
నరసాపురం రైల్వేస్టేషన్
పశ్చిమగోదావరి, నరసాపురం : ఇటు జిల్లాలోని డెల్టా, అటు తూర్పుగోదావరి జిల్లా రాజోలు, అమలాపురం, అంతర్వేది చుట్టుప్రక్కల ప్రాంతాల వారికి ఉపయోగపడే విధంగా నరసాపురం నుంచి హైదరాబాద్‌కు ప్రతి ఆదివారం ప్రత్యేక రైలును ప్రవేశపెట్టారు. ఈ నెల 6వ తేదీ నుంచి ఈ రైలు ప్రారంభమవుతుంది. వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ముందుగా మే, జూన్ నెలల్లో ఈ రైలును నడపనున్నారు. తరువాత కూడా అదే తరహాలో రద్దీ ఉంటే ఈ సర్వీస్‌ను శాశ్వతంగా కొనసాగిస్తారని నరసాపురం రైల్వేస్టేషన్ మాస్టర్ మధుబాబు తెలిపారు. ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు నరసాపురంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు ఈ రైలు హైదరాబాద్ చేరుకుంటుంది. 4 జనరల్ బోగీలతో కలిపి మొత్తం 18 కోచ్‌లు ఉంటాయి.
రిజర్వేషన్ సదుపాయం అందుబాటులో ఉందని స్టేషన్ మాస్టర్ చెప్పారు. ప్రస్తుతం నరసాపురం నుంచి గుంటూరు మీదుగా రాత్రి పూట నరసాపూర్ ఎక్స్‌ప్రెస్, పగటిపూట నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ నడుస్తున్నాయి. నరసాపురం, పాలకొల్లు, భీమవరం, ఉండి, ఆకివీడు ప్రాంతాల వారు, అటు తూర్పుగోదావరి జిల్లా నుంచి రాజోలు చుట్టుపక్కల ప్రాంతాల వారు ఇవే రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో రెండు నెలలు ముందుగా బుక్ చేసుకున్నా కూడా ఈ రైళ్లలో రిజర్వేషన్ దొరకని పరిస్థితి. పండుగలు, సెలవులు సమయాల్లో అయితే చాంతాడంత వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. ఈ నేపథ్యంలో వీకెండ్‌లో నడపబోతున్న ఈ ప్రత్యేక రైలు ప్రయాణికులకు ఎక్కువగా ఉపయోగపడనుంది.