నిబంధనలు పాటించని కోల్డ్ స్టోరేజీలపై చర్యలు | Terms of adopted cold storage on the actions | Sakshi
Sakshi News home page

నిబంధనలు పాటించని కోల్డ్ స్టోరేజీలపై చర్యలు

Oct 17 2014 1:13 AM | Updated on Sep 13 2018 5:11 PM

కోల్డు స్టోరేజీల నిర్వాహకులు అగ్నిమాపక శాఖ నిబంధనలను పాటించడం లేదని, ఇలాంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని రీజినల్ అగ్నిమాపకశాఖ అధికారి జి.వి.నారాయణ చెప్పారు.

కొత్తపేట(గుంటూరు): కోల్డు స్టోరేజీల నిర్వాహకులు అగ్నిమాపక శాఖ నిబంధనలను పాటించడం లేదని, ఇలాంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని రీజినల్ అగ్నిమాపకశాఖ అధికారి జి.వి.నారాయణ చెప్పారు. గురువారం ఆయన జిల్లా అగ్నిమాపక శాఖ కార్యాలయ సాధారణ పరిశీలనకు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శీతల గిడ్డంగుల నిర్వాహకులు అగ్నిమాపక శాఖ సూచనలను బేఖాతరు చేస్తున్నారని, అగ్ని ప్రమాదాలను నిలువరించే ముందస్తు పరికరాలను ఏర్పాటు చేయడం లేదని మండిపడ్డారు. ఇలాంటివారు ఎంతటివారైనా ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. వీటితోపాటు నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలలు, సినిమా హాళ్లు, ప్రైవేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని అన్నారు. కేవలం రెండు మూడు గదుల్లో, అగ్నిమాపక వాహనం తిరగలేని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. 2009 నుంచి అనుమతులను రెన్యువల్ చేసుకోని పాఠశాలలు, సినిమా హాళ్లు, ప్రైవేట్ ఆస్పత్రులు, బహుళ అంతస్థుల యజమాన్యాలపై కోర్టులో కేసులు వేయనున్నామని వెల్లడించారు.
 
గురజాల, ప్రత్తిపాడుల్లో ఫైర్ స్టేషన్లు
డివిజన్ కేంద్రం గురజాల, ప్రత్తిపాడుల్లో నూతనంగా ఫైర్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు నారాయణ తెలిపారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని, అనుమతులు రాగానే అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
 
విజయవాడలో సిద్ధమవుతున్న డీజీ కార్యాలయం
విజయవాడలో అగ్నిమాపక శాఖ డెరైక్టర్ జనరల్ కార్యాలయం సిద్ధమవుతోందని నారాయణ వెల్లడించారు. ప్రస్తుతం భవనం ప్రారంభ దశలో ఉందని, రెండు నెలల్లో అందుబాటులోకి వస్తుందని వివరించారు. అప్పుటినుంచి శాఖ పరమైన కార్యకలపాలను విజయవాడ నుంచి నిర్వహిస్తారని తెలిపారు. ఆయన వెంట డీఎఫ్‌వో ఎం.ఎ.క్యూ.జిలానీ, ఏడీఎఫ్‌వో రత్నబాబు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement