పచ్చళ్ల సీజన్‌ వచ్చేసింది

Telugu Pickles Season Started Amid Coronavirus Pandemic - Sakshi

పచ్చడి మామిడికి గిరాకీ

కరోనా నిబంధనలు పాటిస్తూనే పనుల్లో బిజీ

తయారీలో మహిళలకు తోడుగా పురుషులు

పచ్చళ్ల సీజన్‌ వచ్చేసింది.. మార్కెట్‌లో మామిడి, ఊసిరి, పండు మిర్చి, చింతకాయలు సందడి చేస్తున్నాయి.. ఏడాదికి సరిపోను పచ్చళ్లు తయారు చేసుకోవడం ఆనవాయితీ.. మామిడికి మంచి గిరాకీ ఉంది.. ముద్దపప్పు, ఆవకాయకు తోడు నెయ్యి ఉంటే నోరురాల్సిందే.. ప్రస్తుతం లాక్‌డౌన్‌ ఉన్నా నిబంధనలు పటిస్తూనే పచ్చళ్ల తయారీలో మహిళలు మునిగిపోయారు.  

సాక్షి, విజయవాడ: ఊరగాయ పచ్చళ్ల తయారీకి కృష్ణా జిల్లా ప్రసిద్ధి. పచ్చడి నిల్వకు అనువుగా ఉండే కాయలు అందుబాటులో ఉన్నాయి. అందులో మామిడి పచ్చడికి అగ్రస్థానం ఉంది. ఇక్కడ తయారీ చేసినా పచ్చళ్లు దేశవిదేశాలకు సరఫరా చేస్తుంటారు. పల్లె నుంచి పట్టణాల వరకు ప్రజలు పచ్చళ్లు సొంతగా తయారు చేసుకునే అలవాటు తెలుగు ప్రజలకు ఎప్పటి నుంచో ఉంది. దీంతో మహిళలు రకరకాల ఊరగాయ పచ్చళ్లు, వడియాలు, అప్పడాలు, ఊరమిరపకాయలు ఏడాదికి సరిపడా సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. మామిడి తరువాత చింతకాయ, ఊసిరికాయ, మాగాయి  పచ్చళ్లు  ఉంటాయి. ఎవరి ఆర్థిక పరిస్థితి, ఇంట్లో తినేవారి తిండిపుష్టిని పట్టి ఏడాదికి సరిపోను పచ్చళ్లు తయారు చేసుకుని నిల్వ చేసుకుంటారు.

లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూనే...
కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. నిబంధనలు పరిధిలో మహిళలు వేసవిలో పట్టాల్సిన ఊరగాయపచ్చళ్లు పట్టేస్తున్నారు. ఉదయం లాక్‌డౌన్‌ సడలించిన సమయంలో మహిళలు హడావుడిగా మార్కెట్‌కు, రైతుబజార్లకు వచ్చి మామిడికాయలు కొనుగోలు చేసి అక్కడే అందుబాటులో ఉంటే మేదర్లు చేత ఆవకాయ ముక్కలు కొట్టించుకుని 9 గంటల లోగా ఇళ్లకు చేరుతున్నారు. అక్కడ నుంచి ఒకటి రెండు రోజుల్లో రుచికరమైన ఆవకాయ పచ్చడి సిద్ధం చేస్తున్నారు. పురుషులు ఇళ్లలోనే ఉండటం ఊరగాయ పచ్చళ్లు, వడియాలు తయారీలో మహిళలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు.  

మహిళల ముందు చూపు..
రాత్రికి రాత్రి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించినా ఆంధ్రా మహిళలు ఏమాత్రం బెదిరిపోలేదు. నెలరోజులుగా ఇళ్లలో కూరలు, సరుకులు లేకపోయినా.. కుటుంబాలు  పస్తులు ఉండకుండా నాలుగు పచ్చడి మెతుకులతోనైనా భోజనం కానిచ్చేయడం వెనుక మహిళల ముందు చూపు  ఎంతో ఉంది. పచ్చళ్లకు తోడుగా వడియాలు, అప్పడాలు కలిపారంటే భోజనం సంపూర్ణంగా పూర్తయినట్లే. ప్రస్తుత వేసవిలో ఊరగాయపచ్చళ్లు పెట్టుకోకపోతే ఏడాదంతా ఇబ్బంది పడాల్సి వస్తుందని పద్మావతి అనే మహిళ ‘సాక్షి’కి తెలిపింది. లాక్‌డౌన్‌ ఎత్తి వేసే వరకు ఆగితే మామిడికాయలు పండిపోయి పచ్చడి పాడైపోతుందని, అందువల్ల తప్పని పరిస్థితుల్లో ఇప్పుడే పెట్టేస్తున్నామని చెబుతున్నారు.

నిరుపేదలకు ఉపాధి..
వెదురు కర్రతో తడికలు, బుట్టలు తయారు చేసుకునే మేదర్లకు ప్రస్తుత సీజన్‌లో మామిడి కాయలు ముక్కలుగా నరికి ఇచ్చి నాలుగు రూపాయలు సంపాదిస్తున్నారు. ఒక్కొక్క కాయను ముక్కలుగా కట్‌ చేయడానికి సైజును బట్టి రూ.5 నుంచి రూ.10 వసూలు చేస్తున్నారు. ప్రతి రోజు ఉదయం పూట మూడు గంటలు కష్టపడితే రూ.200 వరకు ఆదాయం వస్తోందని  కేదారేశ్వరపేట వంతెన వద్ద మామిడి కాయలు తరిగే ప్రసాద్‌ తెలిపాడు.

లోకమణికి డబ్బులు పంపిస్తున్న ఎన్నారైలు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top