నేడు సీఎం రాక | Today, the arrival of CM | Sakshi
Sakshi News home page

నేడు సీఎం రాక

Jan 19 2015 1:51 AM | Updated on Aug 17 2018 2:08 PM

నేడు సీఎం రాక - Sakshi

నేడు సీఎం రాక

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం మంగళగిరికి సమీపంలోని ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం(ఏఎన్‌యూ)కు విచ్చేస్తున్నారు.

సాక్షి, గుంటూరు :  రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం మంగళగిరికి సమీపంలోని ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం(ఏఎన్‌యూ)కు విచ్చేస్తున్నారు. మూడురోజులపాటు నిర్వహించే ఇండియన్ యూత్ సైన్స్ కాంగ్రెస్ సదస్సులో ఆయన పాల్గొంటారు. సీఎం ఉదయం 10 గంటలకు ఏఎన్‌యూకు చేరుకుని మధ్యాహ్నం 12 గంటల వరకు సదస్సులోనే ఉంటారు. అనంతరం బయలుదేరి విజయవాడ వెళతారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే, అర్బన్ ఎస్పీ రాజేష్‌కుమార్‌లు పర్యవేక్షించారు. ఏఎన్‌యూ వద్ద ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, బందోబస్తు కోసం పోలీసు బలగాలను భారీగా వినియోగిస్తున్నారు.
 
 సీఎం కోసం ఫార్మసీ కళాశాల క్రీడా మైదానంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. యూత్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు జరిగే డైక్‌మెన్ ఆడిటోరియంను పోలీసులు ఇప్పటికే  తమ ఆధీనంలోకి తీసుకున్నారు. హెలిప్యాడ్‌తో పాటు ఏఎన్‌యూ పరిసరాల్లో డాగ్, బాంబు స్క్వాడ్‌లతో తనిఖీలు నిర్వహించారు.
 
అర్బన్ ఎస్పీ రాజేష్‌కుమార్ శనివారం నుంచి పలుమార్లు ఏఎన్‌యూని సందర్శించి బందోబస్తు ఏర్పాట్లతోపాటు, వీవీఐపీ, వీఐపీ వాహనాల పార్కింగ్, హెలిప్యాడ్ ఏర్పాట్లు, డైక్‌మెన్ ఆడిటోరియంలో వసతులను పరిశీలించారు.
 
 సీఎంను కలిసేందుకు వచ్చే పార్టీ నాయకులకు ఎక్కడ పార్కింగ్ ఏర్పాటు చేయాలనే దానిపై అధికారులతో చర్చించారు. ఏఎన్‌యూ వీసీ ఆచార్య వియ్యన్నారావుతో చర్చించి బందోబస్తు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
 
సీఎం బందోబస్తుకు భారీగా పోలీస్ బలగాలు ...
సీఎం రాక సందర్భంగా ఆచార్య నాగార్జున యూనివర్శిటీ పరిసరాల్లో బందోబస్తు కోసం పోలీసు బలగాలను భారీగా తరలించారు.అర్బన్ ఎస్పీ రాజేష్‌కుమార్ పర్యవేక్షణలో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 16 మంది సీఐలు, 30 మంది ఎస్‌ఐలు, 500 మంది కానిస్టేబుళ్లు, 100 మంది ఆర్మ్‌డ్ రిజర్వ్ ఫోర్సు, 200 మంది హోంగార్డులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.  అర్బన్ అడిషనల్ ఎస్పీలు భాస్కరరావు, శ్రీనివాస్‌లు ఆదివారం సాయంత్రం వీరికి విధులను కేటాయించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ ఉన్నతాధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
 
సీఎం చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లా నుంచి హెలికాప్టర్‌లో ఏఎన్‌యూకు చేరుకుని కార్యక్రమం ముగిసిన తరువాత తిరిగి హెలికాఫ్టర్‌లోనే విజయవాడ వెళతారు.
 
ఒకవేళ రోడ్డుమార్గాన వెళ్లాల్సి వచ్చినా ఆ ఏర్పాట్లు కూడా చేసినట్టు  అర్బన్ ఎస్పీ రాజేష్‌కుమార్ తెలిపారు. సీఎం కార్యక్రమానికి పార్టీ నాయకులకు ఆహ్వానం లేదని, డైక్‌మెన్ ఆడిటోరియంలోకి వెళ్లే వారికి గేట్‌పాస్‌లు ఇస్తున్నారని, వారిని మాత్రమే లోపలకు అనుమతిస్తామన్నారు. ఒకవేళ పార్టీ నాయకులతో సీఎం మాట్లాడతామని చెబితే ఆ మేరకు ఏర్పాట్లు చేసి అనుమతిస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement