ఆగస్టు నుంచే ఇసుక కొత్త విధానం

Sand new policy from August - Sakshi

యుద్ధ ప్రాతిపదికన చర్యలకు ఆదేశాలు 

తక్కువకు కోట్‌ చేసిన వారికే కాంట్రాక్టు 

వీడియో కాన్ఫరెన్సులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సాక్షి, అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయించిన దానికంటే 15 రోజుల ముందే ఇసుక కొత్త విధానం ప్రారంభించేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని భూగర్భ గనులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. సెప్టెంబరు 5వ తేదీ నుంచి ఇసుక కొత్త విధానం అమల్లోకి తెద్దామని సీఎం ప్రకటించారని, అయితే ఆగస్టు 15వ తేదీ నుంచే అమలు చేద్దామని అధికారులకు మంత్రి మార్గనిర్దేశం చేశారు. బుధవారం ఆయన జిల్లా కలెక్టర్లు, భూగర్భ గనులు, జలవనరులు, రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రస్తుతం ప్రజలకు లభిస్తున్న ధరకంటే తక్కువకే ఇసుకను అందించాలన్నదే ముఖ్యమంత్రి ధ్యేయమన్నారు.

రెండు మూడు క్వారీలకు సమీపంలో ఒకటి చొప్పన ఇసుక స్టాక్‌ యార్డులు ఏర్పాటు చేసి అక్కడకు ఇసుక తరలించేందుకు కాంట్రాక్టరు ఖరారు కోసం టెండర్లు నిర్వహించాలని ఆదేశించారు. స్టాక్‌ యార్డు నుంచి వినియోగదారులు కోరిన ప్రాంతానికి ఇసుకను రవాణా చేసేందుకు కిలోమీటరుకు ఏయే వాహనాలకు ఎంతెంత చెల్లించాలో రవాణా శాఖ అధికారులతో రేటు ఖరారు చేయించాలని సూచించారు. తర్వాత దీనిని అప్పర్‌ ప్రైస్‌గా నిర్ణయించి రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించి ఎవరు తక్కువకు కోట్‌ చేస్తే వారికి కాంట్రాక్టు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఒక్కో సంస్థకు రెండు రీచ్‌లకు మించి అప్పగించరాదని మంత్రి పెద్దిరెడ్డి దిశా నిర్దేశం చేశారు. 

స్టాక్‌ యార్డుల వద్ద వే బ్రిడ్జిలు
ఇసుక రీచ్‌ల సమీపంలో వేబ్రిడ్జిలు గుర్తించాలని, లేకపోతే నిర్మించి సొంతంగా నిర్వహించే (బీఓఓ) పద్ధతిలో ఏర్పాటుకు టెండర్లు నిర్వహించాలని ఆదేశించారు. కొత్త విధానంలో ప్రజలకు ఇసుక సరఫరా బాధ్యతలను ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) నిర్వహిస్తుందని, ఈ మేరకు ఏపీఎండీసీని ప్రభుత్వ ఏజెంట్‌గా నియమిస్తామన్నారు. ఏయే ప్రాంతాల్లో ఇసుక రీచ్‌లు ఉన్నాయి? ఎంత పరిమాణంలో ఇసుక ఉంది? పర్యావరణ, ఇతర అనుమతులు ఏయే రీచ్‌లకు తీసుకోవాలో గుర్తించి త్వరగా అనుమతులు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. ఇసుకను స్టాక్‌ యార్డుల్లో ఎంతకు విక్రయించాలి, రవాణా చార్జీలు టన్నుకు ఎంత చెల్లించాలో తేల్చాలని ఆదేశించారు. అలాగే ఇసుకతోపాటు ఖనిజ రవాణా చేసే వాహనాలన్నింటికీ  జీపీఎస్‌ అమర్చాలని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో ట్రైబల్‌ సబ్‌ ప్లాన్‌ (టీఎస్‌పీ) ప్రకారం ఇసుక తవ్వకాలు, స్టాక్‌ యార్డులకు రవాణా బాధ్యతలను గిరిజన సొసైటీలకే అప్పగించాలని మంత్రి ఆదేశించారు. కొత్త పాలసీ అమల్లోకి వచ్చే వరకు ప్రజలకు ఇసుక కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. విజయవాడలో జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్సులో భూగర్భ గనుల శాఖ కార్యదర్శి శ్రీనివాస్‌ శ్రీ నరేష్‌ తదితరలు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top