ఏఐ సాయంతో ముందే గుండె జబ్బుల గుర్తింపు!

Apollo Hospitals in pact with Microsoft - Sakshi

చేతులు కలిపిన మైక్రోసాఫ్ట్, అపోలో హాస్పిటల్స్‌  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: గుండె సంబంధిత వ్యాధుల (సీవీడీ) రాకను ముందుగానే గుర్తించేందుకు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఆధారిత ప్లాట్‌ఫామ్‌ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్, అపోలో హాస్పిటల్స్‌ చేతులు కలిపాయి. ఈ భాగస్వామ్యం కింద... కార్డియో వాస్క్యులర్‌ డిసీజ్‌ (సీవీడీ) రిస్క్‌ స్కోర్‌ ఏపీఐను విడుదల చేశాయి.

దేశవ్యాప్తంగా అపోలో హాస్పిటల్స్‌ నెట్‌వర్క్‌ పరిధిలోని వైద్యులు ఈ సీవీడీ ఏపీఐను ఉపయోగించడం ద్వారా హృదయ సంబంధిత వ్యాధుల రిస్క్‌ను ముందుగానే గుర్తించి నివారణకు చర్యలు తీసుకుంటారని ఈ రెండు సంస్థలూ ఒక ప్రకటనలో తెలియజేశాయి.భారత్‌కు వెలుపల ఇతర జనాభా విషయంలో ఈ ఏపీఐ పనితీరును తెలుసుకునేందుకు మైక్రోసాఫ్ట్, అపోలో హాస్పిటల్స్‌ అంతర్జాతీయ భాగస్వాములతోనూ కలసి పనిచేస్తాయి.

ప్రపంచవ్యాప్తంగా పలు సీవీడీ నమూనాలు అందుబాటులో ఉన్నాయని, కానీ ఇవి ప్రత్యేకంగా బారతీయుల అవసరాల కోసం ఉద్దేశించినవి కావని ఆ ప్రకటనలో పేర్కొన్నాయి. మైక్రోసాఫ్ట్‌ అజూర్‌ ప్లాట్‌ఫామ్‌పై ఏర్పాటైన ఈ ఏపీఐ భారత జనాభా సీవీడీ రిస్క్‌ను మరింత కచ్చితంగా గుర్తించగలదని స్పష్టం చేశాయి. దేశంలో ప్రతి ఎనిమిది మందిలో ఒకరు అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నట్టు జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వేలో వెల్లడైంది. అధిక రక్తపోటు గుండె సమస్యలకూ కారణమవుతుందని తెలిసిందే.  

జీవన అలవాట్ల ఆధారంగా రిస్క్‌
3హెల్త్‌ చెకప్‌లు, హృదయ సంబంధిత సమస్యల బారిన పడిన రోగుల నుంచి సేకరించిన సమాచారానికి ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ను జోడించి ఈ ఏపీఐను అభివృద్ధి చేశారు. గుండె సమస్యలకు దారితీసే జీవన విధాన ఆధారిత ఆహార అలవాట్లు, పొగతాగడం, శారీరక శ్రమ, మానసిక పరమైన ఒత్తిడి, ఆందోళన తదితర అంశాల ఆధారంగా రిస్క్‌ స్కోరును అధికం, మధ్యస్తం, కనిష్టం అంటూ మూడు రకాలుగా వర్గీకరిస్తారు.

ఈ రిస్క్‌ స్కోర్‌ ఆధారంగా పేషెంట్లకు జీవన సంబంధిత మార్పులను వైద్యులు సూచిస్తారు. ఏఐ, మెషిన్‌ లెర్నింగ్, తమ వైద్యుల అంతర్జాతీయ అనుభవం గుండె వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని అపోలో హాస్పిటల్స్‌ జాయింట్‌ ఎండీ సంగీతా రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top