నిర్వాసితులకు అన్యాయం జరిగితే ఊరుకోం | vamsadhara project in srikakulam | Sakshi
Sakshi News home page

నిర్వాసితులకు అన్యాయం జరిగితే ఊరుకోం

Feb 29 2016 12:01 AM | Updated on May 29 2018 4:26 PM

వంశధార నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి

వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి
 శ్రీకాకుళం అర్బన్: వంశధార నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సాగునీటి ప్రాజెక్టుల్లోని నిర్వాసితుల పునరావాసం పట్ల టీడీపీ ప్రభుత్వం ఏమాత్రం బాధ్యతగా వ్యవహరించడం లేదన్నారు. దారుణ నిర్లక్ష్యంతో నిర్వాసితులను సర్వనాశనం చేస్తుందన్నారు. తోటపల్లి ప్రాజెక్టు నిర్వాసితుల పోరాట ఫలితంగా పునరావాసంలో అనేక మార్పులు వచ్చినా వాటిని సక్రమంగా అమలు జరపడం లేదని ఆరోపించారు.
 
  ప్రభుత్వ లెక్క ప్రకారం యువతను మినహాయించి వంశధార నిర్వాసిత కుటుంబాలు 7,104 ఉండగా ఇప్పటివరకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది మూడు వేలమందికేనని చెప్పారు. రిజర్వాయర్ పనులు ప్రారంభించి పదేళ్లు పూర్తయినప్పటికీ ఇప్పటికీ ఒక కొలిక్కి రాకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం ఈ ఏడాది ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని ప్రకటిస్తోందని, ఆరునెలల్లో ప్రాజెక్టు పూర్తిచేస్తే నిర్వాసితుల పరిస్థితి ఏమిటన్నారు.
 
 ఇంతవరకూ ఇళ్ల స్థలాలే ఇవ్వలేదని, కొంతమందికి 5 సెంట్లు, మరికొంతమందికి 2 సెంట్ల స్థలాన్ని కేటాయించారన్నారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా నీటిని విడుదల చేస్తే ఆ నీటిలో వారిని ముంచేందుకా అని ప్రశ్నించారు. 2005లో అప్పటి ధరల్లో నిర్వాసితుల ఇళ్ల నిర్మాణానికి రూ. 53 వేలు నిర్ణయించగా ఇప్పుడు కూడా అంతే మొత్తం ఇస్తామనడం భావ్యం కాదన్నారు. అప్పటికీ ఇప్పటికీ 10 రెట్లు ధరలు పెరిగాయని గుర్తుచేశారు. ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ చూస్తూ ఊరుకోదని, అన్యాయానికి గురవుతున్న నిర్వాసితుల పక్షాన పోరాటం చేస్తామని ఆమె హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement