బ్యాంకులకు ఆర్బీఐ ఊరట! | Big banks can breathe easy ahead of Q4 results | Sakshi
Sakshi News home page

బ్యాంకులకు ఆర్బీఐ ఊరట!

Apr 22 2016 12:20 AM | Updated on Sep 3 2017 10:26 PM

బ్యాంకులకు ఆర్బీఐ ఊరట!

బ్యాంకులకు ఆర్బీఐ ఊరట!

మొండిబకాయిల(ఎన్‌పీఏ) సమస్యతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న దేశీ బ్యాంకింగ్ రంగానికి రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కాస్త ఉపశమనం కలిగించింది.

మొండిబకాయిలపై ప్రొవిజనింగ్ నిబంధనలు సడలింపు
డిఫాల్ట్ రిస్కు కంపెనీల జాబితా కుదింపు...
తొలగించిన జాబితాలో జేపీ అసోసియేట్స్ సహా 24 సంస్థలు
ఈ చర్యలతో బ్యాంకు షేర్ల దూకుడు

 ముంబై: మొండిబకాయిల(ఎన్‌పీఏ) సమస్యతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న దేశీ బ్యాంకింగ్ రంగానికి రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కాస్త ఉపశమనం కలిగించింది. డిఫాల్ట్ రిస్కులున్న కంపెనీల రుణ బకాయిలకు కూడా కేటాయింపులు(ప్రొవిజనింగ్) జరపాల్సిందిగా గతంలో ఇచ్చిన ఆదేశాలకు కాస్త వెసులుబాటు ఇచ్చింది. డిసెంబర్‌లో పేర్కొన్న 150 ఇటువంటి కంపెనీల జాబితా నుంచి ఇప్పుడు సుమారు 24 కంపెనీలను తొలగిస్తున్నట్లు ఆర్‌బీఐ బ్యాంకులకు సమాచారం అందించింది. బుధవారం పొద్దుపోయాక ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

దీంతో జనవరి-మార్చి త్రైమాసికం(2015-16, క్యూ4)లో ఆయా కంపెనీలకు (జాబితా నుంచి తొలగించిన కంపెనీలు) చెందిన రుణ బకాయిలపై బ్యాంకులు ప్రొవిజనింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా బ్యాంకుల క్యూ4 ఫలితాల్లో లాభదాయకత పెరిగేందుకు అవకాశం ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్లకు అత్యధికంగా రుణాలిచ్చిన ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్‌బీ)ల క్యూ4 ఫలితాలు అంచనాలను మించవచ్చనేది వారి అభిప్రాయం. డిఫాల్ట్ రిస్కులున్న కంపెనీల జాబితా నుంచి ఆర్‌బీఐ తొలగించిన సంస్థల్లో జైప్రకాశ్ అసోసియేట్స్, కోస్టల్ ఎనర్జెన్ వంటివి ఉన్నాయి. జాబితాలోని కొన్ని కంపెనీలు తమ రుణ భారాన్ని తగ్గించుకోవడం కోసం చేపట్టిన కొన్ని చర్యల(ఆస్తుల విక్రయం ఇతరత్రా) కారణంగానే ఆర్‌బీఐ తాజా నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు.

కొన్ని కంపెనీలను జాబితా నుంచి తొలగించిన ఆర్‌బీఐ కొత్తగా ఏ కంపెనీని కూడా ఇందులో చేర్చలేదని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక బ్యాంకర్ వెల్లడించారు. ‘తాజా ఆదేశాల్లో కంపెనీలకు ఇచ్చిన రుణాలను ఆర్‌బీఐ రెండు విభాగాలుగా చేసిందని, ఒకటి స్టాండర్డ్ ఖాతాలుగా తిరిగి మార్చవలసిన కంపెనీలు.. మిగతావి మార్చి కార్టర్‌లోనూ కేటాయింపులు జరపాల్సినవి’ అని బ్యాంకర్ చెప్పారు.

 గతేడాది ఆదేశాలు ఇవి...
కార్పొరేట్ల మొండిబకాయిలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో ఎన్‌పీఏ రిస్కులు ఉన్న 150 కంపెనీల జాబితాను ఆర్‌బీఐ అసెట్ క్వాలిటీ రివ్యూ(ఏక్యూఆర్)లో ప్రకటించింది. వాటి రుణ బకాయిలకు కూడా ప్రొవిజనింగ్ చేయాలని బ్యాంకులను ఆదేశించింది. వాటిలో ఎస్సార్ గ్రూప్, భూషణ్ స్టీల్ తదితర సంస్థలు ఉన్నాయి. దీంతో డిసెంబర్ క్వార్టర్‌లో తప్పనిసరిగా వాటి లాభనష్టాల ఖాతాలో భారీ కేటాయింపులు చేయాల్సి రావడంతో పలు పీఎస్‌బీలు నష్టాలను ప్రకటించాల్సి వచ్చింది. ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.1,505 కోట్లు, ఐడీబీఐ బ్యాంక్ రూ.2,183 కోట్లు, ఐఓబీ రూ.1,425 కోట్ల చొప్పున నష్టాలను చవిచూశాయి.

బ్యాంక్ ఆఫ్ బరోడా పూర్తిగా డిసెంబర్ క్వార్టర్‌లోనే వీటికి కేటాయింపులు చేయడంతో రూ. 3,342 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. కొన్ని బ్యాంకులు మార్చి క్వార్టర్‌లోనూ  కేటాయింపులు చేయనున్నాయి. మొత్తం మీద రూ.70,000 కోట్లకు పైగానే ఈ ప్రొవిజనింగ్ ఉండొచ్చని అంచనా. అయితే, ఆర్‌బీఐ ఈ జాబితాను కాస్త తగ్గించడంతో బ్యాంకులపై కాస్త ఒత్తిడి తగ్గనుంది. జాబితా నుంచి తొలగిన జేపీ అసోసియేట్స్ ఇటీవలే మెజారిటీ సిమెంట్ వ్యాపారాన్ని అల్ట్రాటెక్‌కు రూ.15,900 కోట్లకు విక్రయించడం తెలిసిందే. ఈ కంపెనీ మొత్తం రుణ భారం రూ.75,000 కోట్లుగా అంచనా.

 11 బ్యాంకులకు నష్టాలు...
కాగా, పీఎస్‌బీల స్థూల ఎన్‌పీఏలు గతేడాది మార్చి నాటికి 5.43 శాతం(దాదాపు రూ.2,67,065 కోట్లు) నుంచి డిసెంబర్ నాటికి 7.3 శాతానికి(రూ.3,61,731 కోట్లు) ఎగబాకాయి. దీనికి ఆర్‌బీఐ కొత్త నిబంధనలు కూడా ఒక కారణమే. డిసెంబర్ క్వార్టర్‌లో మొత్తం 11 పీఎస్‌బీలు రూ.12,867 కోట్ల నష్టాలను ప్రకటించాయి. బ్యాంకింగ్ పరిశ్రమలో అత్యధిక త్రైమాసిక నష్టాన్ని ప్రకటించిన పీఎస్‌బీగా బీఓబీ నిలిచింది కూడా.

నేడు బీబీబీ సమావేశం ఎన్‌పీఏలు, మూలధన సమీకరణపై చర్చ
న్యూఢిల్లీ: కొత్తగా ఏర్పాటైన బ్యాంక్ బోర్డు బ్యూరో (బీబీబీ) శుక్రవారం రెండవసారి సమావేశం కానున్నది. ఇందులో మొండిబకాయిలు(ఎన్‌పీఏ), మూలధన సమీకరణ వంటి తదితర అంశాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశముంది. బడ్జెట్ ప్రొవిజన్ కాకుండా ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధన అవసరాలపై బ్యూరో ప్రధానంగా దృష్టి కేంద్రీకరించవచ్చని ఒక సీనియర్ అధికారి తెలిపారు. వివిధ బ్యాంకుల్లో బోర్డు స్థాయిలో ఖాళీగా ఉన్న పోస్టుల భ ర్తీ అంశంపై కూడా బీబీబీ ఒక నిర్ణయానికి రానున్నదని చెప్పారు. బీబీబీ తొలి సమావేశం ఏప్రిల్ 8న జరిగింది. దీనికి ఆర్‌బీఐ గవర్నర్ రాజన్, ఆర్థిక సహాయ మంత్రి జయంత్ సిన్హా సహా బ్యూరో సభ్యులు హాజరయ్యారు.

బ్యాంకు షేర్ల పరుగు...
ఆర్‌బీఐ తాజా ఊరట నిర్ణయంతో క్యూ4లో లాభదాయకత పెరుగుతుందన్న అంచనాల కారణంగా బ్యాంకింగ్ షేర్లు దూసుకెళ్లాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు 3-5 శాతం మేర ఎగబాకాయి. పీఎన్‌బీ 5 శాతం ర్యాలీ జరిపింది. ఎస్‌బీఐ, బీఓబీ 3.68 శాతం చొప్పున లాభపడ్డాయి. ఇక ప్రైవేటు రంగంలోని ఐసీఐసీఐ బ్యాంక్ సెన్సెక్స్‌లో అత్యధికంగా 6.26 శాతం ఎగసింది. యాక్సిస్ కూడా 2 శాతం లాభపడింది. ముఖ్యంగా కార్పొరేట్లకు ఈ రెండు ప్రైవేటు బ్యాంకులూ అత్యధికంగా రుణాలివ్వడమేకాకుండా, ఆర్‌బీఐ 150 కంపెనీల జాబితా ప్రకారం గత క్వార్టర్‌లో భారీగా కేటాయింపులు చేశాయి. జేపీ అసోసియేట్స్‌కు ఐసీఐసీఐ బ్యాంక్ రుణాలు భారీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ కంపెనీ ఆర్‌బీఐ జాబితా నుంచి తొలగడంతో ఐసీఐసీఐ బ్యాంక్ షేరు రివ్వుమంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement