అక్షర పండుగ.. వసంత పంచమి

Saraswathi Homam in Veerampalem Temple West Godavari - Sakshi

30న వీరంపాలెం శైవక్షేత్రంలో సరస్వతీ హోమం  

సామూహిక అక్షరాభ్యాసాలు

తాడేపల్లిగూడెం రూరల్‌: ప్రతీ చిన్నారి జీవితంలోనూ బారసాల ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో అంతే ప్రాముఖ్యత అక్షరాభ్యాసానికి ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లలతో దేవాలయాల్లో ‘ఓనమాలు’ దిద్దించేందుకు ఆసక్తి చూపుతారు. అందులోనూ మేధా సరస్వతీ దేవి ఆలయం అంటే మరింత విశిష్టతను సంతరించుకుంటుంది. తెలంగాణలోని బాసర తర్వాత పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం శైవక్షేత్రంలో అనేకమంది దేవతామూర్తులు నిలయమయ్యారు. ఈ ప్రాంగణంలోనే బాసర తర్వాత అంతటి ప్రాముఖ్యత ఉన్న మేధా సరస్వతీ అమ్మవారు కొలువై ఉన్నారు. సామూహిక అక్షరాభ్యాసాలకు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు తమ పిల్లలతో ఇక్కడికి తరలివస్తుంటారు. ఆ తరుణం రానే వచ్చింది. అదే వసంత పంచమి. దీనిలో భాగంగానే ఈ నెల 30వ తేదిన పెద్ద సంఖ్యలో సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించేందుకు వీరంపాలెం శైవక్షేత్రం సిద్ధమవుతోంది.

రెండో దక్షిణకాశీగా వెలుగొందుతోంది వీరంపాలెం శ్రీబాలాత్రిపుర సుందరీ విద్యా, వైద్య, ఆధ్యాత్మిక పీఠం. ఇక్కడ శివరాత్రికి ఎంత ప్రాముఖ్యత ఉందో వసంత పంచమికి అంతే ప్రాముఖ్యత ఉంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ మేథా సరస్వతీ అమ్మవారు కొలువై ఉన్నారు. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజుగాను, అమ్మవారి జన్మదినోత్సవంగాను వసంత పంచమి, శ్రీపంచమిగా పేర్కొనవచ్చు. మాఘమాసంలో వచ్చే శుక్ల పంచమి రోజున ఈ పండుగను నిర్వహిస్తారు. 

బాసర తర్వాత వీరంపాలెం  
మే«ధా సరస్వతీ ఆలయంలో పవిత్రమైన రోజుల్లో వందలాది మంది చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. మేధస్సుకు ప్రతిరూపంగా చెప్పబడే దక్షిణామూర్తి అభిముఖంగా ఉండే ఇక్కడ సరస్వతీ అఖండ జ్ఞాన సిద్ధితో పాటు మంచి మేధస్సును సైతం అందిస్తుందని భక్తుల విశ్వాసం.

30న ప్రజ్ఞా సరస్వతీ హోమం  
వసంత పంచమి సందర్భంగా ఈ నెల 30వ తేదీన అఖండ ప్రజ్ఞా సరస్వతీ హోమం నిర్వహించనున్నాం. హోమంలో పాల్గొనే భక్తులు ముందుగా తమ గోత్రనామాలను నమోదు చేయించుకోవాలి. భక్తుల రాకను పురస్కరించుకుని వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయం వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.  –గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి, శ్రీబాలాత్రిపుర సుందరి పీఠం, వీరంపాలెం, తాడేపల్లిగూడెం మండలం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top