సిటీ గ్యాసు బిడ్లలో అదానీ ముందంజ

Adani goes for 52 cities, GAIL Gas eyes 30 - Sakshi

52 పట్టణాల్లో బిడ్లు దాఖలు చేసిన సంస్థ

30 పట్టణాల పట్ల గెయిల్‌ ఆసక్తి

న్యూఢిల్లీ: పట్టణాల్లో సహజవాయువు పంపిణీ ప్రాజెక్టులకు సంబంధించిన బిడ్లలో అదానీ గ్రూపు ముందంజలో నిలిచింది. 52 పట్టణాల్లో ఈ సంస్థ బిడ్లు వేసి టాప్‌ బిడ్డర్‌గా నిలిచింది. ప్రభుత్వరంగ గెయిల్‌ 30 పట్టణాల పట్ల ఆసక్తి చూపిస్తూ బిడ్లు వేసింది. ఇక, రిలయన్స్‌–బీపీ మాత్రం చివరి నిమిషంలో తప్పుకోవడం గమనార్హం. అదానీ గ్యాస్‌ లిమిటెడ్‌ 32 పట్టణాల్లో సొంతగాను, 20 పట్టణాల్లో ఐవోసీతో కలసి బిడ్లు వేసింది. దేశ వ్యాప్తంగా 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో ఉన్న 174 జిల్లాల్లోని పట్టణాలు, సమీప ప్రాంతాల్లో... పైపుల ద్వారా వంట గ్యాస్‌ సరఫరాకు సంబంధించి 86 పర్మిట్లకు తొమ్మిదో విడతలో భాగంగా ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించింది.

ఇంద్రప్రస్థ గ్యాస్‌ లిమిటెడ్‌ ఢిల్లీలో ఇప్పటికే సీఎన్‌జీ సరఫరా చేస్తుండగా, మరో 13 పట్టణాల్లో అనుమతులకు బిడ్లు దాఖలు చేసింది. ఎస్సెల్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ ఏడు బిడ్లు దాఖలు చేసింది. గెయిల్, మహానగర్‌ గ్యాస్, గుజరాత్‌ స్టేట్‌ ప్రెటోలియం కార్ప్‌ (జీఎస్‌పీసీ) కూడా ఇందులో పాల్గొన్నాయి. అయితే, ఆర్‌ఐఎల్, బ్రిటన్‌కు చెందిన బీపీ 50: 50 జాయింట్‌ వెంచర్‌ ‘ఇండియా గ్యాస్‌ సొల్యూషన్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌’ మాత్రం బిడ్లు దాఖలు చేయలేదని విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి. ఈ తొమ్మిదో విడతకు ముందు ఎనిమిది దశల్లో కేంద్రం మొత్తం 91 భౌగోళిక ప్రాంతాలను కవర్‌ చేసే విధంగా లైసెన్స్‌లను జారీ చేసింది.

ఇంద్రప్రస్థ గ్యాస్, గెయిల్‌ గ్యాస్‌ లిమిటెడ్‌ వంటివి వీటిని దక్కించుకున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన మేఘ ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ రెండు ప్రాంతాల్లో లైసెన్సులు దక్కించుకుని దాదాపుగా సరఫరాకు సిద్ధమయింది. మొత్తంగా ప్రస్తుతానికి 24 కోట్ల జనాభా నివసిస్తున్న ప్రాంతాలు ఈ సేవల పరిధిలోకి వచ్చాయి. ప్రాథమిక ఇంధన విభాగంలో సహజవాయువు వాటా ప్రస్తుతం 6 శాతంగా ఉంటే, దాన్ని 15 శాతానికి పెంచాలన్నది కేంద్రం లక్ష్యం. అలాగే, 2020 నాటికి కోటి ఇళ్లకు పైపుల ద్వారా వంట గ్యాస్‌ అందించాలన్నది మోదీ సర్కారు సంకల్పం.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top