11 మంది సస్పెన్షన్ | scandal in municipality property tax | Sakshi
Sakshi News home page

11 మంది సస్పెన్షన్

Jul 2 2014 4:47 AM | Updated on Sep 2 2017 9:39 AM

ఆస్తి పన్ను వసూళ్లలో అక్రమాలకు పాల్పడిన మునిసిపల్ ఉద్యోగులపై వేటు పడింది.

 నంద్యాల టౌన్: ఆస్తి పన్ను వసూళ్లలో అక్రమాలకు పాల్పడిన మునిసిపల్ ఉద్యోగులపై వేటు పడింది. నంద్యాల మునిసిపాలిటీలో తొమ్మిది మంది బిల్‌కలెక్టర్లను, ఇద్దరు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లను సస్పెండ్ చేస్తూ పురపాలక శాఖ రీజనల్ డెరైక్టర్ మురళీకృష్ణగౌడ్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ కుంభకోణంపై విచారణ జరపడానికి ప్రత్యేక అధికారిగా అడిషనల్ డెరైక్టర్ రమేష్‌బాబును నియమించే సూచనలు కనిపిస్తున్నాయి. మునిసిపాలిటీలో కొత్తగా నిర్మించిన దుకాణాలు, భవనాలు, అపార్ట్‌మెంట్లను కొలిచి కొందరు బిల్ కలెక్టర్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు..పన్నును నిర్ధారించారు. యజమానుల నుంచి భారీగా మామూళ్లు దండుకొని ఆస్తి పన్ను తగ్గించి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.

ఈ వ్యవహారాన్ని గత నెల 29వ తేదీన ‘సాక్షి’ బయట పెట్టింది. నంద్యాల మున్సిపాలిటీలో భారీగా ఆస్తి పన్ను స్వాహా చేశారంటూ వార్తా కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం ప్రభుత్వం దృష్టికి వెళ్లగా పురపాలక శాఖ మంత్రి నారాయణ సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డెరైక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జనార్దన్‌రెడ్డిని ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు ఆర్‌డీ మురళీకృష్ణగౌడ్ విచారణను చేపట్టారు. అక్రమాలు తేలడంతో తొమ్మిది మంది బిల్ కలెక్టర్లను, ఇద్దరు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

 సస్పెండైన వారు వీరే..: అమీర్‌అలీబేగ్, మద్దిలేటి, ప్రభాకర్, ఫజుల్ రహెమాన్, మల్లికార్జున, బీవీ రామసుబ్బయ్య, రసూల్(నంద్యాల), జీవీ కృష్ణమూర్తి(డోన్), వీసీ ఓబులేసు(ఆదోని), రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు వెంకటేశ్వరగౌడ్(డోన్), ఏసుదాసు(ఆదోని)లు సస్పెండయ్యారు. ఎంబుక్ అదృశ్యం కేసులో సస్పెండైన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణ, రిటైర్డు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సుబ్రమణ్యంలపై కూడా చర్యలు తీసుకోవాలని ఆర్‌డీ మురళీకృష్ణగౌడ్ ఆదేశించారు.

 ఆర్‌ఐని తప్పించిన వైనం..: మునిసిపల్ అధికారులు పంపిన నివేదికలో ప్రస్తుత ఆర్‌ఐ పేరును తప్పించినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ఆడిట్ అధికారులు పరిశీలించిన ఎంఎల్ రికార్డుల్లోని ఆర్‌ఐ పేరు కూడా ఉంది. ఇతని పేరును తప్పించాలని అధికార పార్టీకి చెందిన కొందరు నేతల నుండి ఒత్తిళ్లు వచ్చినట్లు తెలిసింది. గతంలో స్టేషనరీ కుంభకోణంలో సస్పెండైన ఇతన్ని రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా నియమించడం కూడా వివాదాస్పదమైంది. ఇతని పేరును తప్పించడంపై ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement