ఆంధ్రప్రదేశ్‌ను ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ రాష్ట్రాలుగా విభజించాలని ఆచార్య ఎన్‌జీ రంగా ఫౌండేషన్ అధ్యక్షుడు బండ్లమూడి సుబ్బారావు కోరారు.
పర్చూరు, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్‌ను ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ రాష్ట్రాలుగా విభజించాలని ఆచార్య ఎన్‌జీ రంగా ఫౌండేషన్ అధ్యక్షుడు బండ్లమూడి సుబ్బారావు కోరారు. మండలంలోని వీరన్నపాలెంలో మంగళవారం ఎన్‌జీ రంగా ఫౌండేషన్, ఆంధ్రా జాయింట్ యాక్షన్ కమిటీలు కలిసి ప్రత్యేకాంధ్ర ఉద్యమ కార్యాచరణ కోసం సమావేశం ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా డాక్టర్ బండ్లమూడి సుబ్బారావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను మూడు రాష్ట్రాలుగా విభజించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి వినతిపత్రం సమర్పించినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌ను యూటీగా చేయడంగానీ, శాశ్వత ఉమ్మడి రాజధానిగా చేయడం గానీ అంగీకరించమని, విజయవాడను ఆంధ్రరాష్ట్ర రాజధాని చేయాలని తీర్మానాలు చేశారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటును ముందుచూపుతో వ్యతిరేకించిన ఆచార్య ఎన్‌జీ రంగా ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని తీర్మానంలో పేర్కొన్నారు.