిన మలయాళ యాడ్‌ను కూడా కల్యాణ్‌ జువెలర్స్‌ తొలగించినట్టు తెలిసింది.  కాగ, కల్యాణ్‌ జువెలర్స్‌ రూపొందించిన ఈ యాడ్‌, బ్యాంకింగ్‌ వ్యవస్థపై అపనమ్మకం కలిగించేలా ఉందంటూ.. బ్యాంకింగ్‌ యూనియన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ యాడ్‌ను తొలగించాలని డిమాండ్‌ చేసింది. ఈ యాడ్‌ను తొలగించకపోతే, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.

కల్యాణ్‌ జువెలర్స్‌ యాడ్‌లో ఏముంది..  
అక్కినేని నాగార్జున ఓ రిటైర్డు ఉద్యోగి వేషంలో.. తన మనవరాలితో పాటు బ్యాంకుకు వస్తారు. నా పెన్షన్‌ అని ఓ బ్యాంక్‌ ఉద్యోగికి పాస్‌పుస్తకం చూపిస్తే, నాలుగు కౌంటర్‌ వద్దకు వెళ్లడంటూ ఆ బ్యాంక్‌ ఉద్యోగి విసుక్కోవడం, మరో కౌంటర్‌ వద్ద ఇది తలనొప్పి కేసు అంటూ మేనేజర్‌ వద్దకు వెళ్లమనడం బ్యాంక్‌ ఉద్యోగుల నిర్లక్ష్యాన్ని చూపించారు. బ్యాంక్‌ మేనేజర్‌ వద్ద తన ఖాతాలోకి రెండు సార్లు పెన్షన్‌ డబ్బు క్రెడిట్‌ అయిందని చెబితే, అదృష్టం అంటే ఇదే పండుగ చేసుకోండని సూచిస్తారు. తిరిగి ఇవ్వడానికి వచ్చానంటే, ఇది పెద్ద తతంగమండి, గమ్మున వదిలేయండి, ఎవరికి తెలుస్తుందని అని నిర్లక్ష్య పూర్వక సమాధానం చెబుతారు. నాకు తెలుసు, ఎవరికి తెలిసినా తెలియకపోయినా.. తప్పు తప్పే అని నాగార్జున అనడం.. నిజాయితీ ఎక్కడో నమ్మకమో అక్కడే.. అదే కల్యాణ్‌ జువెలర్స్‌ అనడంతో ఈ యాడ్‌ ముగుస్తుంది. ఈ యాడ్ లో బ్యాంకు అధికారులు కస్టమర్లను పట్టించుకునే విధానంతో పాటు.. అనుకోకుండా ఒకరి ఖాతాలోకి రెండు పర్యాయాలు వచ్చిన పెన్షన్ డబ్బును కట్ చేయడానికి చూసిన నిర్లక్ష్యం ధోరణి కనబడుతుంది. దీంతో కల్యాణ్ జువెల్లర్స్ యాడ్ పై బ్యాంకింగ్ అధికారులు కన్నెర చేశారు. అటు బ్యాంకు ఉద్యోగ కార్మిక సంఘాలు కూడా ఈ యాడ్ పై తీవ్రంగా ఫైర్ అవుతున్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top