విద్యుత్‌ కొనుగోళ్లలో అంతులేని అవినీతి

YS Jagan Mohan Reddy Comments On Chandrababu Govt for corruption in electricity purchases - Sakshi

కేంద్రం నిర్దేశించిన పరిమాణం కంటే అధికంగా సంప్రదాయేతర విద్యుత్‌ను ఎందుకు కొన్నారు చంద్రబాబూ? 

అసెంబ్లీలో నిలదీసిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

టెక్నాలజీ పెరిగే కొద్దీ ధరలు తగ్గుతాయనేది జగమెరిగిన సత్యం

ఈ విషయం తెలిసీ 25 ఏళ్ల పాటు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడంలో ఆంతర్యం ఏమిటి?

మిగులు విద్యుత్‌ ఉందని అధికార గణాంకాలు చెబుతుంటే మళ్లీ అధిక ధరలకు ఎందుకు కొనాల్సి వచ్చింది? 

ఆ మూడు సంస్థలతోనే 63 శాతం సంప్రదాయేతర ఇంధన కొనుగోలు వెనక మతలబు ఏమిటి?

అనవసర కొనుగోళ్ల వల్ల ఏటా రూ. 2,766 కోట్ల అదనపు భారం పడుతోంది.. 

25 ఏళ్ల పాటు నచ్చిన సంస్థలకు నిధులను దోచిపెడతారా? 

రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించేవారు ఇలా చేస్తారా? 

డిస్కంలుగానీ,రాష్ట్రం గానీ, ప్రజలుగానీ ఈ విపరీతమైన భారాన్ని భరించే స్థితిలో ఉన్నాయా?

సాక్షి, అమరావతి: విద్యుత్‌ కొనుగోలు  ఒప్పందాల్లో అంతులేని అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు. చౌక ధరకు థర్మల్‌ విద్యుత్‌ అందుబాటులో ఉన్నప్పటికీ, అధిక ధరతో సంప్రదాయేతర విద్యుత్‌ కొనుగోలు చేయడం వెనుక అసలు రహస్యం దోపీడీనేనని ఎండగట్టారు. కేంద్రం నిర్దేశించిన పరిమాణాన్ని మించి సంప్రదాయేతర విద్యుత్‌ను అధిక ధరలకు ఎందుకు కొనుగోలు చేశారని మాజీ సీఎం చంద్రబాబును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిలదీశారు. ‘టెక్నాలజీ పెరిగే కొద్దీ విద్యుత్‌ ధరలు తగ్గుతాయనేది జగమెరిగిన సత్యం.. అదే విషయాన్ని మీరు కూడా (చంద్రబాబు) చెప్పారు.. మరి 15 ఏళ్లు సీఎంగా పనిచేసిన, 40 ఏళ్ల ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకునే ఈ పెద్ద మనిషి ఆ మేరకు స్పృహ కూడా లేకుండా 25 ఏళ్ల కోసం పీపీఏలు ఎందుకు చేశార’ని మండిపడ్డారు. మిగులు విద్యుత్‌ ఉన్నప్పటికీ నచ్చిన కంపెనీలకు దోచిపెట్టేందుకు అన్ని రాష్ట్రాలకంటే అత్యధిక రేట్లకు విద్యుత్‌ కొనుగోలు చేసి డిస్కంలను అప్పుల ఊబిలోకి నెట్టేశారని దుయ్యబట్టారు.

ఇలా అధిక ధరకు విద్యుత్‌ కొనుగోలు చేయడం వల్ల ఏటా రూ. 2,766 కోట్ల నష్టం వాటిల్లిందని గణాంకాలు, ఆధారాలతో వివరించారు. శుక్రవారం శాసనసభలో ఇంధన శాఖ పద్దులపై చర్చ సందర్భంగా గత ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వంలో విద్యుత్‌ ఒప్పందాల ముసుగులో జరిగిన దోపీడీని సీఎం తూర్పారబట్టారు. అప్పటి సర్కారు పెద్దలకు కావాల్సిన కేవలం ఆ మూడే మూడు సంస్థలతోనే 63 శాతం ఒప్పందాలు చేసుకున్నారని, వాటికే అత్యధిక చెల్లింపులు జరిగాయని ఎత్తిచూపారు. అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని మరింత రుణ ఊబిలోకి నెడితే ఇక రాష్ట్రం ముందుకెళ్లేదెలా? అని సీఎం జగ న్‌ నిలదీశారు. ‘విద్యుత్‌ రంగం బాగుపడాలంటే పారిశ్రామిక వినియోగం పెరగాలి.. ఇలా జరిగితేనే డిస్కంలకు ఆదాయం పెరుగుతుంది. అయితే ఎక్కువ ధరకు విద్యుత్‌ కొనుగోలు చేసే పారిశ్రామిక రంగం కుదేలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిపుణుల కమిటీ గురించి ప్రస్తావిస్తూ చంద్రబాబు సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని సీఎం దుయ్యబట్టారు. అసలు నిపుణుల కమిటీలో ఎవరున్నారో చూడకుండా, కమిటీ నివేదిక కూడా ఇవ్వకముందే ముఖ్య సలహాదారు అజేయ కల్లంతోపాటు అధికారులపై చంద్రబాబు బాధ, అక్కసు, ఆక్రోశం వెళ్లగక్కారని, నిపుణుల కమిటీతో అక్రమాలు బయటకు వస్తాయని చంద్రబాబుకు ఉన్న భయమే ఇందుకు కారణమని ఆయన వివరించారు. ఎస్పీడీసీఎల్‌ మాజీ సీఎండీ గోపాల్‌ రెడ్డి, ట్రాన్స్‌ కో మాజీ డైరెక్టర్‌ రామారావు, ప్రొఫెసర్‌ ఉషా రామచంద్ర, ఏపీఈఆర్సీ మాజీ సభ్యుడు గోపాల్‌ రావు, ఏపీ ట్రాన్స్‌ కో సీజీఎం వీఎస్‌ సుబ్బారావు సభ్యులుగా ఉన్న నిపుణుల కమిటీ పనిచేస్తోందని సీఎం జగన్‌ తెలిపారు. 

రాష్ట్ర ప్రజలకు అన్నీ తెలియాల్సిందే... 
‘చంద్రబాబు సుదీర్ఘంగా మాట్లాడిన అంశాలు విన్నాం. ఈ సభ ద్వారా గౌరవ సభ్యులకు, రాష్ట్ర ప్రజలకు కొన్ని విషయాలు చెప్పాల్సి ఉంది’ అంటూ ప్రసంగాన్ని ఆరంభించిన ముఖ్యమంత్రి జగన్‌ గత ఐదేళ్లలో జరిగిన విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల్లోని అక్రమాలను, దీనివల్ల జరిగిన నష్టాన్ని సాక్ష్యాలతో, గణాంకాలతో టీవీ స్క్రీన్లపై ప్రదర్శిస్తూ వివరించారు. ‘అసలు టీడీపీ హయాంలో ఏం జరిగిందనడానికి చిన్న ఉదాహరణ చెబుతా. రెన్యువబుల్‌ పవర్‌ పర్చేజ్‌ ఆబ్లిగేషన్స్‌ (ఆర్పీపీఓ) గురించి ప్రజలందరికీ తెలియాలి. కేంద్ర విద్యుత్‌ నియంత్రణ సంస్థ (సీఈఆర్సీ), ఆర్పీపీఓ మార్గదర్శకాలను రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ సంస్థ (ఏపీఈఆర్సీ) ఎప్పుడూ అనుసరించదు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తికి (చంద్రబాబును ఉద్దేశించి) ఈ విషయం తెలియదు. ఏటా ఏపీఈఆర్సీ కొన్ని మార్గదర్శకాలు ఖరారు చేసి ఆ మేరకు విద్యుత్‌ కొనుగోలు చేయాలని నిర్దేశిస్తుంది. మేం టీవీ తెరపై చూపుతున్నాం. మాజీ సీఎం చూడాలి’ అని సీఎం పేర్కొన్నారు. (సీఎం వివరిస్తుండగానే చంద్రబాబు, టీడీపీ సభ్యులు లేచి గోల చేస్తుండగా.. వారంతే. వారిది కుక్కతోక వంకర చందమే. వారితో పనిలేదు. వారి వైపు చూడవద్దు. వాస్తవాలు జనాలకు తెలియాలి... అంటూ సీఎం కొనసాగించారు) 

ఏపీఈఆర్సీ సూచనలు బేఖాతరు.. 
‘2015 – 16లో సంప్రదాయేతర ఇంధనం 5 శాతం కొనాలని ఏపీఈఆర్సీ నిర్దేశించగా రాష్ట్ర ప్రభుత్వం 5.59 శాతం వరకూ కొనుగోలు చేసింది. 2016–17లో ఆర్పీపీఓ 5 శాతం కొనాలని నిర్దేశించగా 8.6 శాతం, 2017 –18లో 9 శాతానికి 19 శాతం, 2018 –19లో 11 శాతానికి గాను ఏకంగా 23.4 శాతం కొనుగోలు చేశారు. థర్మల్‌ విద్యుత్‌ యూనిట్‌ రూ. 4.20కే అందుబాటులో ఉన్నా అధిక ధర చెల్లించి పవన విద్యుత్‌ కొనుగోలు చేశారు. దీనివల్ల రాష్ట్రం దారుణంగా నష్టపోయింది. మూడంటే మూడు కంపెనీల (గ్రీన్‌కో, రెన్యూ, మిత్రా) నుంచే 63 శాతం పవన విద్యుత్‌ను చంద్రబాబు సర్కారు కొనుగోలు చేసింది. నిబంధనలకు మించి ఎక్కువగా సంప్రదాయేతర ఇంధనాన్ని అధిక ధరకు కొనడంవల్ల 2016 – 17లో రూ. 436 కోట్లు, 2017 – 18లో రూ. 924 కోట్లు , 2018–  19లో రూ. 1,293 కోట్లు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఈ విధంగా మూడేళ్లలోనే రూ. 2,653 కోట్లు ఎక్కువ చెల్లించారు. 

యూనిట్‌కు రూ. 1.74 అధిక ధర చెల్లింపు 
ముందే చేసుకున్న పీపీఏ నిబంధనల ప్రకారం విద్యుత్‌ కొనుగోలు చేసినా, చేయకపోయినా ప్రభుత్వం థర్మల్‌ కేంద్రాలకు యూనిట్‌కు రూ. 1.10 చొప్పున చెల్లించాల్సిందే. గత సర్కారు యూనిట్‌ 4.20కి లభించే థర్మల్‌ విద్యుత్‌ను బ్యాక్‌ డౌన్‌ చేసి రూ. 4.84 ధరతో పవన, సౌర విద్యుత్‌ కొనుగోలు చేయడంతో థర్మల్‌ కేంద్రాలకు యూనిట్‌కు రూ. 1.10 ఉత్తిపుణ్యానికి చెల్లించాల్సి వచ్చింది. దీంతో యూనిట్‌ ధర (రూ. 4.84 ప్లస్‌ రూ. 1.10 కలిపి) రూ. 5.94కు చేరింది. అంటే యూనిట్‌కు రూ. 1.74 అదనం. ఈ విధంగా ఏటా రూ. 2,766 కోట్లు ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడింది. ఇతర రాష్ట్రాలతో పోల్చిచూస్తే నష్టం ఇంకా ఎక్కువే జరిగింది. ఉదాహరణకు గుజరాత్‌లో యూనిట్‌ విద్యుత్‌ రూ. 2.43కే అందుబాటులో ఉంది. దాంతో మనం చెల్లించిన ధర పోల్చి చూస్తే ఏటా మనం రూ. 3,831 కోట్లు ఎక్కువ చెల్లించినట్లు అవుతోంది. వితిన్‌ రెన్యువబుల్‌ పవర్‌ ఆబ్లిగేషన్, ఔట్‌ సైడ్‌ రెన్యువవల్‌ పవర్‌ ఆబ్లిగేషన్‌ రెండూ కలిపి ఒక్కో యూనిట్‌కు రూ. 1.74 చొప్పున ఎక్కువ చెల్లించిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఒక్క 2018 –19లోనే మనకు తెలిసి అక్షరాలా రూ. 2,766 కోట్లు ఎక్కువ పెట్టి విద్యుత్‌ కొన్నారు. అలాగే 2017–18లో రూ. 1,943 కోట్లు, 2016 –17లో రూ. 629 కోట్లు అధికంగా చెల్లించారు. ఈ స్థాయిలో అవినీతి చోటుచేసుకుంది.  

కేంద్రం నుంచి రాయితీ ఎంత? రాష్ట్రానికి జరిగిన నష్టమెంత? 
సంప్రదాయేతర విద్యుత్‌ కొనడం వల్ల మనకు కేంద్రం నుంచి ఒక్కో యూనిట్‌కు రూ. 1.54 రాయితీ వస్తోందని చంద్రబాబు చెప్పింది నిజమే. సంప్రదాయేతర ఇంధనాన్ని ప్రోత్సహించడం కోసం కేంద్రం ఈ రాయితీ ఇస్తోంది. అయితే మనకు ఆ విధంగా 2016– 17లో కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాయితీ కూడా రాలేదు. 2017– 18లో రూ. 20 కోట్లు, 2018– 19లో రూ. 320 కోట్లు మాత్రమే రాయితీ వచ్చింది. అయితే మూడేళ్లలో సంప్రదాయేతర ఇంధనం కొనడానికి అధిక మొత్తం చెల్లించడంవల్ల నష్టపోయింది రూ. 5,497 కోట్లు. ఒక్కసారి ఆలోచించండి. కేంద్రం నుంచి వచ్చిన అత్యల్ప ప్రోత్సాహకం చూడాలా? లేక వేల కోట్ల రూపాయల నష్టం చూడాలా ? అంత మొత్తం మనం భరించాలా? 

25 ఏళ్లకు పీపీఏలా? 
పదే పదే టెక్నాలజీ గురించి చంద్రబాబు మాట్లాడుతుంటారు. టెక్నాలజీ వల్ల ధరలు తగ్గుతున్నాయని చెబుతున్నారని గుర్తు చేశారు. మరి ఆ స్పృహ ఆ పెద్దమనిషికి ఉంటే అధిక ధర పెట్టి విద్యుత్తు కొనుగోలు చేసేందుకు ఏకంగా 25 ఏళ్ల కోసం ఇలా విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు ఎందుకు చేసుకున్నట్లు? ఇది ధర్మమేనా?. అంటే దానర్ధం.. ఏటా రూ. 2,766 కోట్ల చొప్పున 25 ఏళ్ల పాటు మనం నష్టపోతున్నట్లు కాదా! ఇతర రాష్ట్రాల్లో ఉన్న తక్కువ ధరతో చూస్తే ఆ నష్టం ఏకంగా దాదాపు రూ. 4 వేల కోట్లకు చేరుతుంది. ఇవన్నీ తెలిసి కూడా రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. ప్రజలపై ఇంత భారం మోపడం ధర్మమేనా? 

కోరుకున్న వ్యక్తిని చైర్మన్‌ను చేయడం కోసం... 
65 ఏళ్లలోపు వారినే ఏపీఈఆర్సీ చైర్మన్‌గా నియమించాలని చట్టం ఉంది. అయితే కోరుకున్న వ్యక్తిని ఏపీఈఆర్సీ చైర్మన్‌గా నియమించేందుకు ఇదే అసెంబ్లీలో 2016 ఏప్రిల్‌ 29న ఏపీఈఆర్సీ చట్టానికి చంద్రబాబు సవరణ చేసి చైర్మన్‌ వయసును 70 ఏళ్లకు పెంచారు. కుంభకోణాలు చేసేందుకు ఏకంగా చట్టాలనే మార్చడం ధర్మమేనా? ఇలాంటి వ్యక్తా ఏపీఆర్‌ఈసీ గురించి మాట్లాడేది? రాష్ట్రం విద్యుత్‌ సంక్షోభంలో ఉంటే పరిస్థితి చక్కదిద్దినట్లు బాబు చెబుతున్నారు. వాస్తవాలు చూస్తే దీనికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే రాష్ట్రంలో మిగులు విద్యుత్‌ ఉంటోంది. 2015– 16లో 642 మిలియన్‌ యూనిట్లు, 2016– 17లో 10, 473 మిలియన్‌ యూనిట్లు, 2017– 18లో 12,014 మిలియన్‌ యూనిట్లు, 2018– 19లో 7,629 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ మిగులు ఉందని ఏపీఈఆర్సీ లెక్కలు చెబుతున్నాయి. ఇలాంటప్పుడు వరుసగా విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు ఎందుకు చేసుకున్నారు?
 
తగ్గుతున్న జీవీఏ
సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం.. గ్రాస్‌ వాల్యూ యాడెడ్‌ (రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి– జీవీఏ) పారిశ్రామిక రంగం నుంచి క్రమంగా తగ్గుతోంది. అది 2014 –15లో 25.48 శాతం ఉంటే.. 2017–18కి వచ్చే సరికి 22.09 శాతానికి తగ్గిపోయింది. అంటే మనకు డబ్బులు చెల్లించే వినియోగదారులు క్రమంగా తగ్గిపోతున్నారని అర్థం. పారిశ్రామిక రంగం కుదేలవుతోంది. వారికి ఒక వైపు ప్రోత్సాహకాలు లేవు. మనం కరెంటు ఎక్కువ ధరకు కొంటున్నాం. అంత కంటే ఎక్కువ ధరకు పరిశ్రమలకు సరఫరా చేస్తున్నాం. దీంతో పారిశ్రామిక రంగం నానాటికీ దిగజారుతోంది.  

డిస్కమ్‌ల పరిస్థితి ఏమిటి? 
2015–16 నుంచి 2018–19 మధ్య ఎస్పీడీసీఎల్‌ విద్యుత్‌ కొనుగోలు వ్యయం, అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయ వివరాలు ఇలా..   

రాష్ట్రంలో ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్‌ అనే రెండు డిస్కమ్‌లు ఉన్నాయి. ఎస్పీడీసీఎల్‌ పరిధిలోనే ఎక్కువగా సంప్రదాయేతర విద్యుత్తు కొనుగోళ్లు సాగుతున్నాయి. 2015–16లో ఆ సంస్థలో కాస్ట్‌ ఆఫ్‌ పవర్‌ ఆపరేషన్స్‌ (విద్యుత్‌ కొనుగోలు మొత్తం ) రూ.14,920 కోట్లు కాగా, అన్ని రకాల ఆదాయం కేవలం రూ. 11,546 కోట్లు మాత్రమే. 2016– 17లో నిర్వహణ వ్యయం రూ. 15,076 కోట్లు కాగా, ఆదాయం రూ. 12,157 కోట్లు. 2017– 18లో విద్యుత్‌ కొనుగోలు మొత్తం రూ. 16,642 కోట్లు కాగా, వచ్చిన ఆదాయం రూ. 13,609 కోట్లు. 2018–19లో నిర్వహణ వ్యయం రూ. 19,139 కోట్లు కాగా, ఆదాయం రూ. 14,956 కోట్లు. డిస్కమ్‌లు ఏవిధంగా నష్టపోతున్నాయో దీనిని బట్టి అర్థమవుతోంది. ఈ పరిస్థితుల్లో డిస్కమ్‌లు బతకాలంటే ప్రభుత్వ సబ్సిడీ పెంచుతూ పోవాలి. 2015–16లో రూ. 2,318 కోట్లు, 2016–17లో రూ. 3,153 కోట్లు, 2017–18లో రూ. 4,167 కోట్లు, 2018– 19లో రూ. 4,937 కోట్లు చొప్పున ప్రభుత్వం డిస్కమ్‌లకు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చిది. మరి ఈ స్థాయిలో సబ్సిడీ భరించే పరిస్థితిలో రాష్ట్రం ఉందా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ప్రభుత్వ రెవెన్యూ లోటు 2015– 16లో రూ. 7,302 కోట్లు, 2016–17లో రూ. 17,194 కోట్లు, 2017–18లో రూ.16,152 కోట్లు, 2018–19లో రూ. 11,937 కోట్లుగా ఉంది. ఆ రకంగా ఈ 5 ఏళ్లలో రాష్ట్ర రెవెన్యూ లోటు ఏకంగా రూ. 66, 361 కోట్లకు చేరింది. అసలే ఆర్థిక లోటుతో ఉన్న రాష్ట్రంపై ఇలా విద్యుత్‌ కొనుగోళ్ల పేరుతో స్కాంలు చేస్తే ఎలా తట్టుకుంటుంది? ఈ అంశాలను ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇంత దారుణంగా కుంభకోణాలు చేస్తూ మళ్లీ ఏమీ ఎరుగనట్లు ఇక్కడ కూర్చొని వీరు (బాబు) మాట్లాడుతున్న మాటలు చేస్తూంటే వారు మనుషులు దశ దాటిపోయి రాక్షసులగా మారారా అనిపిస్తోంది.’ అని సీఎం జగన్‌ ఆవేదనతో ప్రసంగం ముగించారు. వెంటనే స్పీకరు సభను సోమవారానికి వాయిదా వేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top