పోలవరం పనుల్లో అపశృతి

Worker Died At Polavaram Project - Sakshi

రాడ్డు మీదపడి జార్ఖండ్‌ కార్మికుడు మృతి

స్పిల్‌వే పైనుంచి జారిపడి మరొకరికి తీవ్రగాయాలు

సాక్షి, పోలవరం రూరల్‌ : పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నిర్మాణ ప్రాంతంలో గేట్లు అమర్చే పనులు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఒక కార్మికుడు మృతిచెందాడు. మరో కార్మికుడు తీవ్రగాయాలతో రాజమండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రాజెక్టు స్పిల్‌వే 32వ బ్లాక్‌లో సోమవారం ఉదయం గేట్ల పనులు జరుగుతున్నాయి. క్రేన్‌ సహాయంతో గేట్లు దించుతున్న సమయంలో అక్కడే పనిచేస్తున్న జార్ఖండ్‌కు చెందిన భీమిలేష్‌ కుమార్‌ రామ్‌ (22)పై రాడ్డు పడి తీవ్రగాయాలయ్యాయి. పోలవరం వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతిచెందాడు.

15వ బ్లాక్‌లో పనిచేస్తున్న సతీష్‌ అనే కార్మికుడు స్పిల్‌వే పైనుంచి జారిపడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇతన్ని పోలవరం వైద్యశాలకు తరలించగా.. మెరుగైన చికిత్సకు రాజమండ్రికి తీసుకెళ్లారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంవల్లే భీమిలేష్‌ మృతిచెందాడంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. స్పిల్‌వే సమీపంలో ఉన్న నవయుగ ఏజెన్సీ క్యాంప్‌ కార్యాలయానికి చేరుకుని ఆగ్రహంతో రాళ్లు రువ్వడంతో అక్కడున్న ఓ వాహనం స్వల్పంగా దెబ్బతింది. అక్కడి నుంచి 150 మంది కార్మికులు నవయుగ గెస్ట్‌హౌస్‌కు వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. సీఐ, స్పెషల్‌ బ్రాంచ్‌ ఎస్సై, నవయుగ ఏజెన్సీ ప్రతినిధులు అక్కడికి చేరుకుని వారితో చర్చలు జరిపారు. తమకు ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టడంలేదని కార్మికులు ఆరోపించారు. దీంతో లేబర్‌ కాంట్రాక్టరుతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళన విరమించి వెనుదిరిగారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top